Share News

గన్నవరంలో గరళం!

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:16 AM

వేసవి రానే వచ్చింది. ప్రజలకు తాగునీటి అవసరం పెరుగుతుంది. ఇందుకోసం సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాల్సిన తరుణంలో పలు గ్రామ పంచాయతీలు ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నాయి. ఖర్చులేని పనులకు శ్రీకారం చుడుతూ విష జలాన్ని వదులుతున్నాయి. అపరిశుద్ధ జలాన్ని ఫిల్టరైజేషన్‌ కూడా చేయకుండా నేరుగా రిజర్వాయర్లలోకి మళ్లించి సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మేజర్‌ గ్రామ పంచాయతీల్లో ఒకటి అయిన గన్నవరం పంచాయతీలో ఈ దుస్థితి నెలకొంది.

గన్నవరంలో గరళం!

తాగునీటి రిజర్వాయర్‌లోకి కలుషిత నీరు మళ్లింపు

వేసవి వేళ ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టిన పంచాయతీ

తొండంగట్టు చెరువులో వ్యర్థ జలాలు, చేపల పెంపకం

ఆ నీటిని ఫిల్టర్‌ చేయకుండా రిజర్వాయర్‌కు పంపింగ్‌

మూలన పడిన పంపింగ్‌ స్కీమ్‌.. మోటార్లు ఫట్‌

వేసవి రానే వచ్చింది. ప్రజలకు తాగునీటి అవసరం పెరుగుతుంది. ఇందుకోసం సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాల్సిన తరుణంలో పలు గ్రామ పంచాయతీలు ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నాయి. ఖర్చులేని పనులకు శ్రీకారం చుడుతూ విష జలాన్ని వదులుతున్నాయి. అపరిశుద్ధ జలాన్ని ఫిల్టరైజేషన్‌ కూడా చేయకుండా నేరుగా రిజర్వాయర్లలోకి మళ్లించి సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మేజర్‌ గ్రామ పంచాయతీల్లో ఒకటి అయిన గన్నవరం పంచాయతీలో ఈ దుస్థితి నెలకొంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం) : గన్నవరం పట్టణానికి ప్రధాన మంచినీటి రిజర్వాయర్‌ అయిన కోనాయి చెరువుకు గండి కొట్టి సమీపంలోని తొండంగట్టు చెరువులోని వ్యర్థ జలాలను మళ్లిస్తున్నారు. తొండంగట్టు గుంట అనేక రకాల వ్యర్థాలతో నిండి ఉంటుంది. ఇందులో చేపలు కూడా పెంచుతున్నారు. నీరు దుర్గంధం, దుర్వాసనలతో ఉంటుంది. అలాంటి నీటిని ఫిల్టరైజేషన్‌ కూడా చేయకుండా రిజర్వాయర్‌కు గండి కొట్టి తొండంగట్టు చెరువు నీటిని మళ్లిస్తున్నారు.

అధికార పార్టీ నేత హస్తం

గన్నవరం పంచాయతీ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ గండి కొట్టమని సిబ్బందిని ఆదేశించారు. రిజర్వాయర్‌కు గండిపెట్టడమేమిటని, వివాదం అవుతుందని స్థానిక సిబ్బంది చెప్పినా పెడచెవిన పెట్టారు. ఏదైనా అయితే తనను ఇక్కడకు తీసుకువచ్చిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరుడు చూసుకుంటాడని బెదిరించి బలవంతంగా గండి కొట్టించినట్టుగా తెలుస్తోంది.

పనిచేయని మోటార్లు

గన్నవరం ప్రజలు ఫ్లోరైడ్‌ నీటిని తాగాల్సి వస్తుందన్న ఉద్దేశంతో 2007లో రూ.3 కోట్లతో ఫిల్టర్‌ బెడ్‌లు ఏర్పాటు చేశారు. దావాజీగూడెం వంతెన దగ్గర ఉన్న రెండు మోటార్లలో ఒకటి పనిచేయడం లేదు. దానికి ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. ఒక్క మోటారే పనిచేస్తోంది. దీనికితోడు గన్నవరం వాటర్‌ ప్లాంట్‌ దగ్గర కూడా మోటార్లు పనిచేయటం లేదు. రివర్స్‌లో మోటార్లను ఆడటం వల్ల మరమ్మతులకు గురైనట్టు తెలుస్తోంది. గన్నవరం గ్రామ పంచాయతీకి ఏడాదికి ఐదు కోట్ల మేర దండిగా ఆదాయం వస్తున్నా రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని మరమ్మతులు చేయాల్సిన పంచాయతీ అధికారులు ఆ పని చేయకుండా రిజర్వాయర్‌కు గండి కొట్టి కలుషిత నీటిని మళ్లిస్తున్నారు.

తెంపల్లి ఉదంతంతో కళ్లు తెరవరా?

గన్నవరం మండలంలో తెంపల్లిలో సరిగ్గా ఏడాది కిందట కలుషిత నీటి వల్ల ప్రాణాంతక క్లెబ్సియల్లా వైరస్‌ సోకి ముగ్గురు మృతి చెందారు. వంద మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊరంతా వణికిపోయింది. ఈ ఉదంతాల గుణపాఠాలను నేర్వని గన్నవరం పంచాయతీ అధికారులు ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టడం గమనార్హం.

ఎన్నో పంచాయతీల్లో నిండు నిర్లక్ష్యం

గన్నవరం పంచాయతీతో పాటు అనేక పంచాయతీలు తాగునీటి కొరతను, కలుషిత నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ఇదే మండలం పరిధిలోని కేసరపల్లి పంచాయతీ హామ్లెట్‌ అయిన వెంకట నరసింహాపురంలో నీటి కొరత నెలకొంది. డ్రెయిన్లు లేకపోవటం వల్ల పైపులైన్లు లీకై ఇళ్లలోకి మురుగునీరు వచ్చిన ఉదంతాలు ఉన్నాయి.

ఎన్టీఆర్‌ జిల్లా ఏ కొండూరు మండల పరిధిలో రక్షిత మంచినీటి సరఫరా అనేది ప్రకటనలకే పరిమితమైంది. కృష్ణా నీటిని ఒడిసి పట్టి అందిస్తామన్న ప్రత్యేక కార్యక్రమానికి ఫుల్‌స్టాప్‌ పడింది. ఒకపక్క ఏ కొండూరు మండలం పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. ఈ సమస్యకు ప్రధానంగా సురక్షితం కానటువంటి మంచినీరేనని పరీక్షలలో తే ల్చారు. పునరుద్ధరణ పనుల కోసం బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవటంతో ఏ కొండూరు మండల ప్రజలు ఈ వేసవిలో తాగునీటి కష్టాలు ఎదుర్కోనున్నారు.

Updated Date - Feb 26 , 2024 | 01:16 AM