Share News

రాష్ట్ర ప్రయోజనాల కోసమే..

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:54 AM

నాడు బీజేపీతో విభేదించినా, నేడు పొత్తుకు స్వాగతించినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, జగన్‌ అనే మహామ్మారి, విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం చంద్రబాబు, పవన్‌లు ఆలోచించి తీసుకున్న నిర్ణయమని మాజీ మంత్రి, విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే..
జయహో బీసీ సభలో నేతల సంఘీభావం

జగన్‌రెడ్డి విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే : నెట్టెం

జగ్గయ్యపేట, మార్చి 10 : నాడు బీజేపీతో విభేదించినా, నేడు పొత్తుకు స్వాగతించినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, జగన్‌ అనే మహామ్మారి, విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం చంద్రబాబు, పవన్‌లు ఆలోచించి తీసుకున్న నిర్ణయమని మాజీ మంత్రి, విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. జగ్గయ్యపేటలో ఆదివారం జరిగిన బీసీల పిలుపు-తాతయ్య గెలుపు, జయహో బీసీ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని బీజేపీతో పొత్తు విషయమై మాట్లాడారు. నాడు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత కల్పించాలనే విషయంలో బీజేపీతో విబేధించి పోరాటం చేయాల్సి వచ్చిందని.. నేడు జగనాసురుడి బారినుంచి రాష్ర్టాన్ని కాపాడేందుకు, ఆరాచ క, విధ్వంస పాలన నుంచి విముక్తి కల్పించేందుకు చంద్రబాబు, పవన్‌లు ఎంతో ఆలోచించి బీజేపీతో పొత్తుకు పెట్టుకున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో విజయం తధ్యమని, జూన్‌లో చంద్రబాబు సీఎం కాగానే వంద రోజుల్లోనే భవిష్యత్‌ గ్యారంటితో పాటు ఇచ్చిన అన్ని హామీలకు కార్యాచరణ ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు పొత్తును స్వాగతిస్తారని, పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేద్దామని చెప్పారు. జాతీయ తెలుగుదేశం కోశాధికారి, నియోజకవర్గ జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ, నియోజకవర్గంలో బీసీలకు నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

కేంద్ర నిధులతో అభివృద్ధి : కొనకళ్ల

మచిలీపట్నం టౌన్‌ : రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందని మాజీ ఎంపీ, కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొత్తు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసమే అని, మూడు పార్టీల కలయికతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. సజ్జల, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, మంత్రి రోజా లాంటివారు సంధి ప్రేలాపనలు పేలుతున్నారన్నారు. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో నెట్టబడిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కేంద్రంలో నరేంద్ర మోదీ సహాయ సహకారాలు అవసరమన్నారు. జగన్‌రెడ్డి కేసుల భయంతో రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించలేక పోయారన్నారు. బీజేపీ నేతలను ఎదుర్కొనే దమ్ము జగన్‌రెడ్డికి లేదన్నారు. ఐదేళ్లలో విభజన హామీలు, రాష్ట్రానికి నిధుల గురించి ఏనాడూ మాట్లాడలేదన్నారు. ఓటు ఆయుధంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టాలన్నారు. కార్యక్రమంలో కొనకళ్లబుల్లయ్య, మోటమర్రి బాబా ప్రసాద్‌, పీవీ ఫణికుమార్‌, యార్లగడ్డ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:54 AM