Share News

జీ హుజూర్‌పై వేటు!

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:21 AM

ఎన్నికల వేళ కొందరు ఐఏఎస్‌ అధికారులు సైతం అధికార వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరిస్తుండటంపై ఎట్టకేలకు ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో బదిలీ వేటు పడింది. అధికారపార్టీ నేతలు చెప్పిందే వేదంగా అనుసరించడం.. ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులు వచ్చినా.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించినా స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడితో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిన కలెక్టర్‌పై ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. ఫలితం ఆయనపై బదిలీ వేటు వేసి ఎన్నికల విధులకు దూరంగా కూర్చోబెట్టింది.

జీ హుజూర్‌పై వేటు!

కలెక్టర్‌ రాజాబాబు బదిలీ

జేసీకి అదనపు బాధ్యతలు

ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయకపోవడంపై ఈసీ సీరియస్‌

మచిలీపట్నం, గన్నవరంలో యథేచ్ఛగా దొంగ పట్టాల పంపిణీ

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిన వైనం

కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో ఏడాదిలోపే బదిలీ

ఎన్నికల వేళ కొందరు ఐఏఎస్‌ అధికారులు సైతం అధికార వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరిస్తుండటంపై ఎట్టకేలకు ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో బదిలీ వేటు పడింది. అధికారపార్టీ నేతలు చెప్పిందే వేదంగా అనుసరించడం.. ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులు వచ్చినా.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించినా స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడితో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిన కలెక్టర్‌పై ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. ఫలితం ఆయనపై బదిలీ వేటు వేసి ఎన్నికల విధులకు దూరంగా కూర్చోబెట్టింది.

(ఆంధ్రజ్యోతి -మచిలీపట్నం/ విజయవాడ) : 2023 ఏప్రిల్‌ 15న కృష్ణా కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు చేపట్టారు. ఏడాది గడువక ముందే ఆయనపై బదిలీ వేటు పడటంతో ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. వైసీపీ నేతల అక్రమాలకు ఊతమిచ్చేలా వ్యవహరించిన ఫలితమే కలెక్టర్‌ బదిలీకి కారణమైందని కలెక్టరేట్‌ సిబ్బందే వ్యాఖ్యానిస్తున్నారు. కృష్ణాజిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఓట్ల అక్రమాలపై చర్యల్లేవు

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో డోర్‌ నెంబర్లు లేకుండా, ఒకే కుటుంబంలోని సభ్యులను వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లుగా చేర్చడం, ఓటర్లు నివాసం ఉండే ప్రాంతాలకు దగ్గరలోని పోలింగ్‌ కేంద్రాల్లో కాకుండా ఐదారు కిలోమీటర్ల దూరంలోని పోలింగ్‌ కేంద్రాలను కేటాయించడం వంటి ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ తప్పులను సరిచేయాలని మచిలీపట్నం టీడీపీ నాయకులు ఎంతో కాలంగా పోరాడుతున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు ఐ.దిలీప్‌కుమార్‌ హైకోర్టునూ ఆశ్రయించారు. ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. ఎంత పోరాడినా జాబితాలో తప్పులను సరిచేయకుండా మచిలీపట్నం ఆర్‌వోగా గతంలో వ్యవహరించిన ఆర్డీవో కిషోర్‌ ఓటర్ల జాబితాల సవరణ కీలక సమయంలో దీర్థకాలంపాటు సెలవుపెట్టి వెళ్లిపోయారు. మళ్లీ మచిలీపట్నానికి రాకుండా వేరే ప్రాంతానికి ఆయన బదిలీ చేయించుకున్నారు. దీంతో మచిలీపట్నం నగరంలోని ఓటర్ల జాబితా సక్రమంగా తయారు కాలేదు. పోలింగ్‌స్టేషన్లు ఏ డోర్‌ నెంబరు నుంచి ప్రారంభమై, ఏ డోర్‌నెంబరుతో ముగుస్తుందో వివరాలు లేకుండా పోలింగ్‌ కేంద్రాల సరిహద్దులను కూడా నిర్ణయించకుండా ఓటర్ల జాబితాలను తయారు చేశారు. అధికారపార్టీ నాయకులు ముఖ్యంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఒత్తిడితోనే ఓటర్ల జాబితాలను అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా తయారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతిపక్ష నాయకులు వివరాలు కోరితే తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు ఈ అంశానికి సంబంధించిన సమాచారం తమ వద్దలేదని సమాధానం ఇచ్చారు.

నాని ఆదేశంతో తహసీల్దార్‌ సస్పెండ్‌ను ఆపిన కలెక్టర్‌

తప్పులతడకగా ఓటర్ల జాబితాలు తయారు చేసిన మచిలీపట్నం తహసీల్దార్‌ కార్యాలయం ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే సంబంధిత అధికారిని సస్పెండ్‌ చేసినట్టు ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్‌ ఆ తర్వాత పేర్ని నాని ఒత్తిడితో ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ అంశంపై వివాదాస్పదమైంది. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయాలని, బాధ్యుడైన ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను కలెక్టర్‌ బుట్టదాఖలు చేశారు.

దొంగ పట్టాలపై కళ్లకు గంతలు

ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత మచిలీపట్నంలో స్ర్టీట్‌ఫీల్డ్‌ (ఎస్‌ఎఫ్‌) సర్వే నెంబరుతో ఓటర్లను ఆకర్షించేందుకు దొంగ ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి పేర్ని నాని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ అనధికార ఆదేశాలతో రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారు. దీంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులతో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనాకు ఫిర్యాదు చేశారు. మరుసటిరోజు తహసీల్దార్‌ కార్యాలయంలో రాత్రి సమయంలో దొంగ ఇంటి పట్టాలపై రెవెన్యూ అధికారులు సంతకాలు చేస్తున్నారనే సమాచారంతో టీడీపీ నాయకులు అక్కడకు వెళ్లి ఆందోళన చేశారు. జేసీ గీతాంజలి శర్మ రాత్రి 12 గంటల సమయంలో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఈ అంశంపై విచారణ చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో టీడీపీ నాయకులు ఆందోళన విరమించారు. ఇంత జరిగినా నేటికీ దొంగ ఇంటిపట్టాల పంపిణీ గుట్టుచుప్పుడు కాకుండా జరుగుతూనే ఉంది. గన్నవరం నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యే వంశీ కూడా ఇదే తరహాలో దొంగ ఇంటి పట్టాలకు తెరదీశారు. వీటన్నింటినీ కలెక్టర్‌ చూసీచూడనట్టు వదిలేస్తూనే ఉన్నారు.

12వేల ఎకరాల అసైన్డ్‌ భూములకు పట్టాలు

మచిలీపట్నం మండలంలో 12 వేల ఎకరాల అసైన్డ్‌భూములకు పట్టాలు పంపిణీ చేసే అంశంలోనూ రెవెన్యూ అధికారులపై అధికారపార్టీ నాయకుడు పేర్ని నాని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. బందరు మండలంలోని కోన, తాళ్లపాలెం, రుద్రవరం తదితర గ్రామాల్లో అసైన్డ్‌ భూములకు రైతుల పేరున పట్టాలు ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఎంపీ నిధులతో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనుమతులు ఇవ్వకుండా కలెక్టర్‌పై అధికారపార్టీకి చెందిన శాసనసభ్యులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దీనిపైనా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలకు జీహుజూర్‌ అంటూ పనిచేసిన పాపానికి కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. ఎన్నికల విధులకు సంబంధంలేని పోస్టులో కలె క్టర్‌ను నియమించాలని ఎన్నికలసంఘం ఆదేశాలు జారీ చేసింది.

జేసీకి అదనపు బాధ్యతలు

కలెక్టర్‌ పి.రాజాబాబు బదిలీతో ఆయనను జనరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు జేసీ గీతాంజలి శర్మకు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:21 AM