రవాణా.. అవినీతి జమానా
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:07 AM
మచిలీపట్నం రవాణా శాఖ కార్యాలయంలో అనధికార నగదు వసూళ్ల మోత మోగుతోంది. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి ఇక్కడ నగదు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన రవాణా శాఖ అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడంతో ఇన్‌చార్జి అధికారి కనుసన్నల్లో ఈ అవినీతి జరుగుతోందనే గుసగుసలు వస్తున్నాయి. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఈ అనధికార వసూళ్లను వేగవంతం చేశారని తెలుస్తోంది. గ్రీన్‌ట్యాక్స్ చెల్లించకుండా చూస్తామంటూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

మచిలీపట్నం రవాణా శాఖ కార్యాలయంలో అక్రమాలు
ప్రతి పనికీ రేటు కట్టి వసూళ్లు
గ్రీన్‌ట్యాక్స్ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి
70 మంది ఏజెంట్లు, ప్రతి ఒక్కరికీ కోడ్ నెంబర్లు
ఏజెంట్ కోడ్ ఉంటేనే పనిపూర్తి, లేకుంటే ఫైలు పక్కనే..
వసూళ్లలో ఇన్‌చార్జి అధికారి దూకుడు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం రవాణా శాఖ కార్యాలయంలో అనధికార ఏజెంట్లు నగదు వసూలు చేస్తున్నారు. పాత ట్రాక్టర్ ట్రక్కులకు రంగులు వేసి, నూతన ట్రక్కులుగా మార్చి, కొత్త నెంబర్లు ఇచ్చినందుకు ప్రత్యేకంగా నగదు తీసుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందే ఈ అనధికార వసూళ్లను వేగవంతం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి గ్రీన్‌ట్యాక్స్ చెల్లించకుండా చేస్తున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేస్తే వాస్తవాలు బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
అవినీతి ఇలా..
రైతులు ట్రాక్టర్ ట్రక్కులను కొత్తవి కొంటే, వాటిని ఎఫ్‌ఆర్‌లుగా చూపి కొత్త నెంబర్లు ఇవ్వాలి. ఒకసారి రవాణా శాఖ కార్యాలయంలో నమోదైన ట్రాక్టర్ ట్రక్కులకు గ్రీన్‌ట్యాక్స్ రూపంలో మూడు నెలలకోసారి, ఏడాదిలో నాలుగు విడతలుగా ట్రక్కు కొలతలను బట్టి కనీసం రూ.50 వేల నుంచి రూ.70 వేలు చెల్లించాలి. కానీ, ఈ గ్రీన్‌ట్యాక్స్ చెల్లించే విషయంలో రవాణా శాఖ అధికారులు తమ తెలివితేటలన్నీ ఉపయోగిస్తున్నారు. పాత ట్రక్కులకు గ్రీన్‌ట్యాక్స్ లేకుండా చేస్తామంటూ తమ వద్ద ఉన్న ఏజెంట్లతో తెరవెనుక ట్రాక్టర్ యజమానులతో బేరాలాడిస్తున్నారు. ట్రక్కులు తయారు చేసేవారి నుంచి నూతన ట్రక్కు కొనుగోలు చేసినట్లుగా కాగితాలు తెచ్చుకుంటే, వాటిని ఆధారంగా చూపి పాత ట్రక్కులకు కొత్త నెంబర్లు ఇచ్చే పనిని చకాచకా చేసేస్తున్నారు. కొంతకాలంగా మచిలీపట్నం రవాణా శాఖ కార్యాలయం నుంచి 600లకు పైగా పాత ట్రక్కులకు కొత్త నెంబర్లు ఇవ్వడం గమనించదగ్గ అంశం. ఇందుకు సంబంధిత అధికారికి రూ.5 వేలు, ఇతరత్రా ఖర్చుల కింద కొంత నగదు చెల్లిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. దీంతో పాతట్రాక్టర్ ట్రక్కులకు చెల్లించాల్సిన గ్రీన్‌ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయానికి పెద్దమొత్తంలో గండిపడుతోంది. పాత ట్రక్కులకు రంగులువేసి వాటిని కొత్తవిగా చూపి, వాటికి కొత్త నెంబర్లు ఇచ్చే పనిని మచిలీపట్నం రవాణా శాఖ కార్యాల యంలో వేగవంతంగా చేస్తున్నారు.
70 మంది ఏజెంట్లు, వారికి కోడ్ నెంబర్లు
మచిలీపట్నం రవాణా శాఖ కార్యాలయ పరిధిలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ కార్యాలయంలో వివిధ పనులు చేసేందుకు 70 మంది ఏజెంట్లు ఉన్నారు. వీరంతా కార్యాలయానికి దూరంగా నిలబడి ఉంటారు. లైసెన్సులు, వాహనాల రెన్యువల్స్, టెస్టింగ్.. ఇతర పనులకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఈ ఏజెంట్లే చూస్తారు. ఏజెంట్లకు ప్రత్యేక నెంబరుతో కోడ్ ఉంటుంది. కార్యాలయంలోకి వెళ్లే ప్రతి దరఖాస్తుపైన ఏజెంట్ కోడ్ నెంబరును తప్పనిసరిగా వేయాలి. ఈ నెంబరు ఉంటేనే సంబంధిత ఫైలుకు మోక్షం లభిస్తుంది. ఏజెంట్ల ద్వారా కాకుండా ఎవరైనా నేరుగా వివిధ పనుల కోసం దరఖాస్తు చేసుకుంటే, అనేక కొర్రీలుపెట్టి తిరస్కరిస్తారు. ప్రభుత్వానికి చెల్లించే నగదు కాకుండా, అదనంగా ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.600, టెస్టింగ్‌కు రూ.1,200 చొప్పున ఏజెంట్లకు అందజేస్తే ఆ పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్టే అయిపోతాయి.
టిప్పర్లు, లారీల నుంచి నెలవారీ మామూళ్లు
మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో టిప్పర్లు, భారీ వాహనాల ద్వారా ఇసుక, బుసక రవాణా నిత్యం జరుగుతూ ఉంటుంది. వీటిలో అనధికారికంగా తిరిగే వాహనాలే అధికంగా ఉంటాయి. ప్రభుత్వానికి ఏమైనా ఫిర్యాదులు అందితే తప్ప, ఈ వాహనాలను అధికారులు తనిఖీ చేయరు. బుసక, ఇసుక అక్రమ రవాణా చేసే వారి నుంచి నెలనెలా మామూళ్ల రూపంలో పెద్దమొత్తంలో నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.