Share News

సిమెంట్‌ గోల్‌మాల్‌లో నాకేం తెలియదు..!

ABN , Publish Date - May 30 , 2024 | 01:24 AM

పంచాయతీరాజ్‌ అధికారులు తప్పుచేసి, తనను దోషిని చేస్తున్నారని, సిమెంట్‌ కట్టల గోల్‌మాల్‌ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని నందివాడ మండలం పుట్టగుంట మాజీ సర్పంచ్‌ అబ్బూరి భాస్కరరావు పేర్కొన్నారు.

సిమెంట్‌ గోల్‌మాల్‌లో నాకేం తెలియదు..!

పంచాయతీరాజ్‌ ఏఈ, డీఈ నన్ను ఇరికించారు

పుట్టగుంట మాజీ సర్పంచ్‌ భాస్కరరావు

గుడివాడ, మే 29 : పంచాయతీరాజ్‌ అధికారులు తప్పుచేసి, తనను దోషిని చేస్తున్నారని, సిమెంట్‌ కట్టల గోల్‌మాల్‌ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని నందివాడ మండలం పుట్టగుంట మాజీ సర్పంచ్‌ అబ్బూరి భాస్కరరావు పేర్కొన్నారు. స్థానికంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పుట్టగుంట గ్రామంలో హెల్త్‌ క్లినిక్‌, ఆర్‌బీకే, సచివాలయాల నిర్మాణం చేపట్టడానికి ఎవరు ముందుకు రాలేదన్నారు. నిర్మాణ వ్యయం పెరగడంతో హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణ స్థలంలో బరంతు తోలి ఒక కాంట్రాక్టర్‌ తప్పుకున్నాడన్నారు. స్థలదాత బిట్రా నాగేశ్వరరావు కోరిక మేరకు తాను ఆ పని చేపట్టానన్నారు. ఆరు నెలల తరువాత పనిని ప్రారంభించామని చెప్పారు. అప్పటికే చాలావరకు సిమెంట్‌ కట్టలు గడ్డ కట్టుకుపోయాయన్నారు. తానే స్వయంగా బయటి నుంచి సిమెంట్‌ను కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టానని పేర్కొన్నారు. శ్లాబ్‌ వేశాక బిల్లు రాకపోవడంతో తాను రెండు నెలల పాటు నిర్మాణ పనులను నిలిపివేశానన్నారు. అంచనాలు పెరుగుతున్నాయని, నష్టం రాదని నందివాడ పంచాయతీరాజ్‌ ఏఈ రాధాకృష్ణ భరోసా ఇవ్వడంతో నిర్మాణాన్ని పూర్తి చేశానన్నారు. జిల్లా కలెక్టర్‌ నుంచి తనకు షోకాజ్‌ నోటీసు వస్తుందని బతిమాలితే, ఆర్‌బీకే నిర్మాణ పనులను ప్రారంభించానన్నారు. బోర్లు, పిల్లర్లు వేసే సమయంలో కూడా సిమెంట్‌ ఇవ్వకుండా ఏఈ తనను మోసం చేశాడన్నారు. ఇదే విషయాన్ని నాడు డీఈ హరినాథ్‌బాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. పెదలింగాల నుంచి 200 సిమెంట్‌ కట్టలను తనకు పురమాయించారన్నారు. తాను బయట కూడా కొంత కొనుగోలు చేసి బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు నిర్మాణం పూర్తి చేశానని చెప్పారు. రూ.7.90 లక్షలకు బదులు రూ.5.90 లక్షలే బిల్లు ఇచ్చారని, సిమెంట్‌ కట్టల విషయం తేల్చాలని పలుమార్లు డీఈ, ఏఈని నిలదీసినా ఫలితం లేకుండాపోయిందన్నారు. ఇప్పుడేమో తానేదో సిమెంట్‌ను బొక్కేసినట్టు సృష్టించి అభాసుపాలు చేసేందుకు వారిద్దరూ చూస్తున్నారని భాస్కరరావు ఆరోపించారు. తానే సిమెంట్‌ను పక్కదారి పట్టించి ఉంటే, బయటి నుంచి ఎందుకు కొనుగోలు చేస్తానో అధికారులు సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు. కొనుగోలు బిల్లులన్నీ తన వద్ద ఉన్నాయన్నారు. పుట్టగుంట కాలనీలో రోడ్డు నిర్మాణ విషయంలో ఏఈ రాధాకృష్ణ రూ.1.60 లక్షల ఖర్చుకు కేవలం రూ.30 వేలు చెల్లించారని ఆరోపించారు. మిగిలిన డబ్బు అడిగితే సమాధానమివ్వడం లేదన్నారు. హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణం పూర్తై ప్రారంభోత్సవం జరుపుకొన్నా తనకు తుది బిల్లు రాలేదన్నారు. ఏదో ఒక సాకు చెప్పి బిల్లు చేయకుండా, సిమెంట్‌ కట్టల విషయాన్ని తేల్చకుండా డీఈ, ఏఈ నాటకమాడుతున్నారన్నారు.

Updated Date - May 30 , 2024 | 01:24 AM