Share News

ఓట్ల కోసమే.. దొంగ పట్టాల దగా!

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:27 AM

కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పేదలకు వైసీపీ పాలకులు వందలాది దొంగ పట్టాల పంపిణీపై మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన నేతలు బుధవారం ఉదయం నాలుగుగంటలపాటు ధర్నా నిర్వహించారు.

ఓట్ల కోసమే.. దొంగ పట్టాల దగా!
ధర్నా చేస్తూన్న కొల్లు రవీంద్ర

  • నాలుగు గంటలపాటు నిరసన.. తహసీల్ధార్‌కు వినతిపత్రం

  • అధికారంలోకి వచ్చాక అవినీతిపై సమగ్ర విచారణ

  • వైసీపీ పాలకుల అక్రమాలు బయటపెడతాం : కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, మార్చి 13 : కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పేదలకు వైసీపీ పాలకులు వందలాది దొంగ పట్టాల పంపిణీపై మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన నేతలు బుధవారం ఉదయం నాలుగుగంటలపాటు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ శిబిరం వద్దకు రావాలంటూ నినాదాలు చేశారు. రాజముద్ర, తేదీలు లేకుండా పట్టాలు ఫోర్జరీ సంతకాలతో ఎలా ఇచ్చారని కొల్లు రవీంద్ర డిప్యూటీ తహసీల్దార్‌ను ప్రశ్నించారు. మూడు గంటల ఆలస్యంగా కార్యాలయానికి తహసీల్దార్‌తో కార్పొరేటర్లు చర్చలు జరిపారు. వైసీపీ నాయకులు లబ్ధిదారులకు ఇచ్చిన నకిలీ పట్టాలను తహసీల్దార్‌కు చూపించారు. ఎన్నికల ముందు పేదలకు పట్టాల పేరుతో ఎర వేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన పట్టాలు రిజిస్టర్‌లో నమోదు అయ్యాయా అని ప్రశ్నించారు. దానికి రెవెన్యూ అధికారులు రిజిస్టర్‌ చూపించలేక పోవడంతో నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. దీనిపై అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతానని రవీంద్ర పేర్కొనడంతో శిబిరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం తహసీల్ధార్‌కు వినతి పత్రం అందజేశారు. బదిలీ అయిన తహసీల్దార్‌ సునీల్‌ సంతకాలతో అర్ధరాత్రి వేళ వైసీపీ నాయకుల సమక్షంలో తహసీల్దార్‌ కార్యాలయంలో పట్టాలు రాయాలంటూ అధికారులపై వత్తిడి చేస్తున్నారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. తనకురెండు రోజుల సమయం ఇస్తే విచారణ జరిపి వివరాలు చెపుతానని తహసీల్దార్‌ పేర్కొనడంతో ధర్నాను వాయిదా వేశారు. శిబిరం వద్దే నాయకులు, కార్యకర్తలు భోజనాలు చేశారు. ధర్నాలో జనసేన, టీడీపీ నేతలు మాదివాడ రాము, గడ్డం రాజు, మోటమర్రి బాబాప్రసాద్‌, పంచపర్వాల కాశీవిశ్వనాథం, కుంచె నాని, ఎండి ఇలియాస్‌ పాషా, పిప్పళ్ల కాంతారావు, కార్పొరేటర్లు మరకాని సమతా కీర్తి, చిత్తజల్లు నాగరాము, అన్నం ఆనంద్‌, దేవరపల్లి అనిత, కట్టా దుర్గా, సనకా నాగులు, మరకానిపరబ్రహ్మం, పీవీ ఫణికుమార్‌, పాలపర్తి పద్మ, చిన్నం శివ, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటమి భయంతోనే దొంగపట్టాలు

పేదలకు పట్టాలు ఇవ్వడానికి తాను వ్యతిరేకం కాదని, అయితే రోడ్ల పక్కన స్థలాలకు రాత్రికి రాత్రి దొంగ పట్టాలు సృష్టించి ఇస్తున్నారని రవీంద్ర అన్నారు. రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, బదిలీ అయిన తహసీల్దార్‌ సునీల్‌ సంతకంతో వందల సంఖ్యలో ఎమ్మెల్యే పేర్నినాని ఆధ్వర్యంలో దొంగ పట్టాలు ఇస్తున్నారన్నారు. నేషనల్‌ కాలేజీ వద్ద, ఎన్టీఆర్‌కాలనీ వద్ద, విశ్వబ్రాహ్మణ కాలనీ ఇలా పలుప్రాంతాల్లో సర్వే నెంబర్లు లేకుండా పట్టాలు ఇచ్చేస్తున్నారన్నారు. సర్వే నెంబర్లు లేని ఇళ్లకు బ్యాంకులు ఎలా రుణాలు ఇస్తాయన్నారు. సుల్తానగరంలోని ప్రభుత్వ భూములను వైసీపీ కార్యకర్తలు ఆక్రమించి అమ్ముకుంటున్నారన్నారు. వైసీపీ నేతల అక్రమాలపై అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ జరిపిస్తామన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:27 AM