Share News

రీచ్‌ల్లో యంత్రాలకు అనుమతుల్లేవు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:06 AM

కృష్ణాజిల్లాలోని ఇసుకరీచ్‌ల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని కలెక్టర్‌ బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లో జేసీ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్‌.గంగాధరరావుతో కలిసి గురువారం ఇసుక రవాణాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నేషనల్‌గ్రీన్‌ ట్రిబ్యునల్‌, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రీచ్‌లలో జేసీబీలు, పొక్లెయినర్లను ఇసుక తవ్వకాలకు ఉపయోగించరాదన్నారు.

రీచ్‌ల్లో యంత్రాలకు అనుమతుల్లేవు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బాలాజీ

మచిలీపట్నం, అక్టోబరు24(ఆంధ్రజ్యోతి) : కృష్ణాజిల్లాలోని ఇసుకరీచ్‌ల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవని కలెక్టర్‌ బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లో జేసీ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్‌.గంగాధరరావుతో కలిసి గురువారం ఇసుక రవాణాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నేషనల్‌గ్రీన్‌ ట్రిబ్యునల్‌, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రీచ్‌లలో జేసీబీలు, పొక్లెయినర్లను ఇసుక తవ్వకాలకు ఉపయోగించరాదన్నారు. మాన్యువల్‌గానే తవ్వకాలు జరపాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని, నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. ఇసుక రేవుల్లో యంత్రాలను ఉపయోగిస్తే వాటిని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

లే అవుట్లకు అనుమతులు తప్పనిసరి

మచిలీపట్నం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా) పరిధిలో నిర్మాణం చేసే భవనాలు, లేఅవుట్లకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్‌ బాలాజీ అన్నారు. ముడా టౌన్‌ప్లానింగ్‌ కార్యకలాపాలపై గురువారం ముడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌, పెడన పురపాలకసంఘం, సీఆర్‌డీఏ పరిధిలోలేని అన్ని మండలాలు ముడా పరిధిలోకి వస్తాయన్నారు. ముడాపరిధిలో నిర్మాణం జరిగే అన్ని భవనాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. పంచాయతీలలో భవనాల నిర్మాణం, లేఅవుట్‌లను పర్యవేక్షించేందుకు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ప్రణాళిక కార్యదర్శులకు లేఅవుట్‌లు, భవనాలకు అనుమతులు మంజూరుచేసే విషయంపై వర్క్‌షాప్‌ నిర్వహించి తగిన శిక్షణ ఇవ్వాలని ముడా ఇన్‌చార్జివీసీ, జేసీ గీతాంజలి శర్మకు కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బాపిరాజు, డీపీవో అరుణ, ముడా ప్లానింగ్‌ అధికారి శాంతిలత, ముడా డెప్యూటీ కలెక్టర్‌లు రవిశంకర్‌, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:06 AM