Share News

జిల్లాలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - May 03 , 2024 | 12:57 AM

అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వైసీపీని బంగళాఖాతంలో కలిపేద్దామని మాజీ మంత్రి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు.

జిల్లాలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 2 : అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వైసీపీని బంగళాఖాతంలో కలిపేద్దామని మాజీ మంత్రి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం జనసేన నియోజక వర్గం ఇన్‌చార్జి బండి రామకృష్ణ, జనసేన నాయకులు మాదివాడ రాము, కొరియర్‌ శ్రీనులతో కలిసి మచిలీపట్నం అసెంబ్లీ నియోజక వర్గంలో కొల్లు రవీంద్ర విస్తృతంగా పర్యటించారు. చిలకలపూడిలో వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. అనంతరం ట్రాక్టర్‌ తోలి బందరు మండలం హుస్సైన్‌పాలెం, చిట్టిపాలెం గ్రామాల్లో రవీంద్ర, రామకృష్ణలు పర్యటించారు. హుస్సైన్‌పాలెంలో ఉమ్మడి ప్రచార కరపత్రాలను నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళలు రవీంద్రకు హారతులిచ్చారు. ప్రచార రథానికి గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ, వైసీపీ విధానాలు నచ్చక పలువురు జనసేన, టీడీపీలో చేరుతున్నారన్నారు. ఓటమి భయంతో పార్టీల్లోకి చేరిన కార్యకర్తలపై వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్‌ సిక్స్‌ పథకాలను కొల్లు రవీంద్ర వివరించారు. మరో వారం రోజుల్లో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఎన్నికల బరిలో.. బాలశౌరి సిక్స్‌లే : బండి రామకృష్ణ

మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బాలశౌరికి బ్యాలెట్‌ పేపరులో ఆరో నెంబరు వచ్చిందని, ఈ ఎన్నికల బరిలో బాలశౌరి సిక్స్‌లు కొట్టబోతున్నారన్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్‌ తొలగించడం ముదావహమన్నారు. విశ్వబ్రాహ్మణ కాలనీలో జనసేన నాయకులపై వైసీపీ కార్యకర్తలు రెచ్చకొట్టే విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథం, రామధాని వేణు, ఎండీ ఇలియా్‌సబాషా, పిప్పళ్ల కాంతారావు, అమ్మిరెడ్డి శివయ్య, చండిక ఉపేంద్ర, శ్రీకాకుళపు సముద్రాలు, రామధాని వేణు తదితరులు పాల్గొన్నారు.

గీత కార్మికులను ఆదుకుంటాం : నందమూరి రామకృష్ణ

మచిలీపట్నం టౌన్‌ : వైసీపీ ప్రభుత్వంలో గీత కార్మికులకు తీరని అన్యాయం జరిగిందని ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. బందరు మండలం సుల్తానగరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో నందమూరి రామకృష్ణ, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి కొల్లు రవీంద్రలు పాల్గొన్నారు. టీడీపీ సుల్తానగరం గ్రామ కమిటీ అధ్యక్షుడు చిట్టిబొమ్మ వనరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు బీసీలకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు.

అభివృద్ధి చేసి చూపిస్తా.. : డోకిపర్రులో వెనిగండ్ల ప్రచారం

గుడ్లవల్లేరు : గుడివాడ ప్రజలకు అభివృద్ధిని రాబోయే ఐదేళ్లలో చేసి చూపిస్థా.. అని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. గురువారం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు, లంకాదొడ్డి, మామిడికోళ్ల, కౌతవరం ఫస్ట్‌ వార్డు, గుడ్లవల్లేరు గ్రామాల్లో వెనిగండ్ల రాము రోడ్‌ షో నిర్వహించారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో సమస్యలను ప్రజలు రాము దృష్టికి తీసుకొచ్చారు. డోకిపర్రు- లంకాదొడ్డి రహదారి, మామిడికోళ్ల-గుడ్లవల్లేరు రహదారి గత పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. చంద్రబాబు సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వెనిగండ్ల ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావు, కొసరాజు బాపయ్య చౌదరి, వల్లభనేని వెంకటరావు, శాయిన పుష్పావతి, కొడాలి రామరాజు, వీరమాచనేని శివప్రసాద్‌, జయరామ్‌, లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, తోట మల్లి, రాధిక, ఎ.రామ్మోహన్‌, రంగబాబు, పొట్లూరి రవికుమార్‌, పోలవరపు వెంకటరావు, వల్లభనేని వెంకట సుబ్బారావు చౌదరి, మోహన్‌, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:57 AM