Share News

బంగారం కోసమే చంపేశారు

ABN , Publish Date - May 12 , 2024 | 01:11 AM

పట్టణంలోని మిట్టగూడెంలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన కస్తూరి(52) హత్య కేసులో నిందితులను జగ్గయ్యపేట పోలీసులు గుర్తించారు.

బంగారం కోసమే చంపేశారు

అద్దెకున్న వాళ్లే హంతకులు.. మిట్టగూడెంలో మహిళ హత్యకేసును ఛేదించిన జగ్గయ్యపేట పోలీసులు

జగ్గయ్యపేట, మే 11: పట్టణంలోని మిట్టగూడెంలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన కస్తూరి(52) హత్య కేసులో నిందితులను జగ్గయ్యపేట పోలీసులు గుర్తించారు. ఇంట్లో అద్దెకున్న వాళ్లే ఆమెను బంగారం కోసం అన్యాయంగా చంపేశారని, ఇరుగుపొరుగుతో సఖ్యతతో ఉంటూ తలలో నాలుకలా ఉండే ఆమెను కర్కశంగా తాము అద్దెకుండే గదిలో హత్య చేసి, యజమాని ఇంట్లో పడేసి ఏమి తెలియని వారిలా వెళ్లిపోయారని తేల్చారు. పోలీసులు తెలిపిన, సేకరించిన సమాచారం ప్రకారం.. మిట్టగూడెం బండ్ల బజార్‌కు చెందిన గుగ్గిళ్ల లక్ష్మణ(24) ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో పనికి వెళుతుంటాడు. ఆర్నెల్ల క్రితం ఇల్లు కట్టుకుంటూ తల్లితో కలిసి కస్తూరి ఇంట్లో అద్దెకు దిగాడు. ఇంటి నిర్మాణం పూర్తయి గృహప్రవేశం చేశాక ఆ గదిని తన స్నేహితుడైన తాపీ మేస్త్రీ కాటా దుర్గారావు(45)కు అద్దెకు ఇప్పించాడు. దుర్గారావు అంతకు ముందు పట్టణంలోని శాంతినగర్‌ పుట్టబజార్‌లో అద్దెకు ఉండేవాడు. భార్య, పిల్లలను వదిలేసి ఒంటరిగా కస్తూరి ఇంట్లో ఉంటున్నాడు. దుర్గారావు అప్పుడుప్పుడూ తన గదికి అపరిచిత మహిళలను తీసుకుని వస్తుండటంతో కస్తూరి గట్టిగా అభ్యంతరం చెప్పేది. దాంతో ఆమెపై దుర్గారావు గుర్రుగా ఉన్నాడు. సరిగా పనులకు వెళ్లక పోవడంతో లక్ష్మణకు అప్పులయ్యాయి. వీరిద్దరి దృష్టి కస్తూరి మెడలో ఉన్న బంగారంపై పడింది. గురువారం సాయంత్రం అదును చూసి వారిద్దరూ ఆమెను తమ గదిలోకి తీసుకెళ్లి మారణాయుధాలతో తీవ్రంగా కొట్టారు. కస్తూరి ఇంటి వెనుక భాగంలో ఖాళీ స్థలంలో వారు అద్దె కుంటున్న గది ఉండడంతో బయటకు శబ్ధాలు రాలేదు. మారణాయుధాలతో కొట్టి చంపేశాక, కస్తూరి శవాన్ని ఆమె ఇంట్లోనే పెట్టేసి వెనుకనుంచి వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో భర్త తన పని ముగించుకుని వచ్చాక చూస్తే కస్తూరి మృతి చెంది ఉంది. తలపై, కణితిపై దెబ్బలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నందిగామ ఏసీపీ డాక్టర్‌ రవికిరణ్‌, సీఐ జానకీరాంలు దుర్గారావు ఉండే గది తాళాలు తీయించాక గది అంతా రక్తపు మడుగుగా ఉండటంతో దర్యాప్తు చేపట్టారు. నిందితులుగా లక్ష్మణ, దుర్గారావును నిర్ధారించి అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. లక్ష్మణపై చైన్‌ స్నాచింగ్‌ అభియోగాలు ఉన్నాయి.

Updated Date - May 12 , 2024 | 01:11 AM