Share News

ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ పునరుద్ధరణ కార్యక్రమాలు ప్రారంభం

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:00 AM

ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ పునరుద్ధరణకు సంబంధించి ఐదురోజుల (పంచాహ్నిక) దీక్షాకార్యక్రమాలలో తొలిరోజు బుధవారం వేదోక్త శాస్త్రోక్త విధానంలో క్రతువు ప్రారంభమైంది.

ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ  పునరుద్ధరణ కార్యక్రమాలు ప్రారంభం

వన్‌టౌన్‌, ఫిబ్రవరి 14 : ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ పునరుద్ధరణకు సంబంధించి ఐదురోజుల (పంచాహ్నిక) దీక్షాకార్యక్రమాలలో తొలిరోజు బుధవారం వేదోక్త శాస్త్రోక్త విధానంలో క్రతువు ప్రారంభమైంది. దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహచనం కార్యక్రమాలలో పాల్గొని పూజలు నిర్వహించారు, ఐదు రోజుల దీక్ష స్వీకరించారు. పండితుల వేద ఘోష, మంగళవాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ మధ్య పూజలు, హోమాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర జలాలను యాగశాలలో, ఆలయంలో ప్రోక్షించారు. సాయంత్రం యాగశాల శుద్ది అనంతరం హోమాలు, అర్చనలకు శ్రీకారంచుట్టారు. ఆలయ ఇన్‌చార్జి ఈవో కోటేశ్వరరావు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు, దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

వెయ్యేళ్ల తర్వాత పునరుద్ధరణ..

ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయాన్ని వేయి సంవత్సరాలకు పునరుద్ధరిస్తున్నట్టు దేవదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 11వ శతాబ్దంలో ఆలయం నిర్మించిన తరువాత మరల తొలిసారిగా పునరుద్దరణ జరుగుతోందన్నారు. 18వ తేదీ 11.45 గంటలకు కుంభాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, బాలాలయంలోని మూలవిరాట్టుకు కళాపకర్షణ చేస్తారన్నారు. నాటి రాతి స్తంభాల మాదిరే పునరుద్దరణలో కూడా నిర్మాణం చేశారన్నారు. ఇక నుంచి దుర్గమ్మ భక్తులు మల్లేశ్వరుని కూడా దర్శించుకోవచ్చునన్నారు. మల్లేశ్వరాలయ పునరుద్ధరణకు ఐదురోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ఆలయ ముఖ్య అర్చకుడు శంకరశాండిల్య తెలిపారు. అర్జునుడు ఇక్కడ మల్లేశ్వరలింగాన్ని ప్రతిష్టించినట్టు చరిత్ర ఉందని, ద్వాపరయుగం నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నట్టు పురాణాలలో ఉందన్నారు. మల్లేశ్వరాలయ పునరుద్ధరణకు నగరానికి చెందిన సంగా నరసింహరావు ధ్వజస్తంభ స్వర్ణ శిఖరం ఏర్పాటుకు విరాళమిచ్చారు. ఆయనకు బుఽధవారం వేదపండితులు సాదర స్వాగతం పలికారు.

వీణాపాణి సరస్వతికి వీణావాదనారాధన..

వీణాపాణి సరస్వతికి వీణావాదనతో కళాకారులు ఆరాధించారు. సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితికి చెందిన కళాకారులు ఫణిశిరీష, శంకరి, చరణ్‌, స్వాత్విక, కృష్ణవేణి, సాహితి, ప్రణవి, జయశ్రీ, శివప్రియ, లిఖితలు వీణలతో ప్రతిభను చాటారు. వసంత పంచమినాడు బుధవారం దుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, భక్తులు దర్శించుకున్నారు. విద్యార్ధులకు కంకణాలు, పెన్నులు, అమ్మవారి ఫొటో కానుకగా ఇచ్చారు.

దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి దంపతులు

దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయమర్యాదలతో అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదం, శేషవస్త్రం, ఆశీస్సులు అందజేశారు.

అన్నవితరణకు రూ 10 లక్షలు విరాళం

దుర్గామల్లేశ్వర దేవస్థానంలో అన్నవితరణకు విజయవాడకు చెందిన కె.రత్నాకర్‌రావు, లక్ష్మి, కుటుంబసభ్యులు బుఽధవారం రూ. 10 లక్షలు చెక్కు రూపంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ద్వారా అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం దాతకు శేషవస్త్రం, ప్రసాదం, ఆశీస్సులు అందజేశారు.

Updated Date - Feb 15 , 2024 | 01:00 AM