Share News

నాలుగేళ్లుగా నాన్చుడే..!

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:24 AM

కృష్ణా యూనివర్సిటీకి వెళ్లే రహదారి నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. పన్నెండు అడుగుల వెడల్పుతో సింగిల్‌ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని డబుల్‌లైన్‌గా మార్పు చేస్తామని నాలుగు సంవత్సరాల క్రితం పాలకులు హామీ ఇచ్చినా... ఇప్పటికీ టెండర్ల దశలోనే ఉంది. అడుగుకో గొయ్యిగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణం నిత్య నరకంగా మారుతోంది. యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే వణికిపోతున్నారు.

నాలుగేళ్లుగా నాన్చుడే..!

అధ్వానంగా కృషా ్ణయూనివర్సిటీకి వెళ్లే రహదారి

అడుగుకో గొయ్యి..

డబుల్‌లైన్‌ రోడ్డ్డుగా మార్పు చేస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లు

ఇప్పటికీ అతీగతీ లేని దుస్థితి

కృష్ణా యూనివర్సిటీకి వెళ్లే రహదారి నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. పన్నెండు అడుగుల వెడల్పుతో సింగిల్‌ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని డబుల్‌లైన్‌గా మార్పు చేస్తామని నాలుగు సంవత్సరాల క్రితం పాలకులు హామీ ఇచ్చినా... ఇప్పటికీ టెండర్ల దశలోనే ఉంది. అడుగుకో గొయ్యిగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణం నిత్య నరకంగా మారుతోంది. యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే వణికిపోతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం-కోన రహదారి వెంబడి కోన, పల్లెతుమ్మలపాలెం, పాతేరు, పోలాటితిప్ప, కొనకళ్ల గణపతినగర్‌ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల ప్రజల రాకపోకలకు ఈ రహదారి ఒక్కటే మార్గం. వేలాదిమంది ప్రజలు ఈ గ్రామాల నుంచి నిత్యం ఈ రహదారి గుండానే రాకపోకలు సాగించాలి. ఈ రహదారి శివగంగ సెంటరు మలుపు నుంచి పల్లెతుమ్మలపాలెం గతుకులమయంగా మారింది. కృష్ణా యూనివర్సిటీ, రుద్రవరం గురుకుల జూనియర్‌ కళాశాలకు వెళ్లాలన్నా ఇదొక్కటే మార్గం. యూనివర్సిటీలో చదివే 700 మందికిపైగా విద్యార్థులు, 200 మంది అధ్యాపకులు, ఇతర సిబ్బంది. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. యూనివర్సిటీకి రాకపోకలు సాగించేవారికి కాలేఖాన్‌పేట సెంటరు నుంచి కష్టాలు ప్రారంభమవుతాయి. ఏడాది క్రితం యూనివర్సిటీలో పీజీ కోర్సు చదుతున్న చల్లపల్లికి చెందిన విద్యార్థి ఒకరు వెనుక నుంచి లారీ రావడంతో ఆ వాహనం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గోతుల్లోకి వాహనం వెళ్లి కిందపడి గాయాలపాలై మరణించాడు.

ఈ రహదారిలో సరుకు రవాణా

రహదారి వెంబడి గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల చేపలు, రొయ్యల చెరువులున్నాయి. వీటి నుంచి వందలాది టన్నుల మత్స్యసంపద ప్రతిరోజూ ఇతర రాష్ర్టాలకు రవాణా అవుతుంటుంది. గిలకలదిండి హార్బర్‌ పనుల్లో భాగంగా ఈ రహదారి వెంబడి భారీ లోడుతో టిప్పర్లను నడపడంతో ఈ రహదారి మరింతంగా దెబ్బతింది. ఈ వాహనాల రాక నిలిచినా ఈ రహదారిని అభివృద్ధి చేయకుండా పాలకులు జాప్యం చేస్తుండటం గమనించదగ్గ అంశం.

హామీ ఇచ్చి నాలుగేళ్లు

నాలుగేళ్ల క్రితం మంత్రి హోదాలో ఉన్న పేర్ని నాని కృష్ణా యూనివర్సిటీని రెండు, మూడు దఫాలుగా సందర్శించారు. ఈ సమయంలో వీసీతో పాటు ఇతర ప్రొఫెసర్లు, అధ్యాపకులు కృష్ణా యూనివర్సిటీ వరకైనా రహదారిని అభివృద్ధి చేయాలని మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. శివగంగ సెంటరు సమీపంలోని మంగలేరు వంతెన నుంచి యూనివర్సిటీ వరకు 2,100 మీటర్ల మేర డబుల్‌లైన్‌ రోడ్డుగా మార్పు చేస్తామని అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న పేర్ని నాని హామీ ఇచ్చారు. ఈ రహదారి నిర్మాణానికి సర్వే చేసి రూ.10 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు తయారు చేశారు. టెండర్లు కూడా పిలిచారు. మూడేళ్లుగా రహదారి పనులు మాత్రం ప్రారంభించలేదు. ప్రస్తుతం వేసవికాలం వస్తోంది. ఈ వేసవిలోనైనా పనులు ప్రారంభిస్తారో లేదో తెలియని స్థితి నెలకొంది. కోన, పల్లెతుమ్మలపాలెం, పాతేరు, పోలాటితిప్ప తదితర గ్రామాల ప్రజలు కనిపించిన ప్రతి అధికారినీ తమ గ్రామాలకు వెళ్లే రహదారిని అభివృద్ధి చేయాలని వేడుకుంటున్నా కనికరించేవారే లేకుండాపోయారు. ఇటీవల రెండు ధఫాలుగా కలెక్టర్‌ యూనివర్సిటీకి వచ్చారు. యూనివర్సిటీకి వెళ్లే రహదారిని అభివృద్ధి చేయిస్తామని ఆయన చెప్పారు. అయినా పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో ఎన్నికలు జరిగితే ఈవీఎంలను భద్రపరచడం, ఓట్ల లెక్కింపు కార్యక్రమం కృష్ణా యూనివర్సిటీలోనే ఉంటుంది. అప్పటికైనా ఈ రహదారికి కనీస మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.

తాగునీటి పైప్‌లైన్‌, విద్యుత్‌ స్తంభాలను మారిస్తేనే...

మచిలీపట్నం-కోన రహదారిని యూనివర్సిటీ వరకు అభివృద్ధి చేయాలంటే రోడ్డు అడుగుభాగాన ఉన్న తాగునీటి పైప్‌లైన్‌, రహదారి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాలను మార్చాల్సి ఉంది. ఈ రెండు పనులను చేసేందుకు అంచనాలు రూపొందించినా మార్పు చేయకుండా జాప్యం చేస్తున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:24 AM