Share News

నగరంలో నరకం!

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:39 AM

జోగి రమేష్‌ నామినేషన్‌ సందర్భంగా బుధవారం బందరు రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

నగరంలో నరకం!
జోగి రమేశ్‌ నామినేషన్‌ సందర్భంగా బందరు రోడ్డులో పెనమలూరు నుంచి విజయవాడ వైపు రెండు గంటల సేపు భారీగా నిలిచిన వాహనాలు

జోగి రమేశ్‌, అవినాశ్‌ నామినేషన్ల సందర్భంగా ట్రాఫిక్‌ జామ్‌లతో నరకం చూసిన ప్రయాణికులు

పెనమలూరు, ఏప్రిల్‌ 24: జోగి రమేష్‌ నామినేషన్‌ సందర్భంగా బుధవారం బందరు రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రోడ్డుకు ఒక పక్కనే నడవాల్సిన జోగి వాహనాలు రెండు వైపులా రోడ్డును ఆక్రమించడం, డివైడర్లను బారి కేడ్లతో మూసేయడంతో వాహనాలు ఎటూ కదల్లేదు. వందలాది వాహనాలు, అం దులోని ప్రయాణికులు రెండు గంటల పాటు ఎండలోనే ట్రాఫిక్‌లో ఇరుక్కుపో యారు. ఎండ వేడిమికి ట్రాఫిక్‌ జామ్‌ తోడవడంతో బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచ క్రవాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు నరకం చూశారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అల్లాడిపోయారు. నిడమానూరు వైపు నుంచి బందరురోడ్డు పైకి వచ్చే వాహనాలు రాకుండా డివైడర్లు మూసేయడంతో వాహన దారులు నానా అవస్థలు పడ్డారు. పోరంకి సెంటరు నుంచి పది గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని వైసీపీ నాయకులు ముందుగా ప్రకటించి అప్పటికప్పుడు వందడుగుల రోడ్డులోని గ్రౌండుకు మార్చారు. దీంతో ఈ ట్రాఫిక్‌ కష్టాలు మొదలయ్యాయి. నామినేషన్‌ కార్యక్రమానికి స్థానికులు పెద్దగా ఆసక్తి చూపకపోయినప్పటికీ మైలవరం, పెడన నుంచి ప్రజలను తరలించారని బందరు రోడ్డు వెంట చెప్పుకున్నారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

ఆరోగ్యం విషమించిన ఓ పేషెంట్‌ను తీసుకు వెళుతున్న 108 వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపో యింది. అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు తుమ్మలపల్లి హరికృష్ణ మరికొంతమంది స్థానికులు, పోలీసుల సాయంతో ట్రాఫిక్‌ నుంచి ఆ వాహనాన్ని తప్పించి పంపారు.

భారీగా నిలిచిన టిప్పర్లు, లారీలు

కంకిపాడు: గుడివాడ, మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన వాహనాలను ఉదయం 10 గంటల నుంచే కంకిపాడు ఫ్లై ఓవర్‌ వద్ద నిలుపుదల చేశారు. దీంతో భారీగా లారీలు, టిప్పర్ల నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అవినాశ్‌ నామినేషన్‌..అల్లాడిపోయిన ప్రజలు

పటమట: వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాశ్‌ నామినేషన్‌ సందర్భంగా బుధవారం దర్శిపేట ఐదు రోడ్ల జంక్షన్‌ నుంచి డీమార్టు మీదుగా రామలింగేశ్వర్‌నగర్‌ వైపు ఓ రోడ్డు మొత్తం మూసేశారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు నరకం చూశారు. ర్యాలీ మొదలు పెట్టకముందే వైసీపీ శ్రేణులు భారీగా మందుగుండు సామాగ్రి, బాంబులను ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద కాల్చడంతో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి పటమట హైస్కూల్‌ రోడ్డు వరకు ట్రాఫిక్‌ గంటపాటు నిలిచిపోయింది. ఓ పక్క వేడిగాలులు, ఉక్కపోత తట్టుకోలేక గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలబడలేక ద్విచక్ర వాహన దారులు అల్లాడిపోయారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు క్రేన్ల సాయంతో గజమాల వేయడంతో రట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది.

Updated Date - Apr 25 , 2024 | 01:39 AM