నేనే దుర్గగుడి చైర్మన్!
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:06 AM
దుర్గగుడి ధర్మకర్తల మండలికి కాబోయే చైర్మన్‌ను తానేనంటూ ఓ మాజీ రౌడీషీటర్ హల్‌చల్ చేస్తున్నాడు. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఆయన ఇప్పుడు దుర్గగుడి చైర్మన్ పోస్టుపై కన్నేశాడు. ఇంకా ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయకుండానే పదవులను ప్రకటించేసుకున్నాడు.

వన్‌టౌన్, జూన్ 6 : దుర్గగుడి ధర్మకర్తల మండలికి కాబోయే చైర్మన్‌ను తానేనంటూ ఓ మాజీ రౌడీషీటర్ హల్‌చల్ చేస్తున్నాడు. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఆయన ఇప్పుడు దుర్గగుడి చైర్మన్ పోస్టుపై కన్నేశాడు. ఇంకా ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయకుండానే పదవులను ప్రకటించేసుకున్నాడు. సూరత్ పట్టుచీరల ముక్కలు విక్రయంలో పలు కేసుల్లోను, ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దుర్గగుడిలో పలువురు కాంట్రాక్టర్లు, ఉద్యోగులను బెదిరిస్తున్నట్టు చెబుతున్నారు. భవానీపురానికి చెందిన ఈ మాజీ రౌడీ షీటర్ ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీ నుంచి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఎన్నికల్లో తాను పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు కొన్ని రోజులు హడావుడి చేశాడు. తీరా పశ్చిమ నియోజకవర్గం పొత్తులో బీజేపీకి సీటు రావడంతో కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఈ మాజీ రౌడీషీటర్ తానే పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని గెలిపించినట్టు బీరాలు పలుకుతూ ప్రచారం చేస్తున్నాడు. మూడురోజుల నుంచి తాను దుర్గగుడికి కాబోయే చైర్మన్‌నంటూ ప్రచారం చేస్తూ తనకు గిట్టని పలువురు దుర్గగుడిలోని కాంట్రాక్టర్‌లను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను చైర్మన్ అయిన తరువాత ఆ కాంట్రాక్టర్‌లందరిని గుడి నుంచి పంపించేస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నట్టు పలువురు కాంట్రాక్టర్‌లు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తనకు అనుకూలంగా ఉన్న బీజేపీకి చెందిన వ్యక్తిని దుర్గగుడి ధర్మకర్తగా నియమించినట్టు ప్రచారం చేస్తున్నాడు. ఆ వ్యక్తికి దుర్గగుడిలోని లోటుపాట్లు మొత్తం తెలుసునని, అతడి ద్వారా దుర్గగుడిలో ఏ విభాగాలలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో తెలుసుకుని ఆ ఉద్యోగులందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం దేవస్థానంలో చర్చనీయాంశమైంది. ఆ జనసేన పార్టీ నాయకుడు చిట్టినగర్ కేఎల్ రావు నగర్‌లో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో నిందితుడు. ఇతడిపై భవానీపురం, విద్యాధరపురంలో భూ కబ్జా చేసినట్టు కూడా కేసులున్నాయి. రెండు నెలల ముందు పార్టీలోకి వచ్చి తానే పెద్ద నాయకుడినంటూ ప్రచారం చేసుకుంటున్న ఆ మాజీ రౌడీ షీటర్‌పై జనసేనలోనే పలువురు సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అతగాడు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదని జనసేన నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.