Share News

జోగి.. నానా యాగీ..

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:53 AM

మైలవరం రాజకీయాల్లో మంత్రి జోగి రమేశ్‌ ప్రమేయం వివాదాస్పదమవుతోంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా టార్గెట్‌ చేసి కేసులతో వేధించే పరిస్థితికి చేరింది. మంత్రి ఏకపక్ష ధోరణితో ఇప్పుడు మైలవరంలో వైసీపీ వర్గాలు రెండుగా విడిపోయాయి.

జోగి.. నానా యాగీ..

మైలవరంలో సొంత పార్టీ నాయకులపైనే కేసులు

గతంలో వసంత.. ఇప్పుడు కేశినేని నాని వెంట ఉన్నవారే టార్గెట్‌

కొండపల్లిలో కొట్లాట.. సర్ది చెప్పకుండా పోలీసుల వరకూ..

మనిషి పెనమలూరులో.. మనసు మైలవరంలో..

రోజురోజుకూ రచ్చకెక్కుతున్న వివాదాలు

విజయవాడ/ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 4 : మైలవరం రాజకీయాల్లో మంత్రి జోగి రమేశ్‌ ప్రమేయం వివాదాస్పదమవుతోంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా టార్గెట్‌ చేసి కేసులతో వేధించే పరిస్థితికి చేరింది. మంత్రి ఏకపక్ష ధోరణితో ఇప్పుడు మైలవరంలో వైసీపీ వర్గాలు రెండుగా విడిపోయాయి. ఎంపీ కేశినేని నానీకి అనుకూలంగా ఉన్నవారిని, గతంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ వెంట ఉన్నవారిని టార్గెట్‌ చేసి ఆయన వికృత క్రీడ ఆడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమకు గిట్టనివారిని జోగి అనుచరగణం బూతులు తిట్టడం, వీలైతే దాడికి యత్నించడం చేస్తూ పొమ్మనకుండానే పొగబెడుతోంది.

సొంత పార్టీ వారిపై కేసులు

కొండపల్లికి చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్‌ మొగిలి దయాసాగర్‌.. గతంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ అనుచరుడిగా ఉండేవారు. వసంత వైసీపీని వీడటంతో ఆయన ఎంపీ కేశినేని నానీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఈనెల 1న కొండపల్లిలో వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో మంత్రి జోగి రమేశ్‌ ఫొటో వేయలేదు. దీంతో ఆయన అనుచరుడు, వైసీపీ బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు వేములకొండ సుబ్బారావు రెచ్చిపోయి కౌన్సిలర్‌ మొగిలి దయాసాగర్‌ చొక్కా కాలర్‌ పట్టుకోవడంతో పక్కనే ఉన్నవారు సుబ్బారావుకు దేహశుద్ధి చేశారు. ఆ గొడవను ఆసరా చేసుకుని సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్‌ దయాసాగర్‌, ఆయన అనుచరులు కాండ్రకొండ దిలీప్‌, కందివలస దుర్గారావు, అయజ్‌, శశి, కండెల రాము, కిషోర్‌ మరికొంతమందిపై సుబ్బారావుతో జోగి కేసు పెట్టించారు. దీంతో ఎస్సై యు.పాపారావు వారిపై గురువారం కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో దయా వర్గంతో పాటు ఆయన సామాజికవర్గం జోగిపై రగిలిపోతోంది. సొంత పార్టీలో జరిగే చిన్నచిన్న ఘర్షణలను సర్ది చెప్పాల్సిన మంత్రి స్థాయి వ్యక్తి.. అయిన వారిపైనే కేసులు పెట్టించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పెనమలూరులో పోటీ చేస్తున్న జోగి మనిషి అక్కడున్నా.. మనసంతా మైలవరంపైనే ఉందని ఆ పార్టీ వ్యక్తులే చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆయన వ్యతిరేక వర్గం ఉన్నట్టు సమాచారం.

Updated Date - Apr 05 , 2024 | 12:53 AM