Share News

కాయ్‌ రాజా కాయ్‌..!

ABN , Publish Date - May 15 , 2024 | 01:19 AM

గన్నవరం, గుడివాడ, విజయవాడ తూర్పు, మైలవరం, పెనమలూరు, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాలలో టీడీపీ అభ్యర్థుల గెలుపుపై విజయవాడలోని ఓ ప్రైవేటు ఉద్యోగి రూ.3 లక్షలు పందెం కాశాడు. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలలో టీడీపీకి 12 అసెంబ్లీ స్థానాలు దాటుతాయని పెనమలూరుకు చెందిన ఓ మోతుబరి రైతు రూ.5 లక్షలు పందెం కాశాడు. ఈ మోతుబరి 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి జిల్లాలో 10కిపైగా స్థానాలు వస్తాయని పందెం కట్టి రూ.10 లక్షల వరకు సంపాదించాడు. అదే జోరుతో ఈసారి లక్షల్లో పందెం కట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో పోలింగ్‌ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీల గెలుపోటములపై ఏ స్థాయిలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయో తెలిపేందుకు ఈ రెండు ఉదంతాలే ఉదాహరణలు.

కాయ్‌ రాజా కాయ్‌..!

పార్టీల గెలుపోటములపై జోరుగా పందేలు

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలో రూ.100 కోట్ల మేర బెట్టింగ్‌లు

జూన్‌ 4 నాటికి రూ.500 కోట్లు దాటే చాన్స్‌

గన్నవరం, గుడివాడలపై రూపాయికి రెండు రూపాయలు

విజయవాడ తూర్పు, మైలవరం, పెనమలూరు, మచిలీపట్నంలలో టీడీపీ కచ్చితంగా గెలుస్తుందని పందేలు

మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ జనసేన అభ్యర్థుల గెలుపుపైనా అంతే

గన్నవరం, గుడివాడ, విజయవాడ తూర్పు, మైలవరం, పెనమలూరు, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాలలో టీడీపీ అభ్యర్థుల గెలుపుపై విజయవాడలోని ఓ ప్రైవేటు ఉద్యోగి రూ.3 లక్షలు పందెం కాశాడు. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలలో టీడీపీకి 12 అసెంబ్లీ స్థానాలు దాటుతాయని పెనమలూరుకు చెందిన ఓ మోతుబరి రైతు రూ.5 లక్షలు పందెం కాశాడు. ఈ మోతుబరి 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి జిల్లాలో 10కిపైగా స్థానాలు వస్తాయని పందెం కట్టి రూ.10 లక్షల వరకు సంపాదించాడు. అదే జోరుతో ఈసారి లక్షల్లో పందెం కట్టేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో పోలింగ్‌ ముగిసిన తర్వాత ప్రధాన పార్టీల గెలుపోటములపై ఏ స్థాయిలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయో తెలిపేందుకు ఈ రెండు ఉదంతాలే ఉదాహరణలు.

(విజయవాడ, ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇప్పుడు బెట్టింగ్‌ సీజన్‌ నడుస్తోంది. ఎన్నికల బెట్టింగ్‌కు భారీగా తెర లేచింది. ఎలక్షన్‌ ముగియటంతోనే పనిలోపనిగా బెట్టింగ్‌ బాబులు జోరు పెంచారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయి మూడు నాలుగు రోజులు కూడా కాకముందే కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందెం రాయుళ్లను వెర్రెక్కిస్తున్నారు. రెండు జిల్లాల్లో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశాన్ని మొదలుకుని కీలకమైన అభ్యర్థులు సాధించే మెజారిటీల వరకు అన్నింటిపైనా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.

విజయవాడ తూర్పు, మైలవరం, గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో కూటమి తరపున టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో వారు గెలుపొందే అవకాశాలను బెట్టింగ్‌ రాయుళ్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు.

మచిలీపట్నం పార్లమెంట్‌, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలు కచ్చితంగా కూటమి తరపున జనసేన అభ్యర్థులు గెలుస్తారన్న దానిపై బెట్టింగులు జోరందుకున్నాయి.

విజయవాడ నగరంలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయన్న దానిపైనా లక్షల్లో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.

తిరువూరు నియోజకవర్గంలో కూటమి, వైసీపీ అభ్యర్థులు ఇద్దరి పైనా బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. ఫ కృష్ణాజిల్లాలో మాజీ మంత్రులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. గుడివాడ, పెనమలూరు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోతారని బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.

విజయవాడ తూర్పు, మైలవరం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల మెజారిటీపైనా బెట్టింగులు జరుగుతున్నాయి. జగ్గయ్యపేట, నందిగామలో రెండు పార్టీల అభ్యర్థుల ఓట్ల శాతం, గెలుపోటములపై బెట్టింగులు జరుగుతున్నాయి.

రాజకీయ విశ్లేషణల ఆధారంగా బెట్టింగులు

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములను విశ్లేషించేందుకు ఆయా పార్టీల వారీగా రాజకీయ నిపుణులు రంగంలోకి దిగారు. వీరు బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలు.. వాటిలో యువత ఎంత మంది.. మహిళలు ఎంత మంది.. అన్న వివరాలు సేకరించి పార్టీలకు ఓట్లు ఎలా పడి ఉంటాయన్న అంచనాకు వస్తున్నారు. ఆయా బూత్‌ల్లో పార్టీలకు ఉన్న పట్టును కూడా పరిగణనలోకి తీసుకుని గెలుపోటములను అంచనా వేస్తున్నారు. బూత్‌లవారీగా లెక్కలు వేసుకుని ఒక అంచనాకు వచ్చిన తర్వాత బెట్టింగ్‌ కోసం సమాచారాన్ని పంపుతున్నారు. బెట్టింగ్‌ బాబుల్లో అధికశాతం ఈసారి ప్రధాన పార్టీల ద్వితీయశ్రేణి

నాయకులే ఉండటం గమనార్హం. జిల్లా స్థాయిలో ఆయా పార్టీల్లో ముఖ్య నేతలుగా ఉన్నవారు కూడా

బెట్టింగ్‌ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా రాజకీయాల చుట్టూ ఉన్న పందేలు కావటంతో నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేవలం విజయవాడ నగర పరిధిలోనే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, వైసీపీకి చెందిన సుమారు వంద మందికిపైగా నేతలు బెట్టింగ్‌ వ్యవహారానికి కేంద్రంగా మారడం గమనార్హం.

మధ్యవర్తులకు డబ్బేడబ్బు..

ఈసారి బెట్టింగ్‌ కాసేవారు పక్కాగా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్‌కు ముందుకు వచ్చిన వారు ముందుగా ఓ ఒప్పందం పత్రం రాసుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గర బెట్టింగ్‌ మొత్తాన్ని ఉంచుతున్నారు. ఫలితం తేలిన తర్వాత ఆ వ్యక్తి ఒప్పందం ఆధారంగా నగదును ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మధ్యవర్తులుగా ఉన్నవారికీ భారీగానే గిట్టుబాటు అవుతోంది. పందెం మొత్తంలో 5 నుంచి 10 శాతం కమీషన్‌ రూపేణా మధ్యవర్తులకు అందజేస్తున్నారు. రెండు జిల్లాల్లో ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల మేర బెట్టింగ్‌ జరుగుతున్నట్టు అంచనా. ఫలితాలు వెలువడే తేదీ అయిన జూన్‌ 4 నాటికి ఈ బెట్టింగ్‌ల మొత్తం రూ.500 కోట్లకు చేరే అవకాశం ఉందని సమాచారం.

Updated Date - May 15 , 2024 | 01:19 AM