భూమి, రైతుతోనే మానవాళి మనుగడ
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:03 AM
ప్రకృతితోపాటు భూమిని కాపాడుకుంటూ, రైతును రక్షించుకుంటూ, పర్యావరణ హితానికి కృషిచేసినప్పుడే మానవజాతికి మనుగడ వుంటుందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు.
ఉంగుటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : ప్రకృతితోపాటు భూమిని కాపాడుకుంటూ, రైతును రక్షించుకుంటూ, పర్యావరణ హితానికి కృషిచేసినప్పుడే మానవజాతికి మనుగడ వుంటుందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. వ్యవసాయరంగంలో అధునాతన శాస్త్రసాంకేతికతలను అందిపుచ్చుకునే విధంగా శాస్త్రవేత్తలు చొరవతీసుకోవాలని, వివిధ రకాల సామాజిక మాధ్యమాల ద్వారా వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతులకు మరింత చేరువచేసి, నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సాధించే దిశగా అన్నదాతలకు ప్రోత్సాహాన్నందించాలన్నారు. రైతునేస్తం 20వ వార్షికోత్సవం సందర్భంగా ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం సంయుక్త ఆధ్వర్యంలో ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్ట (విజయవాడ చాప్టర్)లో జరిగిన రైతునేస్తం అవార్డుల ప్రదానోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ప్రఖ్యాత వ్యవసాయశాస్త్రవేత్త పద్మశ్రీ అవార్డుగ్రహీత స్వర్గీయ ఐవీ సుబ్బారావు పేరిట ఏర్పాటుచేసిన అవార్డులను వ్యవసాయ అనుబంధరంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతుసాధికారసంస్థకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయడంతోపాటు ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన 20మంది ప్రకృతి వ్యవసాయ రైతులను సతీసమేతంగా ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో అన్ని రంగాలు స్తంభించినా, రైతన్నల కాడీ, మేడీ మాత్రమే పనిచేశాయనీ.. మనల్ని రక్షించేది వ్యవసాయం మాత్రమేనని రుజువైందని గుర్తుచేశారు. చదువుకున్న యువత పల్లెబాట పట్టాలన్న ఆయన యువతరం రాకతో వ్యవసాయరంగం అద్భుతాలు సాధిస్తుందన్నారు. గత 20ఏళ్లుగా ‘రైతునేస్తం మాసపత్రిక’ ద్వారా వ్యవసాయరంగంలో అన్నదాతకు చేదోడుగా నిలవడమేగాక, ఏటా పోత్రాహక అవార్డుల కార్యక్రమాలు, 500పైగా సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేసి లక్షలాదిమంది రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాలమీద అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఎడిటర్ వేంకటేశ్వరరావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చెక్కభజనతో అందరినీ ఆకట్టుకున్న బాపట్ల జిల్లా మార్టూరు మండలం కొలలపూడి భజన బృందాన్ని ప్రత్యేకంగా అభినందించి రూ. లక్ష బహుమానం అందజేశారు. ‘రైతునేస్తం’ 20 ఏళ్లపండుగ పురస్కరించుకుని తీసుకువచ్చిన ఆరు పుస్తకాలను ఆవిష్కరించారు.
రైతునేస్తం సంపాదకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వేంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత 11సంవత్సరాలుగా రైతునేస్తం పత్రిక పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దలు వెంకయ్యనాయుడు రావటం సంస్థ పూర్వజన్మ సుకృతమన్నారు. పల్లెల ప్రగతికి ప్రకృతి వ్యవసాయం దారిలో రైతులు సాగాలని, ఉత్పత్తుల మార్కెటింగ్‌కోసం కూడా మావంతు కృషిచేస్తామని చెప్పారు.
రాష్ట్ర రైతుసాధికార సంస్థ పక్షాన జీవన సాఫల్యపురస్కారం అందుకున్న సంస్థ వైస్‌చైర్మన్ టి.విజయకుమార్ మాట్లాడుతూ, ప్రగతికి ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితో మనరైతులు ఇతర దేశాలలో ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ, అవగాహన కల్పించే స్థాయికి ఎదగటం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో స్వర్ణభారత్‌ట్ర్‌స్ట చైర్మన్ కామినేని శ్రీనివాస్, ట్రస్ట్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.