Share News

మంత్రి గారా.. మజాకా!

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:34 AM

ఆయన పేరుకే ఎమ్మెల్యే.. కానీ రూ.3వేలు ఆదాయాన్ని కూడా వదలకుండా వసూలు చేయడంలో ఘనాపాటి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ట్రాక్టర్‌తో సొంత పొలం నుంచి మట్టి తోలుకున్నా ‘మామూలు’గా రూ.3వేల నుంచి రూ.5వేలు వసూలు చేసిన ఘనుడు. ఆ తర్వాత కాలం కలిసొచ్చి మంత్రి అయ్యారు. గెలిచిన నియోజకవర్గంతోపాటు సొంత నియోజకవర్గంపైనా దృష్టి సారించారు. అక్కడ గ్రావెల్‌, బూడిద వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఏడాది కాలంగా అడ్డగోలుగా దోచేయడం ప్రారంభించారు. ఎన్నికల సమయం రావడంతో ఆయన సీటును మార్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి దోపిడీకి తెరదీశారు. ఎక్కువ సమయం లేకపోవడంతో రోజుకి ఒకటి రెండు కోట్ల రూపాయలు ఆర్జించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

మంత్రి గారా.. మజాకా!

నిన్న గ్రావెల్‌, బూడిద... నేడు ఇసుక దోపిడీ

నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటూ అక్రమం

రోజుకు ఇసుక ఆదాయం రూ.కోటిన్నర

3వేల ఎకరాల జగనన్న కాలనీల్లో మెరక తోలాలట

దాని కోసం బుసక తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలట

జిల్లాస్థాయి అధికారిపై మంత్రి ఒత్తిడి

ఆయన పేరుకే ఎమ్మెల్యే.. కానీ రూ.3వేలు ఆదాయాన్ని కూడా వదలకుండా వసూలు చేయడంలో ఘనాపాటి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ట్రాక్టర్‌తో సొంత పొలం నుంచి మట్టి తోలుకున్నా ‘మామూలు’గా రూ.3వేల నుంచి రూ.5వేలు వసూలు చేసిన ఘనుడు. ఆ తర్వాత కాలం కలిసొచ్చి మంత్రి అయ్యారు. గెలిచిన నియోజకవర్గంతోపాటు సొంత నియోజకవర్గంపైనా దృష్టి సారించారు. అక్కడ గ్రావెల్‌, బూడిద వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఏడాది కాలంగా అడ్డగోలుగా దోచేయడం ప్రారంభించారు. ఎన్నికల సమయం రావడంతో ఆయన సీటును మార్చారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి దోపిడీకి తెరదీశారు. ఎక్కువ సమయం లేకపోవడంతో రోజుకి ఒకటి రెండు కోట్ల రూపాయలు ఆర్జించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : జగనన్న కాలనీల్లో మెరక పేరుతో రెండేళ్లుగా దోచుకుంటున్న వైసీపీ నేతలు కాలనీల్లో స్థలాలను లబ్ధిదారులకు కేటాయించేసినా ఇప్పటికీ మెరక పేరుతో దోపిడీ కొనసాగిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 3వేల ఎకరాల్లో జగనన్న కాలనీలకు మెరక తోలాలని, దానికోసం బుసక తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని జిల్లాస్థాయి అధికారిపై జిల్లాకు చెందిన మంత్రి తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మంత్రి పెడన నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడికి వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానని వైసీపీలోకి తీసుకొచ్చారు. ఆ నాయకుడి వద్ద మంత్రి భారీగా సొమ్ములు లాగేసినట్టు సమాచారం. కానీ జగన్‌ వద్ద ఈ మంత్రి పప్పులు ఉడకలేదు. సదరు నాయకుడికి టికెట్‌ దక్కలేదు. దీంతో ఆ నాయకుడి మంత్రిపై తన డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. దీని నుంచి తప్పించుకునేందుకు సదరు నాయకుడికి బుసక తోలకం కాంట్రాక్టును ఇప్పించేందుకు మంత్రి మెరక.. బుసక తోలకాన్ని తెరపైకి తెచ్చి జిల్లాస్థాయి అధికారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ప్రస్తుతం మంత్రి ఇన్‌చార్జిగా ఉన్న నియోజకవర్గంతోపాటు పక్కనే ఉన్న మరో నియోజకవర్గంలోని ప్రాంతం నుంచి కూడా బుసక తోలకానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా జిల్లా స్థాయి అధికారిపై ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. మంత్రి తీరుపై పక్కనే ఉన్న నియోజకవర్గ ప్రజాప్రతినిధి గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 56 ఇసుక రీచ్‌లు ఉండగా ఎన్టీఆర్‌ జిల్లాలో 16 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటికి 2023 మేలో పర్యావరణ అనుమతులను రద్దు చేశారు. ఆ తర్వాత 9 రీచ్‌లకు పర్యావరణ అనుమతులు ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. అయితే కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేవు. వాస్తవానికి ఏ ఒక్క అనుమతి లేకున్నా రీచ్‌లలో తవ్వకాలు జరపకూడదు. కానీ కృష్ణా జిల్లా పరిధిలోని చోడవరం, మద్దూరు, రొయ్యూరు., లంకపల్లి, వల్లూరుపాలెం, శ్రీకాకుళం రీచ్‌ల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మంత్రి అనుచరుల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. రోజుకి అన్ని రీచ్‌ల నుంచి కలిపి నిత్యం 500 పైచిలుకు లారీల ఇసుక తరలిపోతోంది. ఒక్కో లారీలో సుమారు 30 టన్నుల ఇసుక లెక్క వేసుకున్నా రోజుకి 15,000 టన్నుల ఇసుకను తరలిస్తున్నారు. టన్ను వెయ్యి రూపాయల చొప్పున కోటిన్నర రూపాయల విలువైన ప్రజల సొమ్మును మంత్రి, ఆయన అనుచరులు కాజేస్తున్నారు.

రియల్‌ దోపిడీకి దళారి హనుమంతుడు

ప్రస్తుతం మంత్రి ఇన్‌చార్జిగా ఉన్న నియోజకవర్గంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఎక్కడా లేనంత ఉంటుంది. దీంతో లే-అవుట్ల వేసే రియల్టర్ల నుంచి అపార్ట్‌మెంట్లు నిర్మించుకునే బిల్డర్ల నుంచి వసూళ్ల దందా నడిపేందుకు గతంలో ఎమ్మెల్యే చెంత ఉండి ఆయనకు అవినీతి మరక అంటించిన హనుమంతుడిని మంత్రి దళారిగా నియమించుకున్నారు. ఎకరా లేఔట్‌కు రూ.10 లక్షలు, ఒక్కో ఫ్లాట్‌కు సక్రమ నిర్మాణం అయితే రూ.లక్ష, అక్రమ కట్టడమైతే ఫ్లాట్‌కు రూ.2 లక్షలు చొప్పున రేట్లు నిర్ణయించి మరీ వసూళ్లు చేస్తున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 01:34 AM