Share News

సర్కారు బడి.. కన్నుపడి..

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:47 AM

మహనీయుల ఉన్నతాశయానికి ఆనవాలుగా 80 ఏళ్ల కిందట ఏర్పడిన ఓ విద్యా నిలయం.. విద్యార్థులు, ఉపాధ్యాయులతో నిత్యం కళకళలాడే దేవాలయం.. 15 సెంట్లు.. సుమారు రూ.5 కోట్ల విలువైన ఈ పాఠశాలపై స్థానిక వైసీపీ నాయకుల కన్నుపడింది. నూతన విద్యావిధానం పేరిట వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూతబడిన ఈ పాఠశాలను కాజేయాలనే కుట్రకు తెరలేపారు. కల్యాణ మండపం పేరుచెప్పి కొట్టేయాలని చూస్తున్నారు. స్థానికులు అడ్డుపడుతుండటంతో వైసీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ వద్ద పంచాయితీ పెట్టారు. విషయం బయటకు పొక్కడంతో ప్రస్తుతం వ్యవహారం స్తబ్దుగా సాగుతోంది.

సర్కారు బడి.. కన్నుపడి..
ఏడో డివిజన్‌లోని స్కూల్‌ ఇదే..

15 సెంట్లు.. రూ.5 కోట్ల విలువైన బడిని కాజేయాలనే కుట్ర

స్కూల్‌ను పునఃప్రారంభించాలని కోరుతున్న స్థానికులు

కుదరదంటూ కల్యాణ మండపం ప్రతిపాదన

కమిటీగా ఏర్పడిన వైసీపీ డివిజన్‌ నాయకులు

ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట పన్ను, విద్యుత్‌ మీటర్‌ మార్పునకు దరఖాస్తు

వైసీపీ నేత దేవినేని అవినాష్‌ వద్ద పంచాయితీ

మొగల్రాజపురం : స్థానిక ఏడో డివిజన్‌లో కమిలిబాబా ఆశ్ర మం ఎదురుగా దాదాపు 80 ఏళ్ల కిందట పాఠశాల ఏర్పాటైంది. ఆ తరువాత అది ఎయిడెడ్‌ పాఠశాలగా రూపాంతరం చెందింది. మొదట్లో పూడి గుడిసెలో నడిచిన ఈ పాఠశాల స్థానంలో 1995లో సీఎస్‌ఐ కృష్ణా-గోదావరి డయాసిస్‌ సీఎస్‌ఐ పాఠశాలల మేనేజర్‌ రెవరెండ్‌ టి.పరమానందం కొత్త పాఠశాల భవనం కోసం శంకుస్థాపన చేశారు. అప్పుడు భవన నిర్మాణ కమిటీ కన్వీనర్‌గా కార్పొరేటర్‌ జల్లి విల్సన్‌, ఆర్గనైజర్‌గా పరస రాజరత్నాన్ని నియమించారు. 1999లో అప్పటి శాసన సభ్యురాలు చెన్నుపాటి రత్నకుమారి తన నిధుల నుంచి రూ.75 వేలు, ఎంపీగా ఉన్న వడ్డే శోభనాద్రీశ్వరరావు తన నిధుల నుంచి రూ.50 వేలు విరాళంగా ఇచ్చారు. స్థానికులు, రైతుల విరాళాలు రూ.9 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించి 1999, జూలై 11న ప్రారంభించారు.

వైసీపీ వచ్చాక..

వైసీపీ ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల కిందట ఈ పాఠశాలను మూసివేశారు. నూతన విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చిన వైసీపీ పలు ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేసింది. ఆ జాబితాలో ఈ పాఠశాల కూడా చేరింది. ఇక్కడి విద్యార్థులను జమ్మిచెట్టు వద్ద ఉన్న బీఎస్‌ఆర్‌కే పాఠశాలకు పంపేశారు. దీంతో ఈ పాఠశాల మూతపడింది. ప్రస్తుతం పాఠశాల భవనం.. ఒకప్పటి భవన నిర్మాణ కమిటీ ఆర్గనైజర్‌గా ఉన్న పరసా రాజారత్నం కుమారుడు సుమన్‌ పర్యవేక్షణలో ఉంది.

కొట్టేయాలనే కుట్ర

ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ పాఠశాల భవనంపై స్థానిక వైసీపీ నాయకుల కన్నుపడింది. దీనిని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే కుట్రతో ఈ స్కూల్లో టెంట్‌ సామాన్లు, క్యాటరింగ్‌, కల్యాణ మండపం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇందుకోసం స్థానిక కార్పొరేటర్‌ వద్ద రెండు వారాల కిందట ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక పెద్దలు, స్థానికులు సుమారు 150 మందికిపైగా హాజరయ్యారు. వీరిలో 90 శాతం మంది అక్కడ పాఠశాల తిరిగి ప్రారంభించాలని గట్టిగా చెప్పారు. 1 నుంచి 5వ తరగతి వరకూ చదువుకునే విద్యార్థులు.. దూరంగా జమ్మిచెట్టు వద్ద ఉన్న పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందన్న సమస్యను చెప్పారు. అక్కడ కూడా సీట్లు అయిపోవడంతో మరింత దూరంగా, ఆరో డివిజన్‌లో ఉన్న పాఠశాలకు కొందరు విద్యార్థులు వెళ్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి స్థానిక పిల్లలకు చేరువగా ఉన్న పాఠశాలను పునఃప్రారంభించాలని కోరారు. అయినా.. స్థానిక వైసీపీ నేతలు అంగీకరించలేదు. ఐదుగురితో ఓ కమిటీ ఏర్పాటుచేసి ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట పన్ను, కరెంట్‌ మీటర్‌ మార్చడానికి దరఖాస్తు చేసేశారు. కానీ, కుదరలేదు. దీంతో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ సహాయం కోరారు. ఈ విషయం తెలిసి స్థానికులు కూడా అవినాష్‌ను ఆశ్రయించడంతో ఈ విషయంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది.

Updated Date - Apr 06 , 2024 | 12:47 AM