Share News

వెలుగు జిలుగులు..

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:06 AM

అమరావతికి ఐదేళ్ల అంధకారం వీడింది. మళ్లీ విద్యుత్‌ కాంతులీనుతున్నాయి. రాత్రి అయితే అమావాస్యను తలపించే అమరావతి.. మళ్లీ ఇన్నాళ్లకు విద్యుద్దీపాల వెలుగులతో మెరిసిపోతోంది. వైసీపీ పాలనలో అమరావతి విధ్వంసంతో చీకట్లు కమ్ముకున్నా.. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో.. రాజధాని పునరుద్ధరణ పనులు ప్రారంభంతో తిరిగి అమరావతి ప్రకాశిస్తోంది.

వెలుగు జిలుగులు..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అమరావతికి ఐదేళ్ల అంధకారం వీడింది. మళ్లీ విద్యుత్‌ కాంతులీనుతున్నాయి. రాత్రి అయితే అమావాస్యను తలపించే అమరావతి.. మళ్లీ ఇన్నాళ్లకు విద్యుద్దీపాల వెలుగులతో మెరిసిపోతోంది. వైసీపీ పాలనలో అమరావతి విధ్వంసంతో చీకట్లు కమ్ముకున్నా.. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో.. రాజధాని పునరుద్ధరణ పనులు ప్రారంభంతో తిరిగి అమరావతి ప్రకాశిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్‌డీఏ అధికారులు అమరావతిలోని రోడ్లకు విద్యుదీపాల పనులు చేపట్టారు. అమరావతికి ప్రధానమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో పనిచేయని విద్యుద్దీపాలను రెండు రోజుల పాటు శ్రమించి మరమ్మతులు చేశారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో లైట్లను వెలిగించటంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, కరకట్ట రోడ్లు కలిపి మొత్తం 2 వేల వీధి లైట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. విద్యుద్దీపాల వెలుగులను సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ స్వయంగా రాయపూడి వరకు వెళ్లి పరిశీలించారు.

కోటి లీటర్ల 10 ఎంఎల్‌డీ

వాటర్‌ ప్లాంట్‌ పనుల పరిశీలన

అమరావతి రాజధానిలోని రాయపూడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న 10 ఎంఎల్‌డీ వాటర్‌ ప్లాంట్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏ అధికారుల సన్నద్ధమయ్యారు. సోమవారం సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి వెళ్లి 10 ఎంఎల్‌డీ వాటర్‌ ప్లాంట్‌ను సందర్శించారు. అమరావతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ చేపట్టిన పనుల్లో ఇది కూడా ఒకటి. పనులు అసంపూర్తిగా ఉండటంతో.. దీనిని పూర్తి చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోజుకు కోటి లీటర్ల నీటిని పంపిణీ చేసే సామర్ధ్యం ఈ 10 ఎంఎల్‌డీకి ఉంటుంది. రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలతో పాటు అమరావతిలోని విశ్వవిద్యాలయాలకు సంబంధించి రోజుకు 75 వేల జనాభాకు సరిపడే తాగునీటిని ఈ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా సరఫరా చేసే అవకాశం ఉంటుందని కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఇదే సందర్భంలో గతంలో అమరావతి స్మార్ట్‌ సిటీ పరిధిలో చేపట్టిన పనులను కూడా త్వరితగతిన చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jun 11 , 2024 | 01:06 AM