గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భూ సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Jul 26 , 2024 | 01:01 AM
గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భూమి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.
మచిలీపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భూమి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. విమానాశ్రయ విస్తరణకు రైతుల నుంచి సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లింపు, సీఆర్‌డీఏలో ప్లాట్‌ల కేటాయింపు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం, వార్షిక కౌలు, సీఆర్‌డీఏలో ప్లాట్‌ల కేటాయింపు కోసం సీఆర్‌డీఏకు లేఖలు రాయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. విమానాశ్రయ సరిహద్దు వెంబడి జరుగుతున్న నిర్మాణాలతో భద్రతాపరమైన ఇబ్బందలు లేకుండా చూడాలని, విమానాశ్రయం పక్కనే ఉన్న భూముల్లో వివిధ పంటలు సాగు చేస్తుండటంతో పక్షుల సంచారం అధికంగా ఉండి విమాన రాకపోకలకు అంతరాయంగా ఉందని, ఈ అంశంపైనా అధికారులు పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జేసీ గీతాంజలిశర్మ డీఆర్వో కె.చంద్రశేఖరరావు, గుడివాడ ఆర్డ్డీవో పద్మావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.