Share News

ప్రశ్నిస్తే చచ్చేలా కొట్టిస్తారా!

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:19 AM

ప్రశ్నిస్తే వేధింపులు... నిలదీస్తే దాడులు.. ఇదీ వైసీపీ నేతల నిర్వాకం. ఐదేళ్లలో చేసింది చేప్పుకోలేని దుస్థితిలో మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనలేక అసహనంతో దాడులకు తెగబడుతున్నారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన రావును.. మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ ఎందుకు చేశారని ప్రశ్నించిన ఇద్దరిపై వైసీపీ నాయకులు దారుణంగా దాడికి దిగారు.

ప్రశ్నిస్తే చచ్చేలా కొట్టిస్తారా!

నందిగామలో మొండితోక బ్రదర్స్‌ దౌర్జన్యం

మూడు రాజధానుల ర్యాలీపై వైసీపీ ఎమ్మెల్యే నిలదీత

నిలదీసిన ఇద్దరిపై దాడి చేసిన వైసీపీ మూక

తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన బాధితులు

ప్రశ్నిస్తే వేధింపులు... నిలదీస్తే దాడులు.. ఇదీ వైసీపీ నేతల నిర్వాకం. ఐదేళ్లలో చేసింది చేప్పుకోలేని దుస్థితిలో మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనలేక అసహనంతో దాడులకు తెగబడుతున్నారు. నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన రావును.. మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ ఎందుకు చేశారని ప్రశ్నించిన ఇద్దరిపై వైసీపీ నాయకులు దారుణంగా దాడికి దిగారు.

(విజయవాడ/నందిగామ - ఆంధ్రజ్యోతి ) : వైసీపీ రాజకీయ క్రీడకు బలైన అమరావతి రాజధాని భవిష్యత్తుపై గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉంది. నందిగామ నియోజకవర్గంలోని కృష్ణా పరీవాహక గ్రామాల ప్రజలకు అమరావతిలో జరిగే అభివృద్ధి పనులు నేరుగా కనిపించేవి. ఆ అభివృద్ధిని చూస్తూ తమ భవిష్యత్‌ను ఊహించుకొంటూ ప్రజలు మురిసిపోయేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల నాటకానికి తెరదీసి అమరావతిని చిదిమేసింది. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు వచ్చే వైసీపీ అభ్యర్థులను రాజధాని అంశంపై నిలదీస్తున్నారు. అందులో భాగంగా గతంలో మూడు రాజధానులను సమర్థిస్తూ స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఆ పార్టీ నాయకులు పాదయాత్ర చేయడాన్ని మంగళవారం నందిగామకు చెందిన కిషోర్‌బాబు, నరసింహారావు ప్రశ్నించారు. 12వ వార్డులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన్ను ఈ ఇద్దరు నిలదీశారు. అమరావతికి సమీపాన ఉన్న నందిగామ ఎమ్మెల్యేగా మీరు మూడు రాజధానులను సమర్ధించడం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పనిచేశానంటూ ముక్తసరి సమాధానం ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోయారు.

ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా అంటూ దాడి

ఎమ్మెల్యే వెళ్లాక ఆ పార్టీ నాయకులు షేక్‌ ఖాజా మరికొందరు కలిసి కిషోర్‌బాబు, నరసింహరావుతో వాగ్వివాదానికి దిగారు. విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. తీవ్రగాయాల పాలైన కిషోర్‌, నరసింహరావును నందిగామ ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. జరిగిన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల వద్ద నుంచి సీఐ హనీష్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పలు పోరాటాల్లో దాడి బాధితులు

దాడికి గురైన కిషోర్‌బాబు, నరసింహారావులు గతంలో పలు ప్రభుత్వ పథకాల అమలులో జరుగుతున్న అవకతవకలపై పోరాటాలు చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూశారు. చందర్లపాడు మండలంలో వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందకుండా చేశారు. ఆ ఘటనలపై తీవ్రంగా స్పందించి పోరాటాలు చేసి వారికి న్యాయం జరిగేలా చేశారు. దీనిపై వైసీపీ నాయకత్వం కిషోర్‌, నరసింహారావుపై గుర్రుగా ఉంది. మంగళవారం నాటి ఘటనలో పాత విషయాలనూ దృష్టిలో ఉంచుకుని దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దాడికి గురైన ఇద్దరూ జర్నలిస్టులు కావడంతో ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనను ఖండించాయి.

ఆది నుంచీ అంతే...!

మూడు రాజఽధానుల అంశంపై రగిలిపోతున్న నందిగామ ప్రాంత ప్రజలకు వైసీపీ అభ్యర్థులు తప్పక సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా ఇదే అంశం తెరపైకి వస్తుండటంతో ఆదిలోనే దాన్ని అణచివేయాలన్న ఆలోచనతో ఈ దాడి జరిగినట్టు భావిస్తున్నారు. మొండితోక బ్రదర్స్‌ ఆది నుంచీ ఇదే తీరున వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీకి పాల్పడుతూ ఎవరైనా తమను ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండేవారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:19 AM