Share News

మేనిఫెస్టో.. ఓ మాయ

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:44 AM

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై రెండు జిల్లాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిని అనాథను చేసిన వైసీపీ సర్కార్‌.. మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలన ఉంటుందని చెప్పడంపై రాజధాని వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రూ.500 పెన్షన్‌ పెంపును ఐదేళ్లకు రూ.250 చొప్పున పెంచుతామని చెప్పడంపై పింఛన్‌దారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఎన్నికల మేనిఫెస్టోలా లేదని, ఓటమిని ఒప్పుకొనే అంగీకారం పత్రంలా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.

మేనిఫెస్టో.. ఓ మాయ

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జిల్లాలో భిన్నస్వరాలు

ూ నిరాశతో నింపేశారని పలువర్గాల పెదవివిరుపు

వలంటీర్ల ఊసెత్తకపోవడంపై సర్వత్రా చర్చ

మెగా డీఎస్సీ, సీపీఎస్‌ను మరిచిన సీఎం జగన్‌

రాజధాని వివాదం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ..

అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పరిపాలనట..!

రూ.500 పెన్షన్‌ పెంపునకు ఐదేళ్లా..? : పెన్షన్‌దారుల ఆగ్రహం

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై రెండు జిల్లాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిని అనాథను చేసిన వైసీపీ సర్కార్‌.. మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలన ఉంటుందని చెప్పడంపై రాజధాని వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రూ.500 పెన్షన్‌ పెంపును ఐదేళ్లకు రూ.250 చొప్పున పెంచుతామని చెప్పడంపై పింఛన్‌దారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఎన్నికల మేనిఫెస్టోలా లేదని, ఓటమిని ఒప్పుకొనే అంగీకారం పత్రంలా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధినేత జగన్‌ శనివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై సామాన్యుల నుంచి సొంత పార్టీ కార్యకర్తల వరకు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టేందుకు అదిరిపోయే హామీలతో మేనిఫెస్టో వస్తుందనుకుంటే అందులోని అంశాలు ఓటమిని ముందే ఒప్పుకొన్నట్టుగా ఉన్నాయని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. తనను నమ్ముకున్న వలంటీర్లకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తమవుతోంది. మరోవైపు రూ.500 పింఛన్‌ పెంచడానికి ఐదేళ్ల సమయం ఏమిటో అర్థం కావడం లేదని కొంతమంది వైసీపీ నాయకులే వ్యాఖ్యానించారు. అది కూడా చివరి రెండేళ్లు రూ.250 చొప్పున పెంచడం ఏమిటంటున్నారు. ఇలాంటి మేనిఫెస్టోను గతంలో ఎన్నడూ చూడలేదని వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. మూడు రాజధానులపై న్యాయ వివాదాలు ఉన్నా.. తాము అధికారంలోకి రాగానే విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని జగన్‌ చెప్పడంపై ఉమ్మడి కృష్ణా, గుంటూరువాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

జగన్‌ విశ్వసనీయత ఇదేనా..?

తమ నాయకుడికి ఉండేదే విశ్వసనీయత అంటూ గోబెల్‌ ప్రచారం చేసుకుంటున్న వైసీపీ శ్రేణులు.. గత ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేస్తానని ఎందుకు చేయలేదని ప్రశ్నించే సామాన్యులకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అలాగే, సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ గద్దెనెక్కి ఆ తర్వాత అందులో సాధ్యాసాధ్యాలు తెలియక ఏదో హామీ ఇచ్చేశామని చెప్పడం ఏమిటని నిలదీస్తున్న ఉద్యోగులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. జగనన్న ఇళ్ల పేరుతో కాలనీలు కాదు.. ఊర్లు నిర్మిస్తున్నామని చెప్పి.. అందులోనూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన విశ్వసనీయత ఏపాటిదో ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు చూశారని, జగన్‌ విశ్వసనీయత అని చెబుతుంటే అదేదో బ్రహ్మపదార్థంలా అనిపిస్తోందని ఓ వైసీపీ నాయకుడు వ్యాఖ్యానించారు. ఇటువంటి మేనిఫెస్టోతో జనాల్లోకి వెళ్లి ఎలా ఓట్లు అడగాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేనిఫెస్టోను జనం నమ్మరు

వైసీపీ మేనిఫెస్టో చూస్తేనే ఆ పార్టీ ఓటమిని అంగీకరించినట్లు తెలిసిపోతోంది. తనను జనం నమ్మరనే విషయాన్ని జగన్‌ అర్థం చేసుకున్నారు. అందుకే మేనిఫెస్టోలో పాత అంశాలనే తిరగరాసి మమ.. అనిపించారు. హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేసి విశ్వసనీయత చాటుకోవడం అనేది జగన్‌ డీఎన్‌ఏలోనే లేదు. గత మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు మద్యపాన నిషేధం, సీపీఎస్‌ రద్దు చేయలేదు. ఇదేనా ఆయన విశ్వసనీయత.

- గొట్టిముక్కల రఘురామరాజు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు

అరాచకాలు మరిచిపోతామా..

జగన్‌ విశ్వసనీయత ఏమిటో ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. విధ్వంసం ఒక్కటే ఆయనకు తెలిసిన విద్య. అలాంటి వ్యక్తి ఈ ఐదేళ్లలో చేసిన అరాచకాలు ఎవరైనా మరిచిపోగలరా? అలా మరిచిపోతే వారు మనుషులే కాదు. ప్రశ్నిస్తే దాడి చేస్తారు.. ఓట్ల కోసం శవరాజకీయాలకూ తెగబడతారు.. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను బిహార్‌లా మార్చేయడానికి కంకణం కట్టుకున్న రాక్షసుడు జగన్‌. అలాంటి వ్యక్తి మేనిఫెస్టో అంటూ ఎన్ని హామీలిచ్చినా జనం నమ్మరు. ఆయన చేసిన అరాచకాలు మరిచిపోరు. - గరిమెళ్ల రాధిక, గృహిణి

రూ.500 పెంచడానికి ఐదేళ్లా?

పింఛన్‌ పెంపు అంశాన్ని పరిశీలిస్తే చాలు జగన్‌ మేనిఫెస్టో ఎంత హాస్యాస్పదంగా ఉందో, జనాలను ఆయన ఎంత చిన్నచూపు చూస్తున్నారో అర్థమవుతుంది. ఆయన 2024లో అధికారంలోకి వస్తే రూ.500 పెంచడానికి 2028 వరకు ప్రజలు వేచి చూడాలి. అది కూడా 2028లో రూ.250 2029లో రూ.250 పెంచుతారు. సంపద సృష్టించడం తెలియని వ్యక్తి ఇంత కంటే గొప్ప హామీలు ఇవ్వలేడు. దోచుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత ప్రజల సంక్షేమం కోసమో, అభివృద్ధి కోసమో ఇవ్వరు అనడానికి వైసీపీ మేనిఫెస్టోనే నిదర్శనం. - మీసాల రాజేశ్వరరావు, పీసీసీ ఉపాధ్యక్షుడు

వలంటీర్లకు న్యాయమేదీ?

వలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలు ఇస్తామని టీడీపీ చెబుతోంది. వలంటీర్లను తెచ్చిందే వైసీపీ వారు కదా? వైసీపీని నమ్ముకునే వారు ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారు. అలాంటి వారికి కూడా న్యాయం చేయలేకపోయారు. అలాంటి మేనిఫెస్టోను సామాన్య ప్రజలమైన మేము ఎందుకు నమ్మాలి. - తెళ్ల భవానీ, గృహిణి

Updated Date - Apr 28 , 2024 | 12:44 AM