Share News

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన జి.సృజన

ABN , Publish Date - Jun 27 , 2024 | 01:16 AM

‘ప్రతిష్ఠాత్మకమైన ఎన్టీఆర్‌ జిల్లాకు తిరిగి రావడం ఆనందంగా ఉంది. సబ్‌ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం నాకిక్కడ ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాను అన్ని రంగాల్లో అగ్ర పథాన నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా’ అని ఎన్టీఆర్‌ జిల్లా నూతన కలెక్టర్‌ జి.సృజన అన్నారు. బుధవారం కలెక్టర్‌గా తన ఛాంబర్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. సృజనకు దుర్గగుడి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన జి.సృజన

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

2015-16 సంవత్సరంలో విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా పనిచేసిన విషయాన్ని నూతన కలెక్టర్‌ సృజన గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇక్కడే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాను అందరి సహకారంతో నిర్దేశించుకున్న ప్రణాళికలు, లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు అడుగులు వేయటం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలను సాధిస్తామన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు వీటి బారిన పడకుండా ఉండటానికి చర్యలు తీసుకోవటం తక్షణ కర్తవ్యమన్నారు. డయేరియా, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా పనిచేస్తామన్నారు. తాగునీటి పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తామని, రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించే చర్యలను చేపట్టనున్నట్టు చెప్పారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎన్టీఆర్‌ జిల్లా జేసీ పి.సంపత్‌ కుమార్‌, విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినరర్‌, డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీవో భవానీ శంకర్‌లు నూతన కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఫ కలెక్టరేట్‌ సెక్షన్‌ పరిశీలన..

కలెక్టరేట్‌ సెక్షన్‌ను నూతన కలెక్టర్‌ సృజన పరిశీలించారు. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలన్నింటినీ పరిశీలించారు. అడ్మినిస్రేటషన్‌, ల్యాండ్‌ కో-ఆర్డినేషన్‌, మెజిస్టీరియల్‌, లీగల్‌ సెల్‌, ఎన్నికల విభాగం తదితర సెక్షన్ల కార్యకలాపాలను పరిశీలించారు. కలెక్టరేట్‌లోని పలు విభాగాల శాఖాధికారులతో ఆమె మాట్లాడారు. జిల్లాస్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఫ జిల్లా యంత్రాంగం అభినందనలు

నూతన కలెక్టర్‌ను జిల్లా అధికార యంత్రాంగం కలిసి అభినందించటం జరిగింది. జిల్లా పౌరసరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ జె.సునీత, ఐసీడీఎస్‌ పీడీ జి.ఉమాదేవి, డీఐపీఆర్వో యు.సురేంద్రనాద్‌, డీపీఆర్వో ఎస్‌వీ మోహనరావు, అడిషనల్‌ పీఆర్వో కె.రవి, ఏవీ సూపర్‌వైజర్‌ వీవీ ప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీసీఓ ఎస్‌.శ్రీనివాసరెడ్డి, యువజన సంక్షేమ అధికారి యు.శ్రీనివాసరావు, ఉద్యానశాఖ అఽధికారి పి.బాలాజీ, హౌసింగ్‌ పీడీ రజనీకుమారి, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, అరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త జె.సుమన్‌, వీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ కేవీ సత్యవతి, కలెక్టరేట్‌ ఏవో సీహెచ్‌ నాగలక్ష్మి, ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ ఎం.దుర్గాప్రసాద్‌, దుర్గగుడి ఈవో కేఎస్‌ రామారావులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

ఫ కలెక్టర్‌ను కలిసిన బొప్పరాజు

నూతన కలెక్టర్‌ సృజనను ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు అభినందనలు తెలిపారు. రాష్ర్టాభివృద్ధిలో ఎన్టీఆర్‌ జిల్లా కీలక భాగస్వామ్యం వహిస్తుందని, ఈ జిల్లా ఉద్యోగులు యంత్రాంగానికి చక్కటి సహకారం అందిస్తారని కలెక్టర్‌కు బొప్పరాజు చెప్పారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రాష్ట్ర నాయకులు రామిశెట్టి వెంకట రాజేష్‌, పి.జాహ్నవి, జిల్లా నాయకులు ఎస్వీ రవీంద్రనాద్‌, ఎన్‌.అను్‌షకుమార్‌, కలెక్టరేట్‌ యూనిట్‌ నాయకులు కె.నాగభూషణం, ఎ.రాజేష్‌, వీరేష్‌, విజయవాడ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌ అప్పారావు, యలమంచిలి రవి, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు సంసాని శ్రీనివాస్‌, వి.అరలయ్య, టి.బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.

సమష్టి కృషితో

మాదకద్రవ్యాలకు చెక్‌..

కృష్ణలంక : సమన్వయం, సమష్టి కృషితో మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కృషి చేయాలని, మత్తు పదార్థాల వినియోగం, దుష్పరిణామాలపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ సృజన సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా యువజన సర్వీసులశాఖ అధ్వర్యంలో ఫోరం ఫర్‌ చైల్డ్‌రైట్స్‌, సంయుక్త ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ సృజన, జేసీ పి.సంపత్‌కుమార్‌, వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తదితరులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా వుండాలని, బంగారు భవిష్యత్తు దిశగా అడుగులేయాలని తెలిపారు. జిల్లా యువజన సర్వీసులశాఖ అధ్వర్యంలో నగరంలోని నలంద కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రరిణామాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మాచవరం స్టేషన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ శంకరరావు, నలంద కళాశాల ప్రిన్సిపాల్‌ అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 01:16 AM