Share News

దేవదాయశాఖలో.. బడ్జెట్‌ దందా!

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:58 AM

ఆర్థిక సంవత్సరం మారుతుందంటే దేవదాయశాఖలో కొందరు అధికారులకు కాసుల వర్షం కురుస్తుంది. ప్రతియేటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో శాఖ పరిధిలోని ఆలయాలు, సత్రాలు బడ్జెట్‌ కేటాయింపులు చేయించుకోవాల్సి ఉంటుంది. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ కేటాయింపులు ప్రస్తుతం నడుస్తున్నాయి.

దేవదాయశాఖలో.. బడ్జెట్‌ దందా!
దేవదాయశాఖలో.. బడ్జెట్‌ దందా!

(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

ఆర్థిక సంవత్సరం మారుతుందంటే దేవదాయశాఖలో కొందరు అధికారులకు కాసుల వర్షం కురుస్తుంది. ప్రతియేటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో శాఖ పరిధిలోని ఆలయాలు, సత్రాలు బడ్జెట్‌ కేటాయింపులు చేయించుకోవాల్సి ఉంటుంది. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ కేటాయింపులు ప్రస్తుతం నడుస్తున్నాయి. బడ్జెట్‌ కేటాయింపులకు కొందరు ఉన్నతాధికారులు వసూళ్ల దందాకు తెరలేపారు. ఆలయాలు, సత్రాల స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి సుమారు రూ.5 లక్షల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అడిగిన మేరకు డబ్బు ఇవ్వని కార్యనిర్వాహక అధికారుల(ఈవో)ను ఇబ్బందులకు గురిచేస్తూ పలు కారణాలతో ఫైళ్లను తిరస్కరిస్తున్నట్టు పలువురు కార్యనిర్వాహక అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆలయాల స్థాయిని బట్టి అధికారి

దేవదాయశాఖ కమిషనర్‌ పరిధిలో కోటి రూపాయలు, ఆపైన ఆదాయం ఉన్న ఆలయాలు, సత్రాలు ఉంటాయి. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా 300 నుంచి 400 వరకు ఉన్నాయి. రీజనల్‌ జాయుంట్‌ కమిషనర్‌ (ఆర్‌జేసీ) పరిధిలో శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు రూ.కోటిపైన ఆదాయం ఉన్న ఆలయాలు, సత్రాలు ఉంటాయి. ఇలాంటివి 100 వరకు ఆర్‌జేసీ పరిధిలో ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్‌ స్థాయిలో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల మేరకు ఆదాయం వచ్చే ఆలయాలు, సత్రాలు ఉంటాయి. ఇలాంటివి సుమారు 500కు పైగా ఉన్నాయి. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ) పరిధిలో ఏడాదికి రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే ఆలయాలు, సత్రాలు సుమారు వెయ్యి వరకు ఉంటాయి.

బడ్జెట్‌తో కాసుల పంట

ఆయా ఆలయాలు, సత్రాలకు సంబంధిత అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 2024-2025 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను కేటాయించాల్సి ఉంటుంది. బడ్జెట్‌ కేటాయింపులో ఆలయాలు, సత్రాల స్థాయిని బట్టి సంబంధిత అధికారులు రూ. 10 వేలు నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు ఈవోలు ఆరోపిస్తున్నాయి. జీతాలకే డబ్బులు సరిపోని ఆలయాల నుంచి కూడా ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఆర్‌జేసీ లేనందున డీసీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయనపై ఏసీబీ కేసు నడుస్తోంది. కేసు పెండింగ్‌లో ఉన్నందున బడ్జెట్‌ శాంక్షన్స్‌తోపాటు ఆర్థికపరమైన లావాదేవీలు ఏవీ ఆయన జరపకూడదని నిబంధనలు ఉన్నా బడ్జెట్‌ కేటాయింపులు ఆయన చేతుల మీదుగా జరిగిపోతున్నాయి. పైస్థాయి అధికారులు, పలువురు మంత్రుల అండదండలు ఉండటంతో దేవదాయశాఖలో ఆయన చెప్పిందే వేదంగా నడుస్తోందని పలువురు ఉద్యోగులు బహిరరంగంగానే విమర్శిస్తున్నారు. ఆయన తర్వాత స్థాయిలో విధులు నిర్వహించే అధికారిపై కూడా బడ్జెట్‌ దందా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన పరిధిలోని ఆలయాల బడ్జెట్‌ ఆమోదానికి కాసులు లేనిదే సంతకం పెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల పేరిట ఆలయాలు, సత్రాలకు వెళ్లినపుడు పట్టు వస్త్రాలు, రూ.10వేల వేల నగదు సమర్పించుకుంటేనే అన్ని సక్రమంగా ఉన్నట్టు సంతకం చేస్తారని దేవదాయశాఖ సిబ్బంది చెబుతున్నారు. అధికారపార్టీలోని ఓ కీలక నాయకుడు అండతో ఈ అధికారి ఎవ్వరినీ లెక్కచేయరన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క బడ్టెట్‌ ఆమోదం ద్వారానే సుమారు రూ.కోటి వరకు ఈ అధికారి ఆర్జించారన్న ప్రచారం నడుస్తోంది.

Updated Date - Mar 09 , 2024 | 12:58 AM