Share News

మతిస్థిమితం లేని దళిత యువతిపై అఘాయిత్యం

ABN , Publish Date - May 22 , 2024 | 01:04 AM

అంగవైకల్యం, మతిస్థిమితం లేకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ దళిత యువతిపై ముగ్గురు కామాంధులు అఘాయిత్యం చేశారు. యువతికి మాయమాటలు చెప్పి దారుణానికి ఒడిగట్టారు. మూడు నెలలుగా దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో జరిగింది.

మతిస్థిమితం లేని దళిత యువతిపై అఘాయిత్యం

విజయవాడ/కంకిపాడు, మే 21(ఆంధ్రజ్యోతి) : అంగవైకల్యం, మతిస్థిమితం లేకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ దళిత యువతిపై ముగ్గురు కామాంధులు అఘాయిత్యం చేశారు. యువతికి మాయమాటలు చెప్పి దారుణానికి ఒడిగట్టారు. మూడు నెలలుగా దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతి పుట్టికతోనే దివ్యాంగురాలు. ఆమెకు మాటలు రావు. ఎదుటవారి మాటలు వినిపించవు. తల్లిదండ్రులు ఇద్దరూ కూలీ పనులు చేస్తుంటారు. కుమార్తెను ఇంటి వద్ద వదిలి పనులకు వెళుతుంటారు. ఆ యువతి ఇంటికి సమీపంలో ఉన్న ముగ్గురు యువకులు ఆమెపై కన్నేశారు. ఇంట్లో ఒంటిరిగా ఉన్న సమయంలో వెళ్లి ఆమెతో పరిచయం పెంచుకున్నారు. మూడు నెలలుగా వారు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒక్కోసారి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి అఘాయిత్యం చేసేవారు. పని నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఎదురుగా కుమార్తె కనిపించడంతో ఆమె క్షేమంగానే ఉందనుకునేవారు. సోమవారం రాత్రి కడుపునొప్పి ఎక్కువగా వస్తోందని యువతి బాధపడటంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరీక్షించి ఆమె మూడు నెలల గర్భవతి అని చెప్పారు. ఏం జరిగిందని ప్రశ్నించినా ఆ యువతి నోరు తెరచి చెప్పలేని పరిస్థితి. యువతి తల్లి వెంటనే కంకిపాడు పోలీసులను ఆశ్రయించింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చుట్టుపక్కల ఉంటున్న ముగ్గురు యువకులు తరచుగా ఆ యువతి ఇంటికి వచ్చి ఎక్కువసేపు ఉండేవారని గుర్తించారు. వైద్యుల నివేదిక వచ్చిన వెంటనే యువకులను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - May 22 , 2024 | 08:08 AM