మహా శివరాత్రికి ముస్తాబు
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:28 AM
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. శుక్రవారం నాడు ఆలయంలో రామలింగేశ్వరస్వామి, పార్వతీ దేవి అమ్మవార్ల కళ్యాణం కన్నులపండువగా జరగనుంది.
పెనమలూరు, మార్చి7 : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. శుక్రవారం నాడు ఆలయంలో రామలింగేశ్వరస్వామి, పార్వతీ దేవి అమ్మవార్ల కళ్యాణం కన్నులపండువగా జరగనుంది. గ్రామంలో ఏభైకి పైగా ప్రభలను ఏర్పాటు చేశారు. లక్షమందికి పైగా భక్తులు హాజరయ్యే ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదుగురు డీఎస్పీలు, 12మంది సీఐలు, 30మంది ఎస్‌ఐలు, ఐదువందల మందికిపైగా సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు తెలిపారు. గన్నవరం డీఎస్పీ స్వయంగా భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. గురువారం దుర్గామల్లేశ్వరస్వామి ఈవో కేఎస్ రామారావు, ఆలయ అభివృద్ధి దాత సంగా నరసింహరావులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
నేటి కార్యక్రమ వివరాలు
శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాల అనంతరం బిల్వార్చన, పార్వతీదేవికి కుంకుమ పూజ నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు గ్రామ మంటపం వద్ద దేవస్థాన ప్రభకు ఎడ్లు కట్టి ఊరేగించేందుకు పాట కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి రాధాకృష్ణ కోలాటాలు, భజనలు కోయనృత్యాలు, భేతాళ వేషాలు, హిరాణి నృత్యాలు, మేళతాళాలతో గ్రామ ప్రభను అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 2.25గంటలకు రావి ఉదయకిరణ్, దీప్తి దంపతులచే కళ్యాణం నిర్వహిస్తారు.
దుర్గా ఘాట్ల వద్ద పటిష్ట ఏర్పాట్లు
పరిశీలించిన దుర్గగుడి ఈవో రామారావు
వన్‌టౌన్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణానదిలో స్నానాలు చేసేందుకు అత్యధిక సంఖ్యలో వచ్చే భక్లు కోసం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, పోలీసు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వేకువ జాము నుంచే భక్తులు తరలిరానున్నారు. బ్యారేజీ దిగువన స్నానాలకు నదిలో నీరు లేకపోవడంతో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. దుర్గాఘాట్‌లోకి విస్తృతంగా భక్తులు దిగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రముఖ పాత శివాలయంగా పేరున్న భ్రమరాంబ మల్లేశ్వలరాలయానికి భక్తులు అత్యధిక సంఖ్యలో రానున్న దృష్ట్యా ప్రత్యేక క్యూలను దేవస్థానం ఏర్పాటు చేసింది. మరోవైపు ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి ఆలయాన్ని పునరుద్దరించి ఇటీవలే భక్తులను అనుమతించారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భ క్తులు వస్తారని అంచనా. శివాలయాలలో వేకువ జామునుంచే అభిషేకాదులను ప్రారంభించనున్నారు. ఘాట్ల వద్ద పరిస్థితిని దుర్గగుడి ఈవో రామారావు స్వయంగా పరిశీలించారు. ఇదే క్రమంలో ఘాట్ల వద్ద, ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని ఘాట్ల వద్ద వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 300 మంది. భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలో 65 మంది. కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలోని ఘాట్ల వద్ద 25 మందిని నియమించారు.