Share News

హతవిధీ

ABN , Publish Date - May 26 , 2024 | 01:32 AM

పేరుకే పెద్ద కార్పొరేషన్‌.. ఇక్కడ ప్రతి పోస్టు ఖాళీనే. కీలకమైన పోస్టులకు ఇన్‌చార్జులే దిక్కు కావడంతో పాలన నత్తనడకన సాగుతోంది. పౌరులకు అందాల్సిన ప్రాథమిక సేవలు సైతం అందని దుస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కార్పొరేషన్‌లో కొన్నేళ్లుగా ఏర్పడిన ఈ పరిస్థితి కొత్త ప్రభుత్వం వచ్చాకైనా మారుతుందా.. అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.

హతవిధీ

మచిలీపట్నం కార్పొరేషన్‌లో కీలక పోస్టులన్నీ ఖాళీ

అసిస్టెంట్‌ కమిషనర్‌ బదిలీ, ఎంఈ దీర్ఘకాలిక సెలవు

కొరవడిన పర్యవేక్షణ.. పౌరులకు ఇబ్బందులు

మెడికల్‌ ఆఫీసర్‌ బదిలీతో పారిశుధ్యం అధ్వానం

కీలక పోస్టులకు ఇన్‌చార్జులే దిక్కు.. పని ఒత్తిడి

కార్పొరేషన్‌ కొత్త కార్యాలయ నిర్మాణం ఎప్పటికో..

కొత్త ప్రభుత్వంపైనే నగరవాసుల ఆశలు

పేరుకే పెద్ద కార్పొరేషన్‌.. ఇక్కడ ప్రతి పోస్టు ఖాళీనే. కీలకమైన పోస్టులకు ఇన్‌చార్జులే దిక్కు కావడంతో పాలన నత్తనడకన సాగుతోంది. పౌరులకు అందాల్సిన ప్రాథమిక సేవలు సైతం అందని దుస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కార్పొరేషన్‌లో కొన్నేళ్లుగా ఏర్పడిన ఈ పరిస్థితి కొత్త ప్రభుత్వం వచ్చాకైనా మారుతుందా.. అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.

మచిలీపట్నం టౌన్‌ : మచిలీపట్నం కార్పొరేషన్‌గా మారి ఐదేళ్లు కావస్తున్నా ఆశించిన సేవలు మాత్రం అందట్లేదు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం జరిగితే నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు ఖాళీగా ఉన్న పలు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పోస్టులు ఖాళీగా ఉండటంతో తక్షణ సేవలు అందుబాటులో లేకుండాపోతున్నాయి.

ఖాళీ పోస్టులు.. ఇన్‌చార్జులకు అదనపు బాధ్యతలు

ఇంజనీరింగ్‌ శాఖలో కీలకమైన ఎంఈ శ్రీకాంత్‌ సెలవులో ఉన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ల కారణంగా ఆయన దీర్ఘకాలిక సెలవు పెట్టారు. అలాగే, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, మూడు ఏఈల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ప్రతి ఫైలు కమిషనర్‌ దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. ఇక కార్పొరేషన్‌ పరిధిలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యం సబ్‌జైలుకు బదిలీ అయ్యారు. ఆ పోస్టు భర్తీ కాలేదు. గతంలో బాలసుబ్రహ్మణ్యం పారిశుధ్యంపై దృష్టి సారించారు. డంపర్‌బిన్‌ వద్ద చెత్తాచెదారం రోడ్డుపై పడకుండా చర్యలు తీసుకున్నారు. ఆయన బదిలీ కావడంతో చెత్తాచెదారం అలాగే ఉండిపోయింది. అలాగే, మెడికల్‌ ఆఫీసర్లు జారీ చేయాల్సిన సర్టిఫికెట్లు ఇన్‌చార్జిలే జారీ చేస్తున్నారు. కార్పొరేషన్‌లో కీలకమైన అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. గతంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసిన అనూష బదిలీ అయ్యాక ఆ పోస్టు భర్తీ కాలేదు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల విధులు పర్యవేక్షించే అధికారులుగా ఇన్‌చార్జిలే వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్‌లో కీలకమైన మరో పోస్టు మేనేజర్‌. ఇది కూడా ఖాళీగానే ఉంది. రెవెన్యూ విభాగంలో ఆర్వో పోస్టు గురించి రెండేళ్లుగా పట్టించుకున్న వారు లేరు. దీనివల్ల కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయ వ్యయాలపై సరైన పర్యవేక్షణ లేకుండాపోతోంది. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఒక అసిస్టెంట్‌ సిటీప్లానర్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఈ విభాగంలో మూడు సూపర్‌వైజర్‌ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అలాగే, డిప్యూటీ కమిషనర్‌, రెండు సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల పరిస్థితి కూడా అంతే. దీంతో ఇన్‌చార్జులపై పని ఒత్తిడి పెరిగింది.

కొత్త భవనం పరిస్థితేంటి?

నూతన ప్రభుత్వమైనా నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుందని నగర ప్రజలు ఆశిస్తున్నారు. ఖాళీలు భర్తీ చేయాలని టీడీపీ కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి, చిత్తజల్లు నాగరాము పలుమార్లు మేయర్‌, డిప్యూటీ మేయర్లను కోరుతూనే ఉన్నారు. అయినా చర్యలు తీసుకుంది లేదు. ఇక నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణాలు పునాదుల్లోనే ఉన్నాయి.

అదనపు బాధ్యతలు ఇచ్చి పనులు చేయిస్తున్నాం

కార్పొరేషన్‌లో పోస్టులు ఖాళీగా ఉండటంతో పలువురికి అదనపు బాధ్యతలు ఇచ్చి పనులు చేయి స్తున్నాం. పోస్టులు భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు లేఖలు రాశాం. పనులు ఎక్కడా ఆగకుండా చర్యలు చేపట్టాం. ఫైళ్లు త్వరగా క్లియర్‌ చేయడంపై దృష్టి సారిస్తాం. సచివాలయాల నుంచి వచ్చే ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నాం.

- బాపిరాజు, కమిషనర్‌

Updated Date - May 26 , 2024 | 01:32 AM