బీసీలను మోసం చేస్తున్న జగన్: సింహాద్రి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:42 AM
నా బీసీలు, నా ఎస్సీలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టికెట్ల కేటాయింపులో సొంత పార్టీలోని బీసీలను జగన్మోహనరెడ్డి నమ్మించి మోసం చేస్తున్నారని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకాచారి అన్నారు.

బీసీలను మోసం చేస్తున్న జగన్: సింహాద్రి
విద్యాధరపురం, జనవరి 11: నా బీసీలు, నా ఎస్సీలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టికెట్ల కేటాయింపులో సొంత పార్టీలోని బీసీలను జగన్మోహనరెడ్డి నమ్మించి మోసం చేస్తున్నారని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకాచారి అన్నారు. గురువారం ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలను జగన్‌రెడ్డి కలవకుండా వారి మనోభావాలు జీవితాలతో చెలగాటమాడుతున్నాడని ఎద్దేవా చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలన్న నినాదంతో బీసీలందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీ ఓటమి ఖాయం: సాదరబోయిన
వైసీపీలో బీసీ నేతలకు గౌరవం లేదని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓటమి చెందటం ఖాయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు విమర్శించారు. గురువారం పశ్చిమలోని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల ముందు వైసీపీ బీసీ నేతలు బానిసలుగా తలవంచుకుని బతుకుతున్నారన్నారు. త్వరలోనే బీసీ ఎంపీ డాక్టర్ సంజీవ్‌లా కొద్దిరోజుల్లో బీసీ నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నారన్నారు. రాజగిరి అశోక్, బి.సత్తిబాబు, జి.సుధాకర్ పాల్గొన్నారు.
బీసీల ద్రోహి జగన్‌రెడ్డి: లుక్కా
బీసీ యువతకు ఉన్నత విద్యను దూరం చేసి విదేశీ విద్య అవకాశాలు లేకుండా చేసిన దుర్మార్గుడు, బీసీల ద్రోహి జగన్‌రెడ్డి అని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్‌గౌడ్ అన్నారు. గురువారం మొగల్రాజపురంలోని టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి బీసీలను మోసం చేసిన ఘనత జగన్‌రెడ్డిదేనని విమర్శించారు. ఇప్పటికైనా బీసీలు మేల్కొని వచ్చే ఎన్నికలలో బీసీల దమ్ము ఏమిటో జగన్‌రెడ్డికి చూపించాలని తెలిపారు. పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.