Share News

కూటమి అభ్యర్థుల విజయం తథ్యం

ABN , Publish Date - May 15 , 2024 | 12:58 AM

వైసీసీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కూటమి కార్యకర్తలపై దాడులకు పాల్పడినా ఎన్నికలు సజావుగా జరిగాయని, దీనికి పార్టీశ్రేణుల సహకారం అభినందనీయమని మచిలీపట్నం పార్లమెంటు నియోజక ఉమ్మడి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ నియోజక వర్గ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు.

కూటమి అభ్యర్థుల విజయం తథ్యం

మచిలీపట్నం టౌన్‌, మే 14 : వైసీసీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కూటమి కార్యకర్తలపై దాడులకు పాల్పడినా ఎన్నికలు సజావుగా జరిగాయని, దీనికి పార్టీశ్రేణుల సహకారం అభినందనీయమని మచిలీపట్నం పార్లమెంటు నియోజక ఉమ్మడి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ నియోజక వర్గ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఓటమి భయంతో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పేర్ని నాని అనుయాయులు దాడులు జరిపించారని వల్లభనేని బాలశౌరి ఆరోపించారు. వైసీపీ నాయకులు రెచ్చకొడుతున్నా కూటమి శ్రేణులు ఏ విధమైన వాగ్వివాదాలకు దిగకుండా పోలింగ్‌ ప్రశాతంగా జరిగేందుకు సహకరించారన్నారు. ఓటర్లు కసితో కూటమి అభ్యర్థులకు ఓటు వేసారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తామన్నారు. పార్లమెంటు పరిధిలో 83 పోలింగ్‌ శాతం నమోదుకావడం ఉమ్మడి అభ్యర్థుల విజయానికి సంకేతమన్నారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పోలింగ్‌ ప్రారంభానికి గంట ముందు వచ్చి, రాత్రి 11 గంటల వరకు కొన్ని కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేశారన్నారు. రాష్ట్రాలు దాటి ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలి వచ్చారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి లక్షలు ఖర్చు పెట్టి వచ్చారన్నారు. ఎన్‌ఆర్‌ఐ కటకం విజయమణి ఓటు వేసేందుకు వచ్చి గుండెపోటుతో మృతిచెందడం బాధాకరమన్నారు. గొడుగుపేట తదితర ప్రాంతాల్లో ఓటు వేసేందుకు మహిళలు రాత్రి 11 గంటల వరకు వేచి ఉండటం అభినందించదగ్గ విషయమన్నారు. పేర్ని కిట్టు అనుచరులు పోలింగ్‌ కేంద్రాల వద్ద అల్లర్లు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారన్నారు. ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజలు స్వచ్ఛమైన తీర్పు ఇచ్చారని, జూన్‌ 4వ తేదీన ఉమ్మడి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కొనకళ్ల బుల్లయ్య, జనసేన ఇన్‌చార్జి బండి రామకృష్ణ, గోపు సత్యనారాయణ, మోటమర్రి బాబాప్రసాద్‌, లంకే నారాయణ ప్రసాద్‌, పిప్పళ్ల కాంతారావు, గుమ్మడి విద్యాసాగర్‌, వేము కోటేశ్వరరావు, వాలిశెట్టి తిరుమలరావు, జనసేన నాయకులు మాదివాడ రాము, వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 12:58 AM