బాలికపై అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:47 AM
బాలిక(13)పై అత్యాచారానికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
పోక్సో కేసు నమోదు: డీఎస్పీ అబ్దుల్ సుభాన్
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): నగరంలో బాలిక(13)పై అత్యాచారానికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఆదివారం ఇనకుదురు పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ అబ్దుల్ సుభాన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ‘రోడ్డుపై ఉన్న బాలికను చంపేస్తామని బెదిరించి కాసానిగూడెం పావురాలగూడు సెంటర్ నుంచి మహమ్మద్ సలేహా(21), సాదం బాలశంకరసాయి(19) బలవంతంగా నోరుమూసి బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకుని పంపులచెరువు వెనుక వాటర్ హౌస్ వద్ద ఖాళీ ప్రదేశానికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వారి స్నేహితు లు రామాని అశోక్(19), వేముల వెంకట పవన్(20)తో కలిసి నలుగురూ ఆ బాలికను చేతులతో చెంపలపై కొడుతూ శరీరంపై తాకకూడని ప్రదేశాల్లో తాకారు. ఒకరి తరువాత ఒకరు ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారు. దీంతో బాలిక కేకలు పెడుతూ పారిపోయింది. ఇంటికి వచ్చి తల్లికి చెప్పగా, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.’ అని డీఎస్పీ తెలిపారు. దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసి, గ్యాంగ్‌రేప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పంపామన్నారు. కాలేఖాన్‌పేట చెక్‌పోస్టు వద్ద నిందితులను అరెస్టు చేశామన్నారు.
బాలిక సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే: మంత్రి రవీంద్ర
బాలిక సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తల్లిదండ్రులకు మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆదివారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆశాలతతో మాట్లాడారు.