Share News

శిరసావహించాల్సిందే..

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:04 AM

హెల్మెట్‌ నిబంధనను పోలీసులు కఠినం చేశారు. ఇప్పటివరకు కొనసాగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక నుంచి నిత్యం వాహనదారులను తనిఖీ చేయాలని నిర్ణయించారు.

శిరసావహించాల్సిందే..
గురువారం విజయవాడలో పోలీసు తనిఖీలు

  • ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పరిధిలో హెల్మెట్‌ధారణ ఇక తప్పనిసరి

  • నిత్యం పోలీసులతో తనిఖీలు

  • మొదటిసారి తప్పునకు జరిమానా

  • పదేపదే ఉల్లంఘిస్తే వాహనం సీజ్‌

  • పరిస్థితి మారకపోతే లైసెన్స్‌ సస్పెన్షన్‌

  • సీపీ రాజశేఖరబాబు ఆదేశాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : హెల్మెట్‌ నిబంధనను పోలీసులు కఠినం చేశారు. ఇప్పటివరకు కొనసాగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక నుంచి నిత్యం వాహనదారులను తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నిరంతరం హెల్మెట్‌ ధారణకు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహించాలని పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌ పోలీసులతో పాటు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులను ఇందుకు ఉపయోగించనున్నారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించిన వాహనదారులకు జరిమానా విధించడమే కాకుండా, పదేపదే ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్‌ చేయాలని నిర్ణయించారు. కొన్ని రోజులుగా చలానాల సంఖ్య పెరుగుతోంది. హైకోర్టు స్పందనకు ముందు రోజుకు 200 నుంచి 300 వరకు కేసులు నమోదు చేసేవారు. కొద్దిరోజులుగా రోజుకు 1,000 దాటి కేసులు నమోదవుతున్నాయి. జరిమానాలు రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. మార్పు రావాలంటే వాహనాలను సీజ్‌ చేయడమే మార్గమని పోలీసులు భావించారు. అయినా మార్పు రాకపోతే లైసెన్సులవైపు చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. మూడు చలానాలకు మించి ఉంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేయించాలని చూస్తున్నారు. ఈ మేరకు రవాణా శాఖాధికారికి లేఖ రాయనున్నారు.

ఒక్కరోజు.. 2,567 కేసులు.. రూ.9.91లక్షల జరిమానా

ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు గురువారం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 2,657 కేసులు నమోదు చేశారు. తద్వారా రూ.9లక్షల91వేల265 చలానాలు విధించారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో హెల్మెట్‌ధారణ, చలానాల విధింపులపై అవగాహన పెంపునకు ఆటోల్లో మైకులతో ప్రచారం చేయిస్తున్నారు.

మూడు నెలల్లోపు చలానా చెల్లించాల్సిందే..

ఒకసారి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించాక దాన్ని మూడు నెలల్లోపు చెల్లించాలి. లేనిపక్షంలో కచ్చితంగా వాహనాన్ని సీజ్‌ చేస్తాం. మేం ఇంతకుముందు జరిమానాలు విధించినా ఇప్పటివరకు చెల్లించని వాహనాలున్నాయి. వాహనాదారులు మాకు ఇంకా సమయం ఉందని సమాధానం చెబుతున్నారు. ఇది సరికాదు. మేం విధించిన చలానాను 90 రోజుల్లో చెల్లించకపోయినా, ఈలోపు కొత్త జరిమానాలు విధించినా కచ్చితంగా వాహనాన్ని సీజ్‌ చేస్తాం. - ఏవీఎల్‌ ప్రసన్నకుమార్‌, ట్రాఫిక్‌ ఏడీసీపీ

Updated Date - Dec 27 , 2024 | 01:04 AM