Share News

క్షేత్రస్థాయి సమస్యలు తెలిపితే పరిష్కారం

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:54 AM

గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు ఆయా గ్రామాల్లో నేతలు చెబితే తప్పకుండా కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, దీనిలో భాగంగానే కూనపరాజుపర్వ-రెడ్డిగూడెం రహదారి ఏర్పాటయ్యిందని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు.

క్షేత్రస్థాయి సమస్యలు తెలిపితే పరిష్కారం

రెడ్డిగూడెం, జనవరి 4 : గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు ఆయా గ్రామాల్లో నేతలు చెబితే తప్పకుండా కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, దీనిలో భాగంగానే కూనపరాజుపర్వ-రెడ్డిగూడెం రహదారి ఏర్పాటయ్యిందని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు. పీఎంజేఎ్‌సవై నిధులు సుమారు రూ.3.5 కోట్లతో నూతనంగా నిర్మించిన రహదారిని ఆయన వైసీపీ ఎమ్మెల్యే వసంతతో కలిసి ప్రారంభించారు. రూ.3 కోట్లతో రహదారిలో నిర్మించనున్న వంతెనలకు ఆయన భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ పెట్టకున్నా కేంద్రం నుంచి పీఎంజేఎ్‌సవై రూ.6.5 కోట్లు నిధులు రప్పించి రహదారి ఏర్పాటుతో పాటు వంతెనలు కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో నీటి అవసరాలు తీర్చేందుకు సుమారు 300 వాటర్‌ ట్యాంక్‌లు ఇచ్చినట్టు తెలిపారు. గ్రామాల మౌలిక వసతులపై తనకు సమాచారం ఇచ్చే నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్‌ (అన్న), కె.విజయబాబు, జానలపాటి వేణుగోపాల్‌ రెడ్డి, కుప్పిరెడ్డి అశోక్‌ రెడ్డి, పైడిమర్ల కిరణ్‌కుమార్‌ రెడ్డి, పాలంకి సురేష్‌ రెడ్డి, వైసీపీ సర్పంచ్‌ మల్లాది రాణి, జడ్పీటీసీ పాలంకి విజయ్‌ భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోటా పోటీ నినాదాలు

కూనపరాజుపర్వ-రెడ్డిగూడెం రహదారి ప్రారంభోత్సవానికి టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని), వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌లు కొత్తరెడ్డిగూడేనికి చేరుకోవడంతో ఆయా పార్టీల కార్యకర్తల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ దశలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ఇరుపార్టీల కార్యకర్తలు నినాదాలతో హోరిస్తుంటే నాయకులు చక్కగా మాట్లాడుకోవడం కొసమెరుపు.

Updated Date - Jan 05 , 2024 | 12:54 AM