Share News

ముం‘చెత్త’గా..

ABN , Publish Date - May 31 , 2024 | 12:50 AM

ఓవైపు కలుషిత నీరు ప్రబలి డయేరియా లక్షణాలు నగరాన్ని భయపెడుతుంటే.. మరోవైపు రోజురోజుకూ పేరుకుపోతున్న చెత్త ఎక్కడికక్కడ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నైరుతి ఆగమనంతో కొద్దిరోజుల్లో వర్షాలు పడే సూచనలు కనిపిస్తుండటంతో రోడ్లపై నిల్వ ఉండిన చెత్తతో మరిన్ని రోగాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి.

ముం‘చెత్త’గా..
కరెన్సీనగర్‌లో చెత్తతో నిండిపోయిన సైడ్‌ డ్రెయిన్‌

నగరంలో భయాందోళనలు

రోడ్ల వెంబడి పేరుకుపోతున్న చెత్త

ప్రధాన రోడ్లు.. జాతీయ రహదారులపై కూడా..

పట్టించుకోని అధికార యంత్రాంగం

ప్రజారోగ్యానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి

రెండు జిల్లాల్లోనూ ఇదే దుస్థితి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నైరుతి రాకతో కొద్దిరోజుల్లో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే నగరంలో మంచినీరు కలుషితమై నాలుగు మరణాలు సంభవించాయి. ఈ సమయంలో రోడ్ల వెంబడి నిల్వ ఉంచిన చెత్త మరింత భయాందోళన కలిగిస్తోంది. ఇది ఒక్క విజయవాడ నగరంలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ అలాగే ఉంది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ, డొంక రోడ్లతో పాటు ఆఖరుకు జాతీయ రహదారుల వెంట కూడా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. చివరికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో కూడా చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇక్కడి కోనాయి చెరువు మంచినీటి రిజర్వాయర్‌ వద్ద పరిస్థితి దయనీయంగా మారింది.

గ్రీన్‌ అంబాసిడర్లు ఎక్కడ..?

గ్రామాల్లో చెత్త సమస్య పరిష్కారానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం చెత్తే సేకరణకు సంబంధించిన అనేక వాహనాలు, చెత్త తొలగింపు యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రీన్‌ అంబాసిడర్లను నియమించి వారి ద్వారా ‘చెత్తశుద్ధి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైసీపీ అధికారంలోకి రాగానే గ్రీన్‌ అంబాసిడర్లను తొలగించింది. తమకు అనుకూలమైన వారినే నియమించింది. అయితే, వీరికి స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ నుంచి జీతాలు సక్రమంగా రాకపోవటంతో పని చేయటానికి ఆసక్తి చూపట్లేదు.

డంపింగ్‌ యార్డుల ప్రణాళికలు ఏవి ?

రెండు జిల్లాల్లోని 90 శాతం మేజర్‌ పంచాయతీల్లో చెత్తను డంప్‌ చేయడానికి సరైన యార్డులు లేవు. స్థానిక చెరువు స్థలాలు, క్వారీ పిట్లు, కొండప్రాంతాల్లోని గోతులు కేటాయిస్తే.. నూటికి 80 శాతం చెత్త డంపింగ్‌ సమస్యలు తీరిపోతాయి. ఇలాంటి అంశాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించటం లేదు. ఇప్పటి నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు, డయేరియా ప్రబలే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - May 31 , 2024 | 12:50 AM