Share News

ఆవేశం.. సమావేశం..!

ABN , Publish Date - Apr 07 , 2024 | 01:13 AM

అధికార పార్టీ అనే అహం.. అధికారం చేతిలో ఉందనే టెంపరితనం.. వైసీపీ పరువుతీసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. తమనెవరూ అడ్డుకోలేరన్న ఆలోచనతో తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా శనివారం ఏర్పాటుచేసిన బ్రాహ్మణ సామాజికవర్గ ఆత్మీయ సమావేశాన్ని మోడల్‌ కోడ్‌ అధికారులు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. సమావేశానికి హాజరై ఓట్లు రాబట్టే ప్రయత్నం చేయాలన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కోన రఘుపతిని గేటు వద్దే అడ్డుకుని వెనక్కి పంపేశారు. అనుమతి లేని సమావేశానికి ఆహ్వానం ఎందుకని రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన బ్రాహ్మణులు భోజనం చేసి వెనుదిరిగారు.

ఆవేశం.. సమావేశం..!

అనుమతులు లేకుండా వైసీపీ బ్రాహ్మణ సమావేశం

ఎన్నికల కోడ్‌ ఉండటంతో పోలీసుల అడ్డు

బ్రాహ్మణ ఓట్లను రాబట్టే అధికార పార్టీ కుట్ర భగ్నం

అనుమతులు లేకుండా కుదరదన్న పోలీసులు

తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉద్రిక్తత

మల్లాది విష్ణు, కోన రఘుపతి అడ్డగింపు

నిర్వాహకుల తీరుపై బ్రాహ్మణుల ఆగ్రహం

అనుమతి లేకుండా ఎందుకు పిలిచారని ఫైర్‌

మధ్యాహ్న భోజనాల అనంతరం జంప్‌

అధికార పార్టీ అనే అహం.. అధికారం చేతిలో ఉందనే టెంపరితనం.. వైసీపీ పరువుతీసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. తమనెవరూ అడ్డుకోలేరన్న ఆలోచనతో తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా శనివారం ఏర్పాటుచేసిన బ్రాహ్మణ సామాజికవర్గ ఆత్మీయ సమావేశాన్ని మోడల్‌ కోడ్‌ అధికారులు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. సమావేశానికి హాజరై ఓట్లు రాబట్టే ప్రయత్నం చేయాలన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కోన రఘుపతిని గేటు వద్దే అడ్డుకుని వెనక్కి పంపేశారు. అనుమతి లేని సమావేశానికి ఆహ్వానం ఎందుకని రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన బ్రాహ్మణులు భోజనం చేసి వెనుదిరిగారు.

(విజయవాడ-ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్‌) : ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ పెద్దలు 15 రోజులుగా తెగ కసరత్తు చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దేవదాయ శాఖ సలహాదారు జె.శ్రీకాంత్‌, కౌతా చారిటబుల్‌ ట్రస్టుకు చెందిన కౌతా సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అనుమతి తీసుకుని బ్రాహ్మణ సామాజికవర్గ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అన్ని జిల్లాల్లో అధికార పార్టీ మద్దతుదారులుగా ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గాల వారిని ఆహ్వానించారు. ఫోన్ల ద్వారా, మెసేజ్‌ల ద్వారా కార్యక్రమానికి తప్పకుండా రావాలని, పలు కీలక నిర్ణయాలు ఉంటాయని, ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓటింగ్‌ ముఖ్యమని చెబుతూ ఊదరగొట్టారు.

పోలీసుల అడ్డు.. వెనుదిరిగిన మల్లాది, కోన తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శనివారం ఉదయం సమావేశానికి రంగం సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి బ్రాహ్మణ సామాజికవర్గ నాయకులు, కార్యకర్తలు, ఆహ్వానితులందరూ నగరానికి వచ్చారు. ముఖ్య అతిథులుగా విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, బాపట్ల సిటింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సిటింగ్‌ ఎంపీ కేశినేని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులను ఆహ్వానించారు. తొలుత శనివారం ఉదయమే మల్లాది విష్ణు, కోన రఘుపతి కళాక్షేత్రానికి వచ్చారు. అయితే, అప్పటికే అక్కడ మోహరించి ఉన్న మోడల్‌ కోడ్‌ అధికారులు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ హెడ్‌ ప్రమణ్‌కుమార్‌, సిబ్బంది, గవర్నరుపేట పోలీస్‌ స్టేషన్‌ సీఐ డీవీ రమణ, ఆయన సిబ్బంది వారిద్దరినీ నిలువరించారు. అధికార పార్టీ వారు కావడంతో విష్ణు, రఘుపతి కొంచెం దూకుడుగా వ్యవహరించి వేదికపైకి వెళ్తామని, వచ్చిన వారికి సందేశమిస్తామన్నారు. కానీ, ఇటు పోలీసులు, మోడల్‌ కోడ్‌ అధికారులు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ససేమిరా అన్నారు.

సమావేశానికి ఎటువంటి అనుమతులు లేవని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎటువంటి పరిస్థితుల్లోనూ సమావేశానికి అనుమతించే వీల్లేదని చెప్పారు. కాదని వెళ్తే ఫొటోలు తీసుకుని తాము చేయాల్సింది చేస్తామని హెచ్చరించారు. దీంతో నాయకులు కాసేపటి తర్వాత వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోపక్క వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేశారు.

అందరినీ వెళ్లిపోవాలని అధికారులు సూచించడంతో నిర్వాహకులు.. పెద్దఎత్తున భోజనాలు ఏర్పాటు చేసుకున్నామని, వృథా అయిపోతాయని, అనవసరంగా రోడ్డు మీద పడేయాల్సి వస్తుందని కోరడంతో అధికారులు అనుమతినిచ్చారు. భోజనాల వరకు త్వరగా ముగించి వెళ్లిపోవాలని ఆదేశించారు. భోజనాలు చేసిన అనంతరం మొత్తం కళాక్షేత్రాన్ని ఖాళీ చేయించేంత వరకు పోలీసులు, అధికారులు అక్కడే ఉండి సౌత్‌ ఏసీపీ రత్నంరాజు ఆఽధ్వర్యంలో హాలుకు తాళాలు వేసి వెనుదిరిగారు. సమావేశానికి వచ్చినవారు నిర్వాహకుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పదిరోజుల నుంచి మెసేజ్‌లు, ఫోన్లు చేసి సమావేశం ఉంటుందని పిలుస్తున్నవారు ముందుగా తగిన అనుమతులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

Updated Date - Apr 07 , 2024 | 01:13 AM