Share News

కూటమి కొలువులో మంత్రులెవరు?

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:41 AM

ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలూ వచ్చాయి.. రెండు జిల్లాలనూ టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్‌ చేసేసింది.. ఇక ఇప్పుడు అందరి చర్చ మంత్రివర్గ కూర్పుపైనే. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే గుసగుసలు ఇప్పటికే మొదలవ్వగా, ఆశావహుల లిస్ట్‌ కూడా భారీగానే పెరిగిపోతోంది. ఈనెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందనే సందిగ్ధం ఏర్పడింది.

కూటమి కొలువులో మంత్రులెవరు?

సీనియారిటీ రేసులో గద్దె రామ్మోహన్‌కు అందే అవకాశం

వైశ్య సామాజికవర్గం నుంచి శ్రీరాం తాతయ్య

బీసీ కోటాలో కొల్లు రవీంద్ర.. కాపు కోటాలో బొండా ఉమా

రేసులో గుడివాడ, గన్నవరం గేమ్‌ చేంజర్స్‌ రాము, యార్లగడ్డ

బీజేపీ కోటాలో సుజనా పేరు, జనసేన నుంచి బుద్ధప్రసాద్‌

పెరుగుతున్న ఆశావహుల సంఖ్య

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారనే చర్చ ప్రస్తుతం రెండు జిల్లాల్లో జోరుగా సాగుతోంది. రెండు జిల్లాలనూ కూటమి అభ్యర్థులు క్లీన్‌స్వీప్‌ చేయడంతో ఈసారి ఆశావహుల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ, జనసేన నుంచి హేమాహేమీలు ఉన్నారు. విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన సుజనా చౌదరి ఆ పార్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకోవచ్చని చెబుతున్నారు. అయితే, ఉమ్మడి కృష్ణాను ప్రాతిపదికన తీసుకుంటే ఆయనకు మరో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కృష్ణాజిల్లా నుంచి జనసేన తరఫున గెలుపొందిన మండలి బుద్ధప్రసాద్‌కు ఆ పార్టీ కోటాలో మంత్రి పదవి దక్కవచ్చని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు.

టీడీపీ జాబితా పెద్దదే..

రెండు జిల్లాల నుంచి టీడీపీ నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య చాలా పెద్దదే. వైశ్య సామాజికవర్గం నుంచి రాష్ట్రంలో ఇద్దరే గెలుపొందారు. వీరిలో సీనియారిటీపరంగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య) ముందు వరుసలో ఉంటారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన పార్టీకి విధేయుడిగా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో వైశ్య సామాజికవర్గాన్ని టీడీపీ వైపు మళ్లించడంలో ఆయన కృషి చాలానే ఉంది. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చని ఆయన అనుచరులు భావిస్తున్నారు. బీసీ సామాజికవర్గం నుంచి మాజీ మంత్రి, మచిలీపట్నం నుంచి గెలుపొందిన కొల్లు రవీంద్ర రేసులో ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాను పరిగణనలోకి తీసుకునే పక్షంలో నూజివీడు నుంచి గెలుపొందిన కొలుసు పార్థసారథి ఆయనకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. కాపు సామాజికవర్గం నుంచి విజయవాడ సెంట్రల్‌ నుంచి గెలుపొందిన బొండా ఉమా రేసులో ఉన్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందిన గద్దె రామ్మోహన్‌, గుడివాడ, గన్నవరం నుంచి వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు రేసులో ఉన్నారు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే ఒకసారి ఎంపీ, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గద్దె రామ్మోహన్‌కు అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారికి ఎదురొడ్డి, వారి అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని, టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపిన వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు పేర్లు సైతం మంత్రి పదవుల రేసులో వినిపిస్తున్నాయి.

Updated Date - Jun 07 , 2024 | 12:41 AM