Share News

మళ్లీ వైసీపీకి అధికారం ఇస్తే.. కరువులో పోటీ తప్పదు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:57 AM

అసెంబ్లీలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రావణసంతలా మారి అమరావతి అభివృద్ధిని చెడగొట్టి, మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మైలవరం ఎమ్మెల్యే, ఎన్డీయే కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. వెల్వడంలోని టీడీపీనేత కోమటి సుధాకరరావు గృహంలో గురువారం సాయంత్రం కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

మళ్లీ వైసీపీకి అధికారం ఇస్తే.. కరువులో పోటీ తప్పదు
వెల్వడంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

మైలవరంరూరల్‌, ఏప్రిల్‌ 18 : అసెంబ్లీలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రావణసంతలా మారి అమరావతి అభివృద్ధిని చెడగొట్టి, మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మైలవరం ఎమ్మెల్యే, ఎన్డీయే కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. వెల్వడంలోని టీడీపీనేత కోమటి సుధాకరరావు గృహంలో గురువారం సాయంత్రం కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనంత మాట్లాడుతూ, ప్రస్తుతం సాగర్‌నీరు తెలంగాణ రాష్ట్రాన్ని దాటి మనప్రాంతానికి వచ్చే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చింతలపూడి ప్రాజెక్టుకి రూ.4100 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్కరూపాయి ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. పశువులకు నీరు లేని పరిస్థితి దాపురించిందన్నారు. గ్రామాలలో దాహం కేకలు పెరిగాయన్నారు. ఈ ఐదేళ్లలో దశాబ్దాల కాలంనాటి ఎన్నో కంపెనీలు మూతబడ్డాయన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే మనం పోటీ పడేది బిహార్‌తో, ఒడిసాలతోనేని జోస్యం చెప్పారు. జగన్‌రెడ్డి పేదల బలహీనతను అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని దివాలా తీశారన్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు 2లక్షల కోట్లు ఉన్న అప్పు సంక్షేమ పథకాల పేరుతో 13లక్షల కోట్లకు చేర్చారని విమర్శించారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే అప్పు ఇచ్చేవారు ఎవరూ లేరన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులకు విలువ లేదని, వలంటీర్‌ తారకమంత్రం పరిస్థితి జగన్మోహనరెడ్డి తీసుకువచ్చారన్నారు. స్థానిక సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పే పరిస్థితి లేదని చెప్పారు. ఐదేళ్లల్లో సీఎంను కలిసింది రెండు, మూడుసార్లు మాత్రమే అన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్నారై కోమటి జయరాం, తాతా పోతురాజు, విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:57 AM