Share News

న్యాయ పోరాటం!

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:36 AM

జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త పెళ్లయిన ఐదేళ్లకే వదిలించుకుని ఎటో వెళ్లిపోయాడు. పుట్టింటికి వెళదామంటే అక్కడ ఒంటరిగా ఉంటూ ఇళ్లల్లో పాచిపని చేసుకునే తల్లి. నాలుగేళ్ల కొడుకు, మరోపక్క నాలుగు నెలల గర్భిణి.. అత్తింటి వారు ఆదుకుంటారనుకుంటే ఇంట్లోకి రానివ్వడం లేదు. పైగా ఇంటి గేటుకు తాళం వేసి మరీ వెళ్లిపోయారు. అయినవారు లేక అత్తింటి వారు రానివ్వక నున్న గ్రామం కుమ్మరి బజార్‌లో గర్భిణి పడుతున్న అవస్థలు చుట్టుపక్కలవారిని కంటతడి పెట్టిస్తున్నాయి.

న్యాయ పోరాటం!

విజయవాడ రూరల్‌, జూలై 4 : జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త పెళ్లయిన ఐదేళ్లకే వదిలించుకుని ఎటో వెళ్లిపోయాడు. పుట్టింటికి వెళదామంటే అక్కడ ఒంటరిగా ఉంటూ ఇళ్లల్లో పాచిపని చేసుకునే తల్లి. నాలుగేళ్ల కొడుకు, మరోపక్క నాలుగు నెలల గర్భిణి.. అత్తింటి వారు ఆదుకుంటారనుకుంటే ఇంట్లోకి రానివ్వడం లేదు. పైగా ఇంటి గేటుకు తాళం వేసి మరీ వెళ్లిపోయారు. అయినవారు లేక అత్తింటి వారు రానివ్వక నున్న గ్రామం కుమ్మరి బజార్‌లో గర్భిణి పడుతున్న అవస్థలు చుట్టుపక్కలవారిని కంటతడి పెట్టిస్తున్నాయి.

పెనుగంచిప్రోలుకు చెందిన యనగంటి ఉమకు విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామానికి చెందిన భార్గవ్‌తో 2019లో వివాహమైంది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. నాలుగేళ్ల క్రితం ఉమ ఓ బాబుకు జన్మనిచ్చింది. భర్త పనీపాట లేకుండా తిరుగుతూ అప్పులు చేస్తుండటంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కుటుంబ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు పెట్టినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆరు నెలల క్రితం ఉమ పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి ఉమను భర్త నర్సారావుపేటకు కాపురానికి తీసుకెళ్లాడు. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోగా ఏకంగా నాలుగు నెలల గర్భవతైన ఉమను, కొడుకును జూన్‌ 18న వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో జూన్‌ 20న ఇంటి యజమాని చార్జీలకు డబ్బులివ్వగా.. ఆమె నున్న గ్రామంలోని అత్తింటికి వచ్చింది. అక్కడ పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టారు. వాళ్లు మాట్లాడతామన్నారు. ఇంతలో జూన్‌ 29న అత్తమామలు తమ కుమారుడిని కోడలు ఏదో చేసిందని నున్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉమ స్టేషన్‌కు వెళ్లి తన గోడును వెళ్లబోసుకుంది. పోలీసులు అత్తమామలను పిలిపించి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. పోలీసుల ఎదుట తలాడించిన అత్తమామలు కోడల్ని స్టేషన్‌ బయటే వదిలేసి వెళ్లిపోయారు. కొడుకు చేసిన పనికి కోడల్ని ఆదరించాల్సింది పోయి అత్తమామలు ఇంటి గేటుకు కూడా తాళం వేసి వెళ్లిపోయారు.

ఈనెల 1న పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో భర్త అదృశ్యమయ్యాడని ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. నాలుగు రోజులుగా ఆమె అత్తింటి ఎదుట దీక్షకు పూనుకుంది. తిండీ నిద్ర లేకుండా కొడుకుతో రోడ్డుపైనే ఉంటోంది. అయినా భర్త కుటుంబసభ్యులు కనికరం చూపడం లేదు. గర్భవతైన వివాహిత ఏమైపోతుందో అన్న జాలితో స్థానికులు భోజనం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా అలానే దీక్షను కొనసాగిస్తోంది. ఎండా, వానకు చలించకుండా వివాహిత చేస్తున్న పోరాటం అక్కడి వారిని కలచివేస్తోంది. తనకు తిండి పెట్టాల్సిన అవసరం లేదని ఇంట్లో కాస్త ఆశ్రయం కల్పిస్తే కూలి పనులు చేసుకుని తన కొడుకుతో తలదాచుకుంటానని అంటోంది.

Updated Date - Jul 05 , 2024 | 12:36 AM