Share News

నెంబర్ల మాయ

ABN , Publish Date - May 25 , 2024 | 12:45 AM

ఏ నెంబర్‌తో సిమ్‌కార్డు ఉంటే ఏంటి? ఏదో ఒకటి ఉంది కదా.. అనుకుంటారు చాలామంది. క్రికెట్‌ బుకీల స్టైల్‌ మాత్రం వేరు. వారి వ్యవహారమంతా ఫ్యాన్సీ నెంబర్ల చుట్టూనే తిరుగుతుంది. కొత్త కారు నుంచి బెట్టింగ్‌లకు కీలకంగా మారే సిమ్‌కార్డుల వరకూ ప్రతి నెంబర్‌ ఫ్యాన్సీగా ఉండడానికే చూస్తారు. ఇందుకోసం రూ.లక్షలు వెచ్చిస్తారు. బుకీల ఈ ఆసక్తే ఇప్పుడు పోలీసులకు కీలకంగా మారింది. బెంగళూరు రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారి సిమ్‌కార్డుల ఆధారంగా కేసు దర్యాప్తు ముందుకు సాగుతోంది.

నెంబర్ల మాయ

రేవ్‌ పార్టీ కేసులో కీలకమైన బుకీలకు ఫ్యాన్సీ నెంబర్లు

వాటి ఆధారంగా పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ఒక్కొక్కరి వద్ద 10 నుంచి 20 సిమ్‌కార్డులు

సర్వీసు ప్రొవైడర్ల అవుట్‌లెట్లతో ప్రత్యక్ష సంబంధాలు

ఖరీదైన కార్లకు రూ.లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్లు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : బెంగళూరు శివారులోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీ వ్యవహారంతో బుకీల డొంక కదులుతోంది. బెంగళూరు పోలీసులు పార్టీలో పాల్గొన్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల ఆధారంగా కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరోపక్క విజయవాడలో బుకీల జాబితాల్లో ఉన్న పేర్లపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

సిమ్‌కార్డులకు రూ.వేలల్లో...

బెట్టింగ్‌లో ఏ టీమ్‌పై ఎంత పందెం పెట్టాలి, దాన్ని ఎలా పెంచాలి, పందెం పెట్టేవారిని ఎలా రెచ్చగొట్టాలి అనే విషయాలను కిందిస్థాయిలో చోటా బుకీలకు ఎప్పటికప్పుడు సూచనలు, సమాచారం ఇవ్వడానికి ప్రధాన బుకీలు ఫోన్‌ నెంబర్లు ఉపయోగిస్తారు. ఒక్కొక్కరి వద్ద సుమారు 10 నుంచి 20 ఫోన్‌ నెంబర్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో బెట్టింగ్‌కు ఒక్కో నెంబరును కేటాయించుకుంటారు. ఇవన్నీ ఫ్యాన్సీ నెంబర్లే. మొబైల్‌ నెంబర్లకు ఉండే పది అంకెల్లో మొదటి ఐదంకెలు ఒకవిధంగా, చివరి ఐదంకెలు ఒకవిధంగా ఉండేలా ఎంపిక చేసుకుని కొనుగోలు చేస్తారు. మార్కెట్లోకి కొత్త ఫ్యాన్సీ నెంబర్లు విడుదల కాగానే, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి ఆయా సర్వీసు ప్రొవైడర్లకు సంబంధించిన పీవోఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌)లోని సిబ్బందితో సంబంధాలు కొనసాగిస్తారు. బుకీలు నేరుగా రంగంలోకి దిగకుండా మూడు, నాలుగు దశల్లో ఉన్న బుకీలను ఉపయోగించుకుంటున్నారు. ట్రాయ్‌ నిబంధనల ప్రకారం ఒక ఆధార్‌ కార్డుపై రోజుకు ఒక నెంబరే సర్వీసు ప్రొవైడర్లు జారీ చేయాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించి, ఆధార్‌ కార్డులను మార్చి మరీ ఫ్యాన్సీ నెంబర్లను కేటాయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఫ్యాన్సీ మొబైల్‌ నెంబర్‌కు వేలాది రూపాయలను వెచ్చిస్తున్నట్టు సమాచారం.

కార్లకు రూ.లక్షల్లో..

బెట్టింగ్‌లో సంపాదించిన డబ్బుతో రూ.లక్షలు వెచ్చించి ఖరీదైన కార్లను కొంటున్నారు. వీటికి తీసుకునే ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్‌ నెంబర్ల కోసం కూడా రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. విజయవాడకు చెందిన ఓ బుకీ కొద్దిరోజుల క్రితం రూ.95 లక్షలు వెచ్చించి ఓ కారు కొన్నాడు. దానికి ఒకే అంకె ఉండే ఫ్యాన్సీ నెంబర్‌ను రూ.5 లక్షలకు కొన్నాడు. నగరంలో ఉండే ఓ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇతను పలు సెటిల్‌మెంట్లు చేసినట్టు సమాచారం. ప్రియురాలికి ఓ ఖరీదైన విల్లాను కానుకగా ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. ఒకప్పుడు నగరంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లలో ఈ బుకీ కుటుంబం బజ్జీల స్టాళ్లను నిర్వహించేది. ఆ ప్రజాప్రతినిధి అండతో ఏకంగా ఎగ్జిబిషన్లను నిర్వహించుకోవడంతో పాటు స్టాళ్లను తన ఆధీనంలో పెట్టుకునే స్థాయికి ఈ బుకీ ఎదిగాడు. దీన్ని బట్టి బెట్టింగ్‌ల్లో ఏ స్థాయిలో ఆదాయం సమకూరుతుందో అర్థమవుతుంది.

Updated Date - May 25 , 2024 | 12:45 AM