కరకట్ట రోడ్డు విస్తరణకు
ABN , Publish Date - Oct 15 , 2024 | 01:34 AM
అమరావతి రాఽజధానికి విజయవాడ నుంచి అత్యంత ప్రధానమైన కరకట్ట మార్గాన్ని నాలుగు వరుసులుగా అభివృద్ధి చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు సన్నాహకాలు చేపడుతున్నారు.
భూముల కోసం సీఆర్‌డీఏ అధ్యయనం
4 వరుసలుగా విస్తరించాలని నిర్ణయం
విజయవాడ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : అమరావతి రాఽజధానికి విజయవాడ నుంచి అత్యంత ప్రధానమైన కరకట్ట మార్గాన్ని నాలుగు వరుసులుగా అభివృద్ధి చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు సన్నాహకాలు చేపడుతున్నారు. టెండర్లు పిలవటానికి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరకట్ట రోడ్డును నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాలని గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించటం జరిగింది. సీడ్ యాక్సెస్ మొదటి దశ పనుల నేపథ్యంలో దీని పనులు చేపట్టలేదు. ఈ లోపు ఎన్నికలు రావటం వైసీపీ ప్రభుత్వ ఏర్పడింది. కరకట్ట రోడ్డును రెండు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులకు పనులు అప్పగించింది. భూముల ఇబ్బందుల వల్ల ఈ పనులు ముందు సాగలేదు. కేవలం 3 ఎకరాల దగ్గర సమస్య రావటంతో కరకట్ట విస్తరణ పనులు సాధ్యం కాలేదు. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తిరిగి నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా చేస్తున్న నేపథ్యంలో, అదనంగా భూములను సేకరించాల్సి వస్తోంది. ఈ మేరకు సీఆర్‌డీఏ అధికారులు ఎంత భూములు అవసరమౌతుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. భూముల ప్రతిపాదన కొలిక్కి రాగానే.. ఈ ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్నారు. భూ సమీకరణ, భూ సేకరణ విధానంలో వీలును బట్టి వెళ్ళాలని సీఆర్‌డీఏ భావిస్తోంది.