Share News

కోట్ల ఆదాయంపై కన్ను!

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:23 AM

అధికారం చేతిలో ఉంది. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఏదడిగినా కాదనకుండా చేసిపెట్టే స్థానిక ఎమ్మెల్యే బలం ఉంది. ఇంకేం కావాలి. ఏం చేసినా ఎదురే లేదు. అనుకున్నదే తడవుగా రూ.కోట్లలో ఆదాయం వచ్చే గుడివాడ వ్యవసాయ మార్కెట్‌ యార్డుపై అక్కడి చైర్‌పర్సన్‌ భర్త కన్నేశాడు. కార్యాలయాన్ని పరోక్షంగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. వచ్చేపోయేవారి వివరాల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. మార్కెట్‌ యార్డు పరిధిలో చెక్‌పోస్టులు పెట్టి భారీగా ఆదాయం పొందుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.

కోట్ల ఆదాయంపై కన్ను!

గుడివాడ మార్కెట్‌ యార్డులో చైర్‌పర్సన్‌ భర్త పెత్తనం

చెక్‌పోస్టుల్లో తనిఖీలు ఆయనే

సిబ్బందిపైనా అజమాయిషీ ఆయనదే

సీసీ కెమెరాలూ అతని ఫోనుకే అనుసంధానం

కొడాలి నాని ముఖ్య అనుచరుడు.. కేసినో నిర్వహణలో ప్రధాన సూత్రధారి

దీంతో ఆయనకు ఎదురుచెప్పే వారే లేరు

మాట వినడం లేదని కార్యదర్శిని సాగనంపేస్తున్నారు

మార్కెట్‌ యార్డు ఆదాయం నెలకు రూ.6 కోట్లు

అధికారం చేతిలో ఉంది. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఏదడిగినా కాదనకుండా చేసిపెట్టే స్థానిక ఎమ్మెల్యే బలం ఉంది. ఇంకేం కావాలి. ఏం చేసినా ఎదురే లేదు. అనుకున్నదే తడవుగా రూ.కోట్లలో ఆదాయం వచ్చే గుడివాడ వ్యవసాయ మార్కెట్‌ యార్డుపై అక్కడి చైర్‌పర్సన్‌ భర్త కన్నేశాడు. కార్యాలయాన్ని పరోక్షంగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. వచ్చేపోయేవారి వివరాల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. మార్కెట్‌ యార్డు పరిధిలో చెక్‌పోస్టులు పెట్టి భారీగా ఆదాయం పొందుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) గుడివాడ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు నెలకు సుమారు రూ.6 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంపై వైసీపీ నాయకులు కన్నేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే నందివాడకు చెందిన ఎం.సునీతను చైర్‌పర్సన్‌గా నియమించారు. పేరుకు ఆమె పదవిలో ఉన్నా పెత్తనం అంతా స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఆంతరంగికుడైన వ్యక్తే సాగించేవారు. సుమారు రెండేళ్లపాటు పదవిలో ఉన్న సునీతను ఆ తర్వాత పక్కన పెట్టేశారు. 2 ఏళ్లపాటు చైర్‌పర్సన్‌ నియామకం చేయకుండా నాని ఆంతరంగికుడే చక్రం తిప్పుతూ వచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దళిత సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కొడాలి నాని అనుచరుడైన మట్టా జాన్‌ విక్టర్‌ సతీమణి నాగమణిని 4 నెలల క్రితం చైర్‌పర్సన్‌గా నియమించారు. జాన్‌ విక్టర్‌ది గుడివాడ మండలం లింగవరం. గుడివాడ రూరల్‌ వైసీపీ కన్వీనర్‌గా కూడా పనిచేస్తున్నారు. గుడివాడలో 2022 సంక్రాంతికి ఎమ్మెల్యే నాని ఆధ్వర్యంలో కేసినో నిర్వహణలో జాన్‌ విక్టర్‌ ప్రధాన పాత్ర పోషించారు. కేసినోలో వేసిన చిందులతోనే జాన్‌ విక్టర్‌ పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత టీడీపీ నిజనిర్ధారణ కమిటీపై దాడి ఘటనలోనూ విక్టర్‌ కీలకంగా వ్యవహరించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా దళితులను ఆకట్టుకోవడంతోపాటు విక్టర్‌ సేవలకు ఉపకారంగా ఆయన సతీమణికి మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ పదవి దక్కిందని చెబుతారు.

పదవి సతిది.. పెత్తనం పతిది!

జాన్‌ విక్టర్‌ సతీమణికి మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ పదవి లభించిన నాటి నుంచి మార్కెట్‌ యార్డుపై పట్టు బిగించారు. యార్డు కార్యాలయంలో ప్రభుత్వ ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని తన ఫోనుకు అనుసంధానించుకున్నారు. కార్యాలయానికి ఎవరు వస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలను నిరంతరం ఫోను ద్వారా పర్య వేక్షిస్తుంటారు. గుడివాడ మార్కెట్‌ యార్డు పరిధిలో 5 చెక్‌పోస్టులు ఉన్నాయి. గుడివాడ వ్యవసా యపరంగా, పాడిపంటల పరంగా సంపన్నమైనది కావడంతో నెలకు సుమారు రూ.6 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మరో రూ.కోటి పైచిలుకు ఆదాయం ప్రతినెలా వైసీపీ నేతల ఖాతాల్లోకి పోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. సిబ్బందిని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు చెక్‌పోస్టుల్లో చైర్‌పర్సన్‌ భర్త తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయనకు తనిఖీలు నిర్వహించేందుకు ఎలాంటి అధికారం లేకపోయినా ఈ తనిఖీలు నిర్వహించడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్రటరీ తాను చెప్పినట్టు వినడం లేదని తమ ఆదాయానికి అడ్డం పడుతున్నా రన్న ఉద్దేశంతో ఆయన్ను డిప్యుటేషన్‌పై పంపేందుకు ఆగమేఘాలపై ఫైలు సిద్ధం చేశారు. నేడో రేపో సెక్రటరీని సాగనంపనున్నారు. గుడ్లవల్లేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సెక్రటరీని గుడివాడకు ఇన్‌చార్జిగా నియమించనున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే వ్యవసాయ మార్కెట్‌ యార్డులపైనా వైసీపీ నేతలు గద్దల్లా వాలిపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 15 , 2024 | 01:23 AM