Share News

కేయూలో అయ్యోర్ల తిరుగుబాటు

ABN , Publish Date - Jan 29 , 2024 | 01:00 AM

కృష్ణా యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేయడంలో జరిగిన జాప్యం కారణంగా ఒక విద్యార్థి బలవన్మరణం చెందడమే ఇందుకు కారణం. ఐదుగురు విద్యార్థులు పరిశోధ నలు చేసి పత్రాలు సమర్పించినా ఏ కారణంతో సకాలంలో పీహెచ్‌డీ పట్టాలు ఇవ్వడం లేదని ప్రొఫెసర్లు యూనివర్సిటీ వీసీని, రిజిస్ట్రారును శనివారం నిలదీశారు.

కేయూలో అయ్యోర్ల తిరుగుబాటు

(ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం)

భీమవరానికి చెందిన పి.అమిత భీమవరంలోని ఒక కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కృష్ణా యూనివర్సిటీలో కామర్స్‌ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. దీనికి సంబంధించి పరిశోధ నా పత్రాలను 2022 నవంబరు 14వ తేదీన ఆమె సమర్పించారు. పీహెచ్‌డీ చేసినందుకుగాను యూనివర్సిటీకి రూ.1.49 లక్షలు ఫీజుగా యూనివర్సిటీకి చెల్లించారు. పరిఽశోధనా పత్రాలను సమర్పించి 14 నెలలు కావస్తున్నా ఆమెకు పీహెచ్‌డీని ప్రధానం చేయలేదు. దీంతో ఏడాదికాలంలో ఆమె మూడు విడతలుగా పరిశోధనా పత్రాలను సమర్పించి, తనకు పట్టాను అందజేయాలని యూనివర్సిటీ అధికారులను కోరుతూ వచ్చారు. అయినా యూనివర్సిటీ రీసెర్చ్‌ విభాగం అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు.

ఉద్యోగం పోవడంతో బలవన్మరణం?

పీహెచ్‌డీ పట్టా తెచ్చుకోవాలని, పట్టా వచ్చిన తరువాత మళ్లీ ఉద్యోగం ఇస్తామని చెప్పి భీమవరంలోని కళాశాల యాజమాన్యం అధ్యాపకురాలు అమితను మర్యాదపూర్వకంగానే ఉద్యోగంలో నుంచి తొలగించారు. పీహెచ్‌డీ పట్టా లేని కారణంగా ఉద్యోగం పోవడంతోపాటు, కుటుంబంలో ఇబ్బందులు తోడవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై, గతేడాది నవంబరు నెలలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

అధికారులను నిలదీసిన ప్రొఫెసర్లు

అమిత చనిపోవడానికి కారణాలపై ఆరా తీసిన ఎంబీఏ విభాగం అధ్యాపకులు ముకుమ్మడిగా శనివారం వీసీ, రిజిస్ర్టార్‌ వద్దకు వెళ్లారు. పీహెచ్‌డీ పట్టాను అందజేయడంలో జరిగిన తీవ్ర జాప్యం కారణంగానే అమిత ఉద్యోగం పోయిందని, దీంతో కుటుంబ సమస్యలు వెంటాడి బలవన్మరణానికి పాల్పడిందని యూనివర్సిటీ రెక్టార్‌ డి.సూర్యచంద్రరావు, ఎంబీఎ విభాగం హెచ్‌వోడీ సీహెచ్‌.జయచంద్రకుమార్‌, ఇతర అధ్యాపకులు వీసీ, రిజిస్ర్టార్‌లకు వివరించారు. అమిత 1405పీహెచ్‌101002 నెంబరుతో 2022 నవంబరు 14వ తేదీనే తన పరిశోధనా పత్రాలను సమర్పించినా ఇంత కాలంగా ఏ కారణంతో ఆమెకు పీహెచ్‌డీ ప్రధానం చేయలేదని నిలదీశారు. అమితతో పాటు సాక్షి వెంకటేష్‌, ఎం.రమ్మశ్రీ, కె.జ్యోత్నప్రియదర్శిని, వై.రఘు తమ పరిశోధనా పత్రాలను సమర్పించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు వైవా పరీక్ష నిర్వహించలేదని, పట్టాలను ప్రధానం చేయలేదని వారు అన్నారు.

పరిశీలన చేస్తాం.. కమిటీ వేస్తాం

అమిత చనిపోయిన విషయం నా దృష్టికి వచ్చింది. ఆమెకు పీహెచ్‌డీ ప్రధానం చేయడంలో జరిగిన ఆలస్యంపై పరిశీలన చేస్తాం. ఆమె ఏ కారణంతో చనిపోయిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఈ అంశంపై ప్రత్యేక కమిటీని వేసి విచారణ చేయిస్తాం. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- జి.జ్ఞానమణి, వైస్‌ చాన్సలర్‌,

కృష్ణా యూనివర్సిటీ

Updated Date - Jan 29 , 2024 | 01:02 AM