Share News

ములకలమ్మలో మళ్లీ తవ్వకాలు

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:17 AM

ములకలమ్మ చెరువును మళ్లీ మింగేస్తున్నారు. నెల రోజులుగా అక్రమంగా తవ్వకాలు సాగిస్తూ ఇటుక బట్టీలకు అమ్ముకుంటున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారుల అండ ఉండటంతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చినా కొద్దిరోజులు ఆపి మళ్లీ రాత్రిపూట తవ్వకాలు చేపడుతున్నారు. టీడీపీ నాయకులు.. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు.

ములకలమ్మలో మళ్లీ తవ్వకాలు
చెరువులో ఏర్పడిన గుంతలు

అధికారులు, అధికార పార్టీ అండతోనే..

నెల రోజులుగా ఇటుక బట్టీలకు తరలింపు

గన్నవరం, ఏప్రిల్‌ 11 : గన్నవరం మండలం వీరపనేనిగూడెం ములకలమ్మ చెరువులో వైసీపీ నాయకుల అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటుక బట్టీల ప్రయోజనార్థం జేసీబీలను పెట్టి రోజూ రాత్రివేళ సుమారు 300కు పైగా ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్‌, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పట్టించుకోవట్లేదు. గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ తంతు జరుగుతోంది. రాత్రయితే చాలు.. వందలాది ట్రాక్టర్లకు మట్టిని లోడ్‌ చేస్తున్నారు. ఇటుక బట్టీల నిర్వాహకులు తమ పొలాలు మెరక చేసుకుంటున్నామని చెబుతూ.. మట్టి తోలి, అక్కడి నుంచి ఇటుక బట్టీలకు తరలిస్తూ భవిష్యత్తు అవసరాలకు దాచిపెడుతున్నారు.

చీకటిపడితే చాలు..

గ్రామంలో వైసీపీకి చెందిన జేసీబీలు ఉండటంతో చీకటి పడితే చాలు.. ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీనిపై స్థానికులు అధికారులకు సమాచారం ఇస్తున్నా పట్టించుకోవట్లేదు. తవ్వకాలు లేనప్పుడు వచ్చి, పరిశీలించి, మామూళ్లు అందుకుని వెళ్లిపోతున్నారు. తవ్వకాలను అడ్డుకోవాలంటూ ఇరిగేషన్‌ అధికారులు.. తహసీల్దారు, పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నారు. రెవెన్యూ అధికారులేమో ఎన్నికల హడావిడి అంటూ పక్కకు తప్పుకొన్నారు. అయితే, ఎవరికి అందాల్సిన వాటాలు వారికి అందుతున్నాయని తెలుస్తోంది. వైసీపీ గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీని అడ్డుపెట్టుకుని ఈ తవ్వకాలు జరుపుతున్నారు. దాడులకు వెళ్లినప్పుడు వైసీపీ జేసీబీలైతే వదిలేయడం, వేరే వారివైతే కేసులు పెట్టడం చేస్తున్నారు. ఇటుక బట్టీల కోసం తవ్వకాలపై ఇప్పటికే పలుమార్లు గ్రామంలో వైసీపీ నాయకులు, తవ్వకందారుల మధ్య పంచాయితీలు జరిగాయి. అప్పట్లో ఇటుక బట్టీలకు మట్టి తరలించకుండా ఆపారు. అప్పట్లో గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, ఎంపీటీసీ, పీఏసీఎస్‌ అధ్యక్షుడి సమక్షంలో డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.5 లక్షల వరకూ వైసీపీకి చెందిన ఉప సర్పంచ్‌ బండి నాగసాంబిరెడ్డి తీసుకున్నాడని, ఇప్పటివరకు గ్రామాభివృద్ధికి ఉపయోగించలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ చేపడుతున్న అక్రమ తవ్వకాలు ఆపాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:17 AM