ఎవరికీ పట్టని గ్రంథాలయాలు
ABN , Publish Date - Jul 23 , 2024 | 12:51 AM
విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలనే సదుద్దేశంతో పాఠశాలల్లో ఏర్పాటుచేసిన అకడమిక్ గ్రంథాలయాలు అక్కరకు రాకుండా పోతున్నాయి. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు లేకపోవడం ఓ కారణమైతే, లైబ్రేరియన్ల నియామకాలు జరగకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది.
విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాల కొరత
చాలాచోట్ల తలుపులు తెరుచుకోని లైబ్రరీలు
భర్తీకాని లైబ్రేరియన్ల పోస్టులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : విద్యార్థులకు గ్రంథాలయాలను దగ్గర చేయాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో ఏర్పాటుచేసిన అకడమిక్ గ్రంథాలయాలు మౌనవృతం చేస్తున్నాయి. వీటి తలుపులు తెరుచుకోవడమే గగనంగా మారింది.
టైం టేబుల్ ప్రకారం..
జిల్లా పరిషత్ పాఠశాలల్లో అకడమిక్ గ్రంథాలయాలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. వాటిని నిర్వహిం చడానికి ప్రత్యేకంగా ఒక లైబ్రేరియన్‌ను నియమించారు. అయితే, తరగతి గదుల్లో ఉండే పాఠ్యపుస్తకాలకు సంబంఽధం లేని పుస్తకాలను ఈ గ్రంథాలయాల్లో ఉంచారు. బాలల కథలు, ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాలు, దేశంలోని ప్రముఖ నేతల బయోగ్రఫీ, తెలుగు సాహిత్యం, సైన్స్ ఫిక్షన్, చారిత్రక ఘట్టాలకు సంబంధించిన పుస్తకాలను అకడమిక్ లైబ్రరీకి సమకూర్చారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 30-40 జిల్లా పరిషత్ పాఠశాలల్లో అకడమిక్ గ్రంథాలయాలు కొలువుదీరాయి. ఈ పుస్తకాలను విద్యార్థులతో చదివించడానికి ప్రత్యేకంగా ఒక పిరియడ్‌ను టైం టేబుల్‌లో పొందుపరిచారు. వారంలో ఒక పిరియడ్‌ను గ్రంథాలయ పఠనం కోసం కేటాయిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం నుంచి ఆఖరి పిరియడ్ (ఎనిమిదో పిరియడ్)ను గ్రంథాలయాల్లో పఠనం కోసం ఇస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో ఆరు, ఏడు పిరియడ్లలో ఏదో ఒకదాన్ని కేటాయించేవారు. ఈ గ్రంథాలయాలను నిర్వహించడానికి ఒక లైబ్రేరియన్‌ను జిల్లా పరిషత్ నియ మించింది. కొన్ని పాఠశాలల్లో ఇన్‌చార్జులను నియమించింది.
చెదలు పడుతున్న పుస్తకాలు
పాఠశాలల్లో ఉన్న అకడమిక్ గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ల కొరత ఉంది. వాస్తవానికి ఈ గ్రంథాలయాలకు గ్రంథాలయ సంస్థ నుంచి లైబ్రేరియన్లను ఇవ్వాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గ్రంథాలయ సంస్థ ఆధీనంలో నిర్వహించే గ్రంథాలయాల్లోనే సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున అకడమిక్ గ్రంథాలయాలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని పాఠశాలల్లో లైబ్రేరియన్ లేకపోయినప్పటికీ ఉపాధ్యాయుల్లో ఎవరో ఒకరికి ఆ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఈ బాధ్యతలను స్వీకరించడానికి ఉపాధ్యాయులు ముందుకురాని పరిస్థితి. ఫలితంగా అందులో ఉన్న పుస్తకాలు పాడైపోతున్నాయి. ఎలుకలు కొరికేస్తున్నాయి. కొన్నిచోట్ల చెదలు పడుతున్నాయి. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే పుస్తకాలు ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోతున్నాయి.
ప్రత్యేక పిరియడ్ ద్వారా నడిపిస్తున్నాం..
అకడమిక్ గ్రంథాలయాలు జిల్లా పరిషత్ పాఠశాలల్లో మాత్రమే ఉంటాయి. ఇక్కడ వివిధ రకాల పుస్తకాలు ఉంటాయి. వాటిని విద్యార్థులతో చదివించడానికి వారంలో ఒక పిరియడ్ ఉంటుంది. ఎనిమిదో పిరియడ్‌ను లైబ్రరీ పిరియడ్‌గా ఇస్తారు. కొన్నిచోట్ల లైబ్రేరియన్లు ఉన్నారు. లేనిచోట్ల మాత్రం ఉపాధ్యాయుడు నిర్వహిస్తున్నాడు. - సుబ్బారావు, జిల్లా విద్యాశాఖాధికారి