Share News

ఖరీఫ్‌ ప్రణాళిక సరే..

ABN , Publish Date - May 21 , 2024 | 01:23 AM

వైసీపీ పాలనలో సాగునీటి కాలువల నిర్వహణ లేదు. డ్రెయిన్ల మరమ్మతులు చేపట్టలేదు. కాలువల్లో పేరుకుపోయిన తూటుకాడ, గుర్రపుడెక్కను తొలగించనూ లేదు. ఎప్పుడు తొలగిస్తారో తెలీదు. వీటిని తొలగించకుండా సాగునీటిని ఎలా సరఫరా చేస్తారో స్పష్టత లేదు. నాలుగేళ్లుగా అరాకొరగా ఎరువులు తెప్పించి తీవ్ర కొరత సృష్టించి రైతులను ప్రైవేటు వ్యాపారుల కబంధహస్తాల్లోకి నెట్టేసింది. ఇన్ని ప్రతికూలతలున్నా వాటిని సవరించుకోకుండా ఎప్పటిలానే జిల్లా ఖరీఫ్‌ ప్రణాళికను అధికారులు సిద్ధం చేయడం గమనార్హం.

ఖరీఫ్‌ ప్రణాళిక సరే..

సమస్యలు పరిష్కరించకుండా సాగు ఎలా?

కాల్వల నిర్వహణ శూన్యం

డ్రెయిన్ల మరమ్మతులు లేవు

గుర్రపుడెక్క, తూటుకాడ తొలగించనూ లేదు

ఎప్పుడు తొలగిస్తారో స్పష్టత లేదు

సాగునీటి విడుదల ఎప్పుడో తెలీదు

అయినా ఘనంగా విత్తన ప్రణాళిక

జిల్లాలో 1,72,435 హెక్టార్లలో పంటల సాగు అంచనా

వైసీపీ పాలనలో సాగునీటి కాలువల నిర్వహణ లేదు. డ్రెయిన్ల మరమ్మతులు చేపట్టలేదు. కాలువల్లో పేరుకుపోయిన తూటుకాడ, గుర్రపుడెక్కను తొలగించనూ లేదు. ఎప్పుడు తొలగిస్తారో తెలీదు. వీటిని తొలగించకుండా సాగునీటిని ఎలా సరఫరా చేస్తారో స్పష్టత లేదు. నాలుగేళ్లుగా అరాకొరగా ఎరువులు తెప్పించి తీవ్ర కొరత సృష్టించి రైతులను ప్రైవేటు వ్యాపారుల కబంధహస్తాల్లోకి నెట్టేసింది. ఇన్ని ప్రతికూలతలున్నా వాటిని సవరించుకోకుండా ఎప్పటిలానే జిల్లా ఖరీఫ్‌ ప్రణాళికను అధికారులు సిద్ధం చేయడం గమనార్హం.

మచిలీపట్నం-ఆంధ్రజ్యోతి : జిల్లాలో 2024 సంవత్సరం ఖరీఫ్‌ ప్రణాళికను వ్యవసాయశాఖ రూపొందించింది. జిల్లాలో 1,72,435 హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు అవుతుందని అంచనా వేసింది. అయితే సాగునీటిని ఎప్పటికి విడుదల చేస్తారనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయితే జూన్‌ 6వ తేదీనాటితో ఎన్నికల కోడ్‌ ముగుస్తుంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే కృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేసే అంశంపైనా, కాలువల మరమ్మతులకు నిఽధులు విడుదల చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా రైతులను ముప్పుతిప్పలు పెట్టింది. కాలువల నిర్వహణ దగ్గర నుంచి నీటి విడుదల, ఎరువులు, పురుగు మందులు, విత్తనాల పంపిణీ, ధాన్యం సేకరణ వరకూ అన్ని సందర్భాల్లోనూ అసంబద్ధ విధానాలతో, అస్పష్ట నిర్ణయాలతో కాలం గడిపింది. చివరకు కొన్న ధాన్యానికి కూడా డబ్బులు చెల్లించకుండా తాత్సారం చేసి రైతులను అప్పుల బారిన పడేసింది.

ఖరీఫ్‌ ప్రణాళిక ఇదీ..

జిల్లాలో ఈ ఏడాది ఖరీ్‌ఫ్‌ సీజన్‌లో వరిసాగు 1,65,789 హెక్టార్లలో, చెరకు 4,310 హెక్టార్లలో, వేరుశెనగ 765 హెక్టార్లలో, మినుము 1,135 హెక్టార్లలో, మొక్కజొన్న 112 హెక్టార్లలో, పత్తి 300 హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో మొత్తంగా 1,72,435 హెక్టార్లలో వివిధ పంటలు సాగు జరుగుతుందని ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయశాఖ ద్వారా నివేదిక పంపింది. ఎంటీయూ 1061, ఎంటీయూ 1318, బీపీటీ 5204 రకం వరి వంగడాలకు సంబంధించి 6,691 కింటాళ్ల విత్తనాలను క్వింటాలు రూ.500 చొప్పున సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది. వరి విత్తనాలు ఆయా వంగడాలను బట్టి క్వింటాలు ధరను రూ.3250 నుంచి రూ.3800గా నిర్ణయించింది. భూసారాన్ని పెంచే జీలుగ విత్తనాలు 2864 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 579 క్వింటాళ్లు, పిల్లిపెసర 966 క్వింటాళ్లు 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేయాలని నిర్ణయించింది. జీలుగ విత్తనాలు క్వింటాలుధర రూ..8800 ఉండగా రూ.4400కు, పిల్లిపెసర విత్తనాలు క్వింటాలు రూ.13400 ఉండగా రూ.6700కు, జనుము విత్తనాలు క్వింటాలు రూ.8800 ఉండగా 4400కు అందజేయాలని నిర్ణయించింది. వ్యవసాయ అనుబంధశాఖల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సూచనలు చేయాలని నిర్ణయించింది.

ఎరువులు అందుబాటులో ఉంచుతారా?

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సాగయ్యే పంటలకు 88,601 టన్నుల ఎరువులను రైతులు వినియోగిస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎరువుల ధరలను అధికంగా విక్రయించినా వ్యవసాయ అధికారులు ఎవ్వరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఏప్రిల్‌, మే నెలల్లో జిల్లాలో 13,472 టన్నుల ఎరువులు జిల్లాకు రాగా, మరో 34,326 టన్నుల ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్టు అధికారులు చూపారు. గత నాలుగు సంవత్సరాలుగా రైతులు విరివిగా ఎరువులు వాడే సమయానికి కొరత రావడం ఆనవాయితీగా మారింది. జిల్లాలోని ఆర్బీకేలలో 20 టన్నుల ఎరువులను సీజన్‌ ప్రారంభం నాటికి అందుబాటులో ఉంచాలని నిర్ణయించినా, ఎరువులు పక్కదారి పడతాయని, ధరలు పెరుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరికి చివరి కోటాగా వినియోగించే పొటాష్‌ ఎరువును రైతులకు అందుబాటులో ఉంచకుండా నాలుగేళ్లుగా ప్రభుత్వం తాత్సారం చేసింది. పొటాష్‌ ఎరువును బ్లాక్‌ మార్కెట్‌లో అధికధరకు రైతులు కొనుగోలు చేయాల్సి వచ్చింది.

విత్తనాల కొనుగోలు సమయంలో బిల్లులు తీసుకోవాలి

వరి, ఇతర విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు కచ్చితంగా బిల్లులు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్‌.పద్మావతి రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాల్లో మొలక శాతం పరిశీలించిన తరువాతనే వినియోగించాలని ఆమె తెలిపారు. ఆర్‌బీకేలలో, వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎరువులు కొనుగోలు చేస్తే బిల్లులు తీసుకోవాలని ఆమె సూచించారు.

కలెక్టర్‌ సమీక్ష

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రణాళిక అమలుపై కలెక్టర్‌ సోమవారం వ్యవసాయశాఖ అధికారులతో తన ఛాంబరులో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యాన, డ్రిప్‌ ఇరిగేషన్‌, పట్టుపరిశ్రమ, మత్స్యశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భూమి స్వభావం, ఆయా ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉండే వంగడాలు, రైతులకు ప్రభుత్వం ద్వారా అందించే ప్రోత్సాహకాలు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యాక ప్రతి 15 రోజులకోసారి వ్యవసాయ అనుబంధ శాఖలపై తాను సమీక్ష చేస్తానని ఈలోగా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులను ఆదేశించారు.

Updated Date - May 21 , 2024 | 01:23 AM