Share News

అరుపులు, కేకలతో దద్దరిల్లిన మండల సమావేశం

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:25 AM

మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం అరుపులు కేకలతో దద్దరిల్లింది.

అరుపులు, కేకలతో దద్దరిల్లిన మండల సమావేశం
సమావేశ మందిరంలోకి ఎవరు వెళ్లకుండా పోలీసు పహారా

కంచికచర్ల రూరల్‌, ఫిబ్రవరి 1: మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం అరుపులు కేకలతో దద్దరిల్లింది. ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు సమక్షంలోనే ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ బషీర్‌పై పెద్ద ఎత్తున్న ధ్వజమెత్తారు. ప్రొటోకాల్‌ పాటించడం, నిధులు మంజూరు చేయడంలో వివక్ష చూపుతున్నారని ఎంపీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ బషీర్‌ అధ్యక్షతన గురువారం మండల అత్యవసర సమావేశం జరిగింది. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, వైసీపీ సర్పంచ్‌లు, వైసీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. సమావేశ మందిరంలోకి మీడియాకు ప్రవేశాన్ని కల్పించలేదు. ముఖ ద్వారం వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు. కేవలం వైసీపీ ప్రజా ప్రతినిధులను మాత్రమే లోపలకి అనుమతించారు. మొదటి నుంచి ఎంపీపీ మలక్‌ బషీర్‌ స్థానిక ప్రజా ప్రతినిధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇతర ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అందరినీ ఆహ్వానించకుండా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని ఎంపీటీసీ సభ్యులు ఆరోపణలు చేశారు. పెండ్యాల గ్రామానికి చెందిన మరొక ఎంపీటీసీ సభ్యుడు బడే హజరత్‌ తీవ్ర స్థాయిలో ఎంపీపీపై విరుచుకుపడినట్లు తెలిసింది. త్వరలోనే ఎంపీపీ మార్పు ఉంటుందని మెజార్టీ వైసీపీ సభ్యులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తొలుత అందరూ సర్వసభ్య సమావేశానికి రావాలని ప్రకటించినా, తర్వాత వైసీపీ ప్రజా ప్రతినిధులనే అనుమతించడం, మీడియాను అనుమతించకపోవడం ఎంపీపీ మార్పు కోసమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Feb 02 , 2024 | 12:25 AM