Share News

నాది మీ పార్టీనే..

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:47 AM

రాష్ట్రంలో అధికారం మారడంతో నిన్నటి వరకు వైసీపీకి తొత్తులుగా పనిచేసిన కొందరు అధికారులు నేడు మనుగడ కోసం పోరాటం మొదలుపెట్టారు. ఉన్న సీటును కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. దేవదాయశాఖలో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల అధికారిణిగా ఉన్న ఉద్యోగి తీరే దీనికి నిదర్శనం. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి వీరభక్తురాలిగా గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం తన విధేయతను మార్చేసుకున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోని ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ తాను టీడీపీ మద్దతురాలినని, తనను ప్రస్తుతం ఉన్న హోదాల్లోనే కొనసాగించాలని విన్నపాలు చేసుకుంటున్నారు. ఈమె తీరుపై దేవదాయశాఖ ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు.

నాది మీ పార్టీనే..

ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వానికి విజయసాయి భక్తురాలి విన్నపాలు

సర్కార్‌ మారడంతో మారిన విధేయత

టీడీపీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు

సీటు కోసం దేవదాయ శాఖ ఉన్నతాధికారిణి పాట్లు

రెండు జిల్లాలకు ఆమే అధికారిణి..తొలి నుంచీ ఆరోపణలే

రాష్ట్రంలో అధికారం మారడంతో నిన్నటి వరకు వైసీపీకి తొత్తులుగా పనిచేసిన కొందరు అధికారులు నేడు మనుగడ కోసం పోరాటం మొదలుపెట్టారు. ఉన్న సీటును కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. దేవదాయశాఖలో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల అధికారిణిగా ఉన్న ఉద్యోగి తీరే దీనికి నిదర్శనం. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి వీరభక్తురాలిగా గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం తన విధేయతను మార్చేసుకున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోని ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ తాను టీడీపీ మద్దతురాలినని, తనను ప్రస్తుతం ఉన్న హోదాల్లోనే కొనసాగించాలని విన్నపాలు చేసుకుంటున్నారు. ఈమె తీరుపై దేవదాయశాఖ ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు.

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డి అండతో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల ఉద్యోగిగా ఉన్న అధికారిణి చెలరేగి పోయారు. ఆయన ఆశీస్సులతోనే ఆమె 2022లో కృష్ణా జిల్లాలోని నెమలి దేవస్థానానికి బదిలీ అయ్యారు. వెనువెంటనే ఎన్టీఆర్‌ జిల్లా బాధ్యతలను కూడా ఆమెకే అప్పగించారు. ఒకే ఉద్యోగికి రెండు కీలక పదవులు కట్టబెట్టడం.. అది కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి ఇవ్వడంపై విమర్శలు రావడంతో కొద్ది కాలానికి ఎన్టీఆర్‌ జిల్లాకు వేరే అధికారిణిని నియమించారు. అయితే ఆమెకు బాధ్యతలు అప్పచెప్పకుండా ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి ఇబ్బందులకు గురి చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో చివరికి బాధ్యతలు అప్పగించి, ఈమె కృష్ణాజిల్లా బాధ్యతలు చేపట్టారు. అయితే విజయసాయి అండ ఉండటంతో పట్టుబట్టి మరీ కొద్ది రోజులకే మళ్లీ ఎన్టీఆర్‌ జిల్లా అధికారిణిని బదిలీ చేయించి, ఆ స్థానంలో అదనపు బాధ్యతలు తనకే వచ్చేలా అదేశాలు జారీ చేయించుకున్నారు. రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించినా ఆమె ఏ రోజూ సక్రమంగా కార్యాలయానికి వచ్చే వారు కాదని ఉద్యోగులే చెబుతారు. ఓ దశలో స్పందన కార్యక్రమానికి వరుసగా గైర్హాజరవుతుండటంతో కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఆమెను మందలించి షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేశారు. విజయసాయి అండతో తనకు నచ్చిన వారికి ఆలయాల్లో పోస్టులు ఇప్పించుకుని చక్రం తిప్పారు. ఉన్నతాధికారులను లెక్కచే యకుండా అధికార జులుం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్నపుడు ఆయన అండతో దేవదాయశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారితో కలిసి పెద్దఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడినట్టు ఈ అధికారిణిపై ఆరోపణలు ఉన్నాయి. విధులు సరిగా నిర్వహించమ న్నందుకు ఏకంగా తన పైఅధికారిపై ఆరోపణలు చేసి, కార్యాలయంలోనే ఆయనపై ఇసుకు చల్లిన ఘనత ఈమె సొంతం. ఈ వ్యవహారంలో సదరు అధికారి ఏకంగా ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయారు. కార్యాలయంలో ఉన్నతాధికారిపై అవిధేయత చూపినందుకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.

అడ్డగోలుగా చేసేశారు..

సదరు అధికారిణి విజయసాయి అండతో అడ్డగోలుగా వ్యవహరించారు. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఆదేశాలు ఇచ్చారు. వన్‌టౌన్‌ సామారంగం చౌక్‌లో 1916లో చల్లంరాజు వెంకట శేషయ్య ధర్మసత్రాన్ని నిర్మించారు. దాత ఆశయాల మేరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బాటసారులకు ఆ భవనంలో వసతులు కల్పించి హిందూ ప్రచారానికి వినియోగించాలి. సత్రం నిర్వహణకు ఉపయోగపడేలా 11 షాపులను నిర్మించి, వాటి అద్దెను వాడుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దేవదాయశాఖ ఆధీనంలో ఈ సత్రం ఉంది. ఈ క్రమంలో 2023లో మొత్తం 11 షాపులకు వేలంపాట నిర్వహించారు. వీటిలో రెండు షాపులకు దేవదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా జీవో నెంబర్‌ 426 అమలు చేయకుండా 11 ఏళ్లకు లీజుకి ఇచ్చేశారు. నిబంధనల ప్రకారం ఏ షాపునైనా వేలం నిర్వహించి కేవలం 3 ఏళ్ల కాలానికే లీజుకు ఇస్తారు. ఈ వ్యవహారంలో ఈ అధికారిణి, దేవదాయశాఖ కమిషనరేట్‌లో మరో కీలక అధికారి కుమ్మక్కయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సుమారు కోటి రూపాయలు చేతులు మారినట్లు దేవదాయశాఖ అధికారులే బహిరంగంగా ఆరోపించారు. దీనిపై వన్‌టౌన్‌కు చెందిన పలువురు వ్యాపారులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా, రాజకీయ ఒత్తిళ్లతో దాన్ని పక్కనపడేసినట్టు తెలుస్తోంది. ఆలయాలు, చారిటబుల్‌ ట్రస్ట్‌లలో తనిఖీలకు వెళితే వాటి స్థాయిని బట్టి ముడుపులు వసూలు చేస్తారన్న ఆరోపణలు ఈ అధికారిణిపై ఉన్నాయి. వివాదాస్పద, లీజుకు సంబంధించిన దేవదాయశాఖ భూములు విషయంలో ఎన్‌వోసీ ఇవ్వాలంటూ రూ.లక్ష సమర్పించుకోవాలని, తనిఖీల సమయంలో రూ.అరలక్ష నగదు, కనీసం పదివేల రూపాయల విలువగల పట్టుచీర సమర్పించాల్సిందేనని ఆ శాఖలోనే ఉద్యోగులే బహిరంగంగా చెబుతుంటారు.

విధేయత మార్చేశారు..

వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం రావడంతో ఈ అధికారిణి తన విధేయతను కూడా మార్చేశారు. ఏ రకంగానైనా సరే ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే తనకు విధులు కేటాయింప చేసుకునేందుకు ఆమె అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, మండలి బుద్ధప్రసాద్‌, యార్లగడ్డ వెంకట్రావు, శ్రీరాం తాతయ్యను కలిశారు. కృష్ణాజిల్లా బాధ్యతలతోపాటు ఎన్‌టీఆర్‌ జిల్లా అదనపు బాధ్యతల్లోనే తనను కొనసాగించాలని వారికి విన్నవించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయా స్థానాల్లో కొనసాగించడం కుదరకపోతే రెండు జిల్లాల్లోనే ఒక్కడో ఒకచోట తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్టు చెబుతున్నారు. ప్రసిద్ధ మోపిదేవి దేవస్థానం ఈవో కానీ తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా కానీ నియమించాలని కోరుతున్నట్లు సమాచారం.

Updated Date - Jun 17 , 2024 | 01:47 AM