Share News

ఊరూరా..!

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:59 AM

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో దిక్కులేకుండా, ప్రాధాన్యత లేకుండా పడి ఉన్న పంచాయతీలు మళ్లీ కళకళలాడుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ గ్రామం వికసిస్తోంది. జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన గ్రామ సభలతో పండుగ వాతావరణం ఏర్పడింది.

ఊరూరా..!
ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామసభలో పాల్గొన్న గ్రామస్తులు

289 గ్రామాల్లో నిర్వహణ, 80 వేల మందికి పైగా హాజరు

రూ.126 కోట్లతో ఉపాధి హామీ పనులకు ఆమోదం

సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్లకు పెద్దపీట

పశువుల షెడ్లు, నీటి కుంటలకూ కేటాయింపులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో దిక్కులేకుండా, ప్రాధాన్యత లేకుండా పడి ఉన్న పంచాయతీలు మళ్లీ కళకళలాడుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ గ్రామం వికసిస్తోంది. జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన గ్రామ సభలతో పండుగ వాతావరణం ఏర్పడింది. మొత్తం 289 గ్రామాల్లో సభలు జరగ్గా, గ్రామస్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా మొత్తం రూ.126 కోట్లతో చేపట్టాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏకగ్రీవ తీర్మానాలతో తమ ఊర్లో చేసుకోవాల్సిన పనులను నిర్దేశించుకున్నారు. ఈ తీర్మానాలను డ్వామా అధికారులు స్వీకరించారు. కాగా, ఈ సభలకు ఒకరోజు ముందే ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం, అంతకుముందు పంచాయతీలకు బడ్జెట్‌ను పెంచడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు పరిణామాల తర్వాత మూడో ముఖ్యమైన అంశంగా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే గ్రామాభివృద్ధి పనులకు కార్యాచరణ రూపొందించారు. జిల్లావ్యాప్తంగా జరిగిన గ్రామసభల్లో నియోజకవర్గాల ప్రాతిపదికన కలెక్టర్‌ సృజన పాల్గొన్నారు. డ్వామా పీడీ సునీత సమీక్షించారు.

రూ.126 కోట్లతో అభివృద్ధి పనులు

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా రూ.126 కోట్లతో చేపట్టే పనులకు సంబంధించి గ్రామసభలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్లు.. ఆ తర్వాత ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. పశువుల షెడ్లకు పెద్దపీట వేశారు. సీసీ రోడ్డు, డ్రెయిన్లకు రూ.80 కోట్లు, పశువుల షెడ్లకు రూ.16.80 కోట్లు.. ఇతరత్రా పనులు ఈ జాబితాలో ఉన్నాయి.

Updated Date - Aug 24 , 2024 | 12:59 AM