Share News

వ్యాపారంలో నష్టాల వల్లే ఆస్తులు అమ్ముకున్నాడు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:56 AM

విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివా్‌స(నాని) తన ట్రావెల్స్‌ వ్యాపారంలో నష్టం రావడం వల్లే ఆస్తులు అమ్ముకున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వ్యాపారంలో నష్టాల వల్లే ఆస్తులు అమ్ముకున్నాడు

విద్యాధరపురం, జనవరి 10 : విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివా్‌స(నాని) తన ట్రావెల్స్‌ వ్యాపారంలో నష్టం రావడం వల్లే ఆస్తులు అమ్ముకున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ నాని తనవ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడటానికే ఆస్తులు అమ్ముకున్నారని తెలిపారు. పదవి కోసం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. నిన్న, మొన్నటి వరకు జగన్‌రెడ్డి దుర్మార్గుడిలా కనిపించిన నానికి ఇప్పుడు సన్మార్గుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు. అమరావతి రైతులను కించపరచడమేమిటని మండిపడ్డారు. జగన్‌రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఎంపీ నాని చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు చేస్తున్నారన్నారు. తామంతా పార్టీ కోసం మౌనంగా అవమానాలు భరిస్తే నాని మాత్రం ప్రొటోకాల్‌ పిచ్చితో ఇష్టానుసారంగా ప్రవర్తించాడన్నారు. లోకేశ్‌ పాదయాత్రతో యువతలో చైతన్యం వచ్చిందని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సభలకు యువత కదలివస్తుంటే ఎంపీ నానికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాల నాయకులు ఎంపీ నోటి దురుసుతనం వల్లే దూరంగా ఉంటున్నారన్నారు. ఎంపీ ఏకపక్షంగా తన కుమార్తెను విజయవాడ మేయర్‌ అభ్యర్థినిగా ప్రకటించుకున్నా, ఆయనకు రెండుసార్లు ఎంపీ సీటు ఇచ్చినా టీడీపీ నాయకులు ఏమీ ఆనలేదన్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీ గెలుపుకోసం అభ్యర్థులు పార్టీ డబ్బు ఖర్చు పెట్టారు తప్ప నాని ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థితో కుమ్మక్కయి, నాని అహంకారంతో మాట్లాడినా చంద్రబాబుపై ఉన్న గౌరవంతో సర్థుకుపోయామన్నారు. దుర్గమ్మ సన్నిధిలో నాని చేసిన వ్యాఖ్యలు ఆయనకే శాపంగా మారాయన్నారు. విజయవాడ, ఉమ్మడి కృష్ణాజిల్లా అభివృద్ధికి చంద్రబాబు వందలకోట్లు కేటాయించారని తెలిపారు. నాని విజయవాడ అభివృద్ధి కోసం జగన్‌రెడ్డితో మాట్లాడి రూపాయి కూడా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

Updated Date - Jan 11 , 2024 | 12:56 AM