మళ్లీ గ్రేటర్
ABN , Publish Date - Aug 10 , 2024 | 12:35 AM
గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. 2017లో సీఎం చంద్రబాబు ఆలోచనల నుంచి రూపుదాల్చిన గ్రేటర్ విజయవాడ ఆ తర్వాత వైసీపీ హయాంలో అటకెక్కింది. తాజాగా టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అధికారులకు దిశానిర్దేశం చేస్తూనే.. త్వరలో ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ముందుంచేందుకు సిద్ధమవుతున్నారు.
వైఎస్సార్ తాడిగడప, కొండపల్లి మున్సిపాలిటీలు విలీనం చేసే యోచన
తొలిదశలో సుమారు 45 గ్రామాలతో కసరత్తు
తుది ప్రతిపాదనలో మరిన్ని గ్రామాలకు చోటు
అధికారులకు ఎంపీ కేశినేని చిన్ని దిశానిర్దేశం
త్వరలో సీఎం చంద్రబాబు వద్దకు..
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం విజయవాడ నగరం విస్తరణకు అవకాశం లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల విలీనంతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ఒక్కటే నగర విస్తరణకు ప్రత్యామ్నాయమని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. నగరం చెంతనే రామవరప్పాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, ఇబ్రహీంపట్నం, కానూరు, పోరంకి వంటి శివారు గ్రామాలున్నాయి. వైసీపీ హయాంలో పంచాయతీల నిధులను దారి మళ్లించి, నిర్వీర్యం చేశారు. ఫలితంగా ఐదేళ్లలో పంచాయతీల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. వీధిదీపాలకు సైతం డబ్బులు లేని పరిస్థితి. ఇక రహదారుల పరిస్థితి ఘోరంగా ఉంది. వైసీపీ హయాంలో కానూరు, తాడిగడప, పోరంకి, యనమలకుదురు పంచాయతీలను విలీనం చేస్తూ వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీని 2020లో ఏర్పాటు చేశారు కానీ, పట్టించుకున్నవారు లేరు. మున్సిపాలిటీ ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి ఛాయలు లేవు. కొండపల్లి మున్సిపాలిటీది అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు గ్రేటర్‌లో భాగమైతే.. పన్నుల భారమని భయపడిన శివారు గ్రామాల ప్రజలే.. నేడు పన్నుల భారమైనా కనీస మౌలిక సౌకర్యాలు సమకూరతాయన్న ఆశతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నారు. దీంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గ్రేటర్ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ముందుంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితం
గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన తొలిసారి 2011లో ఊపిరి పోసుకుంది. అప్పట్లో 40 గ్రామాలను కలిపేలా ప్రతిపాదనను అధికారులు తీసుకొచ్చారు. కానీ, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని వ్యతిరేకించడంతో అటకెక్కింది. ఆ తర్వాత 2017 డిసెంబరులో అప్పటి సీఎం చంద్రబాబు గ్రేటర్ ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చారు. అప్పట్లో ఆయన రామవరప్పాడు, ప్రసాదంపాడుల్లో పర్యటించారు. అక్కడి అధ్వాన పారిశుధ్య పరిస్థితులపై వీఎంసీ అధికారులను ప్రశ్నించగా, అవి పంచాయతీలుగా ఉన్నాయని సమాధానమిచ్చారు. దీంతో విజయవాడలో భాగంగా ఉండీ అభివృద్ధికి నోచుకోని అలాంటి గ్రామాలను విలీనం చేస్తూ గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అప్పుడు విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న జె.నివాస్ సమగ్ర అధ్యయనం చేసి గ్రేటర్ విజయవాడ డీపీఆర్‌ను సిద్ధం చేశారు. చంద్రబాబు సూచనలకు అనుగుణంగా 59 గ్రామాలను కలుపుతూ ఈ డీపీఆర్ సిద్ధమైంది. గ్రేటర్ విజయవాడలో 8 జోన్లను ఏర్పాటుచేసేలా కూడా ప్రతిపాదనలు చేశారు. అయితే, అప్పట్లో ఆయా గ్రామాల నుంచి వ్యతిరేకత రావడం, ఎన్నికల సంవత్సరం కావడంతో టీడీపీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన పునరాలోచనలో పడింది. తొలుత 56 గ్రామాలను కలుపుతూ గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయాలనుకున్న అధికారులు వైసీపీ హయాంలో 29 గ్రామాలకు కుదించారు. చివరికి అది కూడా కార్యరూపం దాల్చకుండానే మరుగునపడింది.
గ్రేటర్‌తో అభివృద్ధి పరుగులు
ఒకప్పుడు పన్నులు పెరుగుతాయనే భయంతో విజయవాడ చుట్టుపక్కల గ్రామాలు గ్రేటర్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ప్రస్తుతం అధ్వాన పారిశుధ్యం, గోతులతో కూడిన రహదారులు, వెలగని వీధిదీపాలతో విసుగెత్తిపోయిన శివారు గ్రామాల ప్రజలు గ్రేటర్‌కు జై కొడుతున్నారు. 2020లో ఏర్పడిన తాడిగడప మున్సిపాలిటీలో విజయవాడ నగరంతో పోటీగా పన్నులు ఉన్నాయి. కానీ, ఆ స్థాయిలో మౌలిక వసతుల కల్పన జరగడం లేదు. కొండపల్లి మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి. మరోవైపు ఆయా ప్రాంతాల్లో జనసాంద్రత విపరీతంగా పెరిగిపోయింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మౌలిక సౌకర్యాల కల్పన మాత్రం ఉండటం లేదు. ఇవన్నీ ప్రజలను గ్రేటర్‌కు మొగ్గుచూపేలా చేస్తున్నాయి.
ఇదీ ప్రాథమికంగా గ్రేటర్ ముఖచిత్రం
తాజాగా గ్రేటర్ విజయవాడలో ఏయే గ్రామాలను విలీనం చేయాలనే అంశంపై అధికారులు ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. సుమారు 45 గ్రామాలతో గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీలోని కానూరు, తాడిగడప, పోరంకి, యనమలకుదురు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గంగూరు, గోశాల, ఈడ్పుగల్లు, పునాదిపాడు, కంకిపాడు, వేల్పూరు, ఉప్పులూరు, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, ఆత్కూరు, గూడవల్లి, కేసరపల్లి, వెంకటనరసింహాపురం, అజ్జంపూడి, బుద్ధవరం, గన్నవరం, వెదురుపావులూరు, సవారిగూడెం, జక్కులనెక్కలం, రామచంద్రపురం, పురుషోత్తపట్నం, బీబీగూడెం, చినఅవుటపల్లి, అల్లాపురం, నున్న, పాతపాడు, పి.నైనవరం, అంబాపురం, జక్కంపూడి, గొల్లపూడి, తుమ్మలపాలెం, గుంటుపల్లి, రాయనపాడు, మల్కాపురం, గూడూరుపాడు ఇతర గ్రామాలను విలీనం చేస్తూ సుమారు 343 చదరపు కిలోమీటర్లతో గ్రేటర్ ప్రతిపాదన సిద్ధం చేయాలని భావిస్తున్నారు. తుదిదశలో మరిన్ని గ్రామాలు కూడా కలిసే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.