Share News

కాల్వలు సరిచేయండి

ABN , Publish Date - May 19 , 2024 | 12:54 AM

సాగునీటి కాల్వలు.. డ్రెయిన్లలో నిర్వహణ పనులే ప్రధాన అంశంగా శనివారం మచిలీపట్నంలోని జెడ్పీ హాల్లో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. జూన్‌ మొదట్లోనే ఖరీఫ్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాల్వలు, డ్రెయిన్లలో తూడు తొలగించేందుకు, ఇతర పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సభ్యులు ప్రధాన సమస్యగా లేవనెత్తగా, కాల్వల నిర్వహణ పనులు చేపట్టేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరతానని చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులెవరూ హాజరుకాలేదు.

కాల్వలు సరిచేయండి

జెడ్పీ సమావేశంలో ప్రధాన అంశంగా చర్చ

సాగునీటి కాల్వలు, డ్రెయిన్ల పనులు చేపట్టాలని సభ్యుల విజ్ఞప్తి

రోగులను పట్టించుకోని వైద్యులను మార్చాలని వేడుకోలు

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండని విన్నపం

ఎన్నికల కోడ్‌ కారణంగా హాజరుకాని ప్రజాప్రతినిధులు

సాగునీటి కాల్వలు.. డ్రెయిన్లలో నిర్వహణ పనులే ప్రధాన అంశంగా శనివారం మచిలీపట్నంలోని జెడ్పీ హాల్లో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. జూన్‌ మొదట్లోనే ఖరీఫ్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాల్వలు, డ్రెయిన్లలో తూడు తొలగించేందుకు, ఇతర పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సభ్యులు ప్రధాన సమస్యగా లేవనెత్తగా, కాల్వల నిర్వహణ పనులు చేపట్టేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరతానని చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులెవరూ హాజరుకాలేదు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షతన శనివారం జెడ్పీ సమావేశ హాల్లో జరిగిన జిల్లా షరిషత్‌ సర్వసభ్య సమావేశానికి శాసనసభ్యులు, ఎంపీలు హాజరుకాలేదు. జెడ్పీటీసీ సభ్యులు కూడా పూర్తిస్థాయిలో రాలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో అజెండా అంశాలు లేకుండానే సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ప్రస్తుత సమావేశం శాఖలవారీగా సమీక్షించడం లేదని, మరో నెలరోజుల్లో మళ్లీ నిర్వహిస్తామని చైర్‌పర్సన్‌ తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాల్వల నిర్వహణ పనులకు అనుమతులు ఇవ్వాలని తాను కూడా ఉన్నతాధికారులను కోరతానని చెప్పారు. కాల్వలకు నీటిని విడుదల చేసే వరకు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లే కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు.

ఆ పీహెచ్‌సీల్లో వైద్యులను మార్చండి

కోడూరు పీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యుడు వివేక్‌ ఆసుపత్రికి వచ్చిన రోగులను పట్టించుకోవడం లేదని, కనీసం నాడి కూడా చూడట్లేదని, రోగుల పట్ల చులకనభావంతో మాట్లాడుతున్నాడని, ఆయన్ను మార్చాలని కోడూరు జెడ్పీటీసీ సభ్యుడు వై.వెంకటసత్యనారాయణ కోరారు. అలాగే, పామర్రు మండలం నిమ్మకూరు పీహెచ్‌సీలోనూ ఇదే పరిస్థితి ఉందని, అక్కడి వైద్యులు, సిబ్బంది ఆసుపత్రికి వచ్చిన వారిని పట్టించుకోవడం లేదని పామర్రు ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్‌ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వత్సవాయి పీహెచ్‌సీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని వత్సవాయి జెడ్పీటీసీ సభ్యుడు అధికారులకు తెలిపారు. డీఎంఅండ్‌హెచ్‌వో గీతాభాయి మాట్లాడుతూ కోడూరు పీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యుడి పనితీరుపై విచారణ చేశామన్నారు. నిమ్మకూరు, ఇతర పీహెచ్‌సీల వైద్యులతో తాను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. నున్న పీహెచ్‌సీ భవనం నిర్మాణానికి నిధులు విడుదలైనా పనులు చేయడం లేదని సభ్యులు తెలిపారు.

చేపల చెరువులకు తాగునీరా..?

తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్‌లో కాల్వలకు నీటి ని విడుదలచేస్తే కృత్తివెన్ను మండలంలోని సీతనపల్లిలోని తాగునీటి చెరువును నింపకుండా చేపల చెరువులకు నీటిని మళ్లించారని కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి తెలిపారు. కృత్తివెన్ను మండల ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈకి ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ఏఈ తీరుపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈకి సూచించారు.

కాల్వల నిర్వహణ పనులు చేపట్టండి

గూడూరు మండలంలోని లజ్జబండ డ్రెయిన్‌లో గుర్రపుడెక్క, జమ్ము పేరుకుపోయిందని, వాటిని నిర్మూలించేందుకు సకాలంలో రసాయనాలు పిచికారీ చేయకుంటే రైతులు ఇబ్బందులు పడతారని గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్‌రంగబాబు అన్నారు. కాల్వల నిర్వహణ పనులు చేయకుంటే ఖరీఫ్‌లో రైతులు ఇబ్బందులపాలవుతారని సభ్యులంతా పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగిందని, నాలుగైదు రోజుల్లో పనులకు సంబంధించిన టెండర్లు పిలిచే అవకాశం ఉందని ఎస్‌ఈ సమాధానం ఇచ్చారు.

ఉల్లిపాలెం బ్రిడ్జికి అప్రోచ్‌ ఎప్పుడు..?

మచిలీపట్నం-కోడూరు మండలాలను కలిపే ఉల్లిపాలెం బ్రిడ్జికి అప్రోచ్‌ సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ అప్రోచ్‌ నిర్మాణం చేపట్టాలని కోడూరు జె డ్పీటీసీ సభ్యుడు ఆర్‌అండ్‌బీ అధికారులను కోరారు. గన్నవరం-మానికొండ రహదారి గోతులుగా మారిపోయిందని, కనీస మరమ్మతులైనా చేయాలని జెడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు కోరారు. తోట్లవల్లూరు మండలంలోని దేవరపల్లిలో పాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉందని, బాపులపాడు మండలం వేలేరు జెడ్పీ పాఠశాలకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిందని, కనీస మరమ్మతులైనా చేయాలని సభ్యులు కోరారు. నాడు-నేడు పనులకు సంబంధించి పాఠశాలల్లో నిర్మాణ పనులు నిలిపివేశారని, పాఠశాలలు తెరిచే సమాయానికైనా ఈ పనులు ప్రారంభించాలని సభ్యులు కోరారు. ఈ సమస్యలపై ప్రధానంగా దృష్టిసారించి పరిష్కరించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో ఆనందకుమార్‌, ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2024 | 12:54 AM